ఎన్‌ఎండీసీకి ‘ఉక్కు’ భూములు..!

ABN , First Publish Date - 2023-08-22T03:29:39+05:30 IST

ఆర్థిక కష్టాల్లో ఉన్న విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు నిధుల సమీకరణకు అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తోంది. ప్లాంటు వద్ద వేలాది ఎకరాలు ఉండడంతో వాటి కోసం కార్పొరేట్‌ కంపెనీలు ముందుకు వస్తున్నాయి.

ఎన్‌ఎండీసీకి ‘ఉక్కు’ భూములు..!

పెల్లెట్‌ ప్లాంటు, స్టాక్‌యార్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు

కార్మిక సంఘాల సుముఖం

స్టీల్‌ ప్లాంట్‌కు 700 నుంచి 800 కోట్ల నిధులు వస్తాయని అంచనా

స్టాక్‌యార్డు ఏర్పాటు కోసం భూములు అడుగుతున్న అదానీ

(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి)

ఆర్థిక కష్టాల్లో ఉన్న విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు నిధుల సమీకరణకు అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తోంది. ప్లాంటు వద్ద వేలాది ఎకరాలు ఉండడంతో వాటి కోసం కార్పొరేట్‌ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్‌ మినరల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎండీసీ) విశాఖలో పెల్లెట్‌ ప్లాంటు, స్టాక్‌యార్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన సుమారు 1,000 ఎకరాల కోసం అన్వేషిస్తోంది. స్టీల్‌ప్లాంటులో తగిన భూములు కేటాయిస్తే అక్కడే పెల్లెట్‌ ప్లాంటు, స్టాక్‌యార్డు పెట్టుకుంటామని చెబుతోంది. ఇందులో భాగంగా వారం క్రితం భూములను కూడా పరిశీలించి వెళ్లింది. ఎవరికి భూములు ఇచ్చినా లీజు విధానమే అవలంభిస్తారని, ఏటా లీజుతో పాటు గుడ్‌విల్‌ కింద కొంత మొత్తం ఇవ్వాల్సి ఉంటుందని అధికార వర్గాల సమాచారం. స్టీల్‌ప్లాంటుకు, ఎన్‌ఎండీసీకి ఒప్పందం కుదిరితే లీజుతో పాటు రూ.700 నుంచి రూ.800 కోట్ల నిధులు కూడా వస్తాయని అంచనా వేస్తున్నారు. స్టీల్‌ తయారీకి పెల్లెట్లు కూడా అవసరమేనని, ఇప్పుడు అవసరమైన వాటిని స్టీల్‌ప్లాంటు కర్ణాటక నుంచి తెప్పించుకుంటోందని, ఎన్‌ఎండీసీ ఆ ప్లాంటు ఇక్కడే పెట్టుకుంటే రవాణా వ్యయాలు కలిసి వస్తాయని అధికార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ చర్చలు విజయవంతమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

మరోవైపు అదానీ యత్నం

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటుని టేకోవర్‌ చేయాలనే ఆలోచన లేదని ఇటీవల స్పష్టంచేసిన అదానీ (గంగవరం) పోర్టు యాజమాన్యం స్టాక్‌యార్డు కోసం మాత్రం భూములు అవసరమని, సుమారుగా 1,000 ఎకరాలు కావాలని స్టీల్‌ప్లాంటు యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. ఒకవేళ అదానీకి భూములు ఇచ్చినట్టయితే నిర్వాసితుల సమస్యకు పరిష్కారం చూపించాల్సి ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అందుకు వివిధ ప్రత్యామ్నాయాలను చూపిస్తున్నారు. అదేవిధంగా గంగవరం పోర్టుకు భూములు ఇస్తే ప్రతిఫలంగా స్టీల్‌ ప్లాంటుకు ఒక బెర్తు శాశ్వత ప్రాతిపదికన కేటాయించాలని, అలాగే గుడ్‌విల్‌ కింద కొంత మొత్తం ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ప్లాంటు ప్రయోజనాలను అంగీకరించకుండా ఒప్పందం చేయడానికి అంగీకరించమని కార్మిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Updated Date - 2023-08-22T03:29:39+05:30 IST