చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
ABN , First Publish Date - 2023-03-19T01:03:54+05:30 IST
అంగన్‌వాడీ కేంద్రాల్లో తక్కువ బరువున్న చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఐసీడీఎస్ అధికారులను జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశించారు.

తక్కువ బరువున్న వారిపై పర్యవేక్షణ
జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశం
గిరిజన ప్రాంతాల్లో అంగన్‌వాడీ సేవలను మెరుగుపర్చాలని సూచన
పాడేరు, మార్చి 18(ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాల్లో తక్కువ బరువున్న చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఐసీడీఎస్ అధికారులను జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఐసీడీఎస్ అధికారులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిన్నారులు ఆహారం సరిగా తీసుకోకుంటే, అందుకు గల కారణాలను డాక్టర్లను అడిగి తెలుసుకోవాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోని బరువు తక్కువగా ఉన్న చిన్నారులను రెండు వారాలు ప్రత్యేకంగా పర్యవేక్షించడంతోపాటు మెనూ ప్రకారం పోషకాహారాన్ని క్రమంగా పెడితే, బరువు పెరగడంతోపాటు ఆరోగ్య సమస్యలు తలెత్తవన్నారు. మరీ తక్కువ బరువున్న చిన్నారులను స్థానిక జిల్లా ఆస్పత్రిలోని పౌష్టికాహార పునరావాస కేంద్రంలో చేర్పించాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో సేవలను మెరుగుపరచాలని, చిన్నారుల పట్ల అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, సూపర్‌వైజర్లు వారానికి ఐదు రోజులు అంగన్‌వాడీ కేంద్రాలను పక్కాగా పర్యవేక్షించాలని ఆదేశించారు. సూపర్‌వైజర్లు అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించే ఫొటోలను సమర్పించాలన్నారు. తక్కువ బరువు గల పిల్లల కోసం ప్రత్యేక రిజిస్టర్లు నిర్వహించి, ప్రతి రోజు వారి బరువును నమోదు చేయాలన్నారు. ప్రతి వారం తాము వాటిపై సమీక్షిస్తానని, సమావేశానికి వచ్చేటప్పుడు ఆయా రిజిస్టర్లు, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించిన ఫొటోలను తీసుకురావాలని, రక్తహీనతగా ఉన్న తల్లులు, పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎంత మందికి ఆహారం సిద్ధం చేస్తున్నారు?, ఎంత మందికి టేక్‌హోమ్ రేషన్ పంపుతున్నారనే విషయాలను గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ అశుతోశ్ శ్రీవాత్సవ, ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి, సీడీపీవోలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.