Share News

పన్ను వసూళ్లకు స్పెషల్‌డ్రైవ్‌

ABN , First Publish Date - 2023-12-03T01:21:50+05:30 IST

పన్ను వసూళ్లపై జీవీఎంసీ కమిషనర్‌ సాయికాంత్‌వర్మ ప్రత్యేక దృష్టిసారించారు.

పన్ను వసూళ్లకు స్పెషల్‌డ్రైవ్‌

జీవీఎంసీ పరిధిలో మొత్తం అసెస్‌మెంట్లు 5.6 లక్షలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రావాల్సిన ఆస్తిపన్ను రూ.395.3 కోట్లు

నవంబర్‌ రెండు వరకూ వసూలైంది రూ.249.17 కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను రూ.395.3 కోట్లు వసూలు చేయాలని టార్గెట్‌

నవంబర్‌ 30 నాటికి రూ.249.17 కోట్లు వసూలు

శతశాతం వసూలుపై కమిషనర్‌ దృష్టి

ఈ-పోస్‌ యంత్రాలతో వసూళ్లు పెంచాలని ఆదేశం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

పన్ను వసూళ్లపై జీవీఎంసీ కమిషనర్‌ సాయికాంత్‌వర్మ ప్రత్యేక దృష్టిసారించారు. ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్నుతోపాటు నీటి చార్జీలు వసూలుకు స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో శతశాతం పన్ను వసూలు చేయాలని ఆయన పట్టుదలగా ఉన్నారు.

జీవీఎంసీ పరిధిలో 5.6 లక్షల అసెస్‌మెంట్లు ఉన్నాయి. వీటి ద్వారా గత ఏడాది రూ.357.53 కోట్లు ఆస్తి పన్ను వసూలు కాగా, ఈ ఏడాది రూ.395.3 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటితోపాటు ఖాళీ స్థలాల పన్ను రూపంలో రూ.50 కోట్లు, నీటి సరఫరా చార్జీల ద్వారా రూ.209.51 కోట్లు వరకూ వసూలు చేయాలని టార్గెట్‌గా నిర్ణయించారు. ఆస్తిపన్ను వసూళ్లను పరిశీలిస్తే నవంబరు 30 నాటికి రూ.249.17 కోట్లు వసూలైంది. ఇందులో రూ.85.02 కోట్లు ఆన్‌లైన్‌ చెల్లింపులు, రూ.162.34 కోట్లు జీవీఎంసీ పరిధిలోని సౌకర్యం కేంద్రాల ద్వారా వచ్చింది. మరో రూ.1.81 కోట్లు ఇటీవల ప్రవేశపెట్టిన ఈ-పోస్‌ యంత్రాల ద్వారా వార్డు సచివాలయ అడ్మిన్‌ కార్యదర్శులు ఇంటింటికీ వెళ్లి వసూలు చేశారు. అలాగే ఖాళీ స్థలాల పన్ను రూపంలో రూ.50 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా నవంబరు 30 నాటికి దాదాపు రూ.41 కోట్లు వసూలైంది. ఇందులో రూ.12 కోట్లు ఆన్‌లైన్‌, రూ.28.5 కోట్లు సౌకర్యం కేంద్రాల ద్వారా రాగా, మరో రూ.30 లక్షలు సచివాలయ అడ్మిన్‌ కార్యదర్శులు వసూలు చేశారు. అదేవిధంగా నీటి సరఫరా చార్జీల విషయానికి వస్తే రూ.209.52 కోట్లు వసూలు లక్ష్యం కాగా రూ.121.44 కోట్లు వసూలైంది. ఇందులో రూ.6.65 కోట్లు ఆన్‌లైన్‌, రూ.110.08 కోట్లు సౌకర్యం కేంద్రాల ద్వారా వసూలు కాగా, రూ.4.71 కోట్లు కార్యదర్శులు వసూలుచేశారు. మార్చి నెలాఖరు నాటికి శతశాతం పన్నులు వసూలు చేయాల్సి ఉన్నందున జీవీఎంసీ కమిషనర్‌ సాయికాంత్‌వర్మ రెవెన్యూ అధికారులతో పన్ను వసూళ్లపై సమీక్షలు నిర్వహిస్తున్నారు.

అయితే పన్ను చెల్లింపుదారుల్లో అత్యధికులు ఆన్‌లైన్‌లో లావాదేవీలు పూర్తిచేస్తున్నందున ఆ మొత్తం నేరుగా రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణలోని సీఎఫ్‌ఎంఎస్‌కు చెందిన పీడీ అకౌంట్‌కు జమ అయిపోతోంది. ఆ మొత్తాన్ని దశల వారీగా జీవీఎంసీకి రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి ఇస్తోంది. ఈ ప్రక్రియలో జాప్యం చోటుచేసుకుంటోంది. దీంతో ఆన్‌లైన్‌లో పన్ను చెల్లింపు లావాదేవీలను తగ్గించి, జీవీఎంసీ ఖాతాకు ఎక్కువ మొత్తం జమ అయ్యేలా చూడాలనే ఉద్దేశంతో కమిషనర్‌ ఈ-పోస్‌ యంత్రాలను కొనుగోలు చేశారు. వాటిని వార్డు సచివాలయంలోని అడ్మిన్‌ కార్యదర్శులకు అందజేసి తమ పరిధిలోని ఆస్తి పన్ను, వీఎల్‌టీ, నీటి సరఫరా చార్జీలను వసూలు చేయించాలని, లేదంటే వార్డు సచివాలయంలో పన్ను చెల్లించేందుకు వచ్చేవారికి అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

Updated Date - 2023-12-03T01:21:51+05:30 IST