పోలీసు వలయంలో సింహాచలం
ABN , First Publish Date - 2023-09-20T00:29:11+05:30 IST
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని, త్వరగా విడుదల కావాలని ఆకాంక్షిస్తూ సింహాచల వరాహలక్ష్మీనృసింహస్వామికి పూజలు చేయడానికి వస్తున్న టీడీపీ నాయకులు, అభిమానులను పోలీసులు మంగళవారం అడ్డుకున్నారు.

ఎక్కడికక్కడ టీడీపీ నేతల నిర్బంధం
చంద్రబాబు కోసం పూజలు చేయడానికి సింహగిరి వస్తున్న నేతల అడ్డగింత
అన్ని మార్గాల్లో తనిఖీలు.. ముందస్తు అరెస్టులు
సింహాచలం, సెప్టెంబరు 19: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని, త్వరగా విడుదల కావాలని ఆకాంక్షిస్తూ సింహాచల వరాహలక్ష్మీనృసింహస్వామికి పూజలు చేయడానికి వస్తున్న టీడీపీ నాయకులు, అభిమానులను పోలీసులు మంగళవారం అడ్డుకున్నారు. వేకువజాము నుంచే పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సింహగిరికి వచ్చే అన్ని మార్గాల్లో మోహరించారు. వాహనాలను విస్తృతంగా తనిఖీ చేశారు. సింహాచలం వచ్చే బస్సులను కూడా వదల్లేదు. ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి పర్యవేక్షణలో పెద్ద సంఖ్యలో పోలీసులు సింహాచల పాత గోశాల కూడలి నుంచి పాత అడివివరం కూడలి వరకు మోహరించారు. ఆరిలోవ వైపు నుంచి వస్తున్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, పార్టీ నాయకులను సింహాచలం తొలిపావంచా కూడలి వద్ద పోలీసులు అరెస్టు చేశారు. సింహాచలం చేరుకున్న సుమారు 50 మందిని అదుపులోకి తీసుకుని నగరంలోని పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరిని అడ్డుకుని వెనక్కి పంపేశారు. 98వ వార్డు కార్పొరేటర్ పివి నరసింహం, పార్టీ 98వ వార్డు అధ్యక్షుడు పంచదార్ల శ్రీనివాస్, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి సతివాడ శంకరరావు తదితర నేతలను మంగళవారం వేకువజామునే హౌస్ అరెస్టు చేశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సింహాచలం మెయిన్‌రోడ్డులో ర్యాలీ నిర్వహిస్తున్న పార్టీ బీసీ సెల్ నేతలు లొడగల కృష్ణ, పొడుగు కుమార్, ఆరేటి మహేష్, తమ్మిన మోహన్, తాతాజీ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా పార్టీ మాడుగుల నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీజీ కుమార్, చీడికాడ జడ్పీటీసీ మాజీ సభ్యురాలు పి. సత్యవతి తమ బృందంతో సింహగిరికి చేరుకుని సింహాద్రినాథునికి పూజలు చేశారు. అనంతరం ప్రధాన రాజగోపురం వద్ద మోకాళ్లపై నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు మెట్లమార్గంలో సింహగిరికి చేరుకుని స్వామివారిని ప్రార్థించారు.
ఆలయాల వద్ద 144 సెక్షన్ విధించడం దారుణం
దేవాలయాల వద్ద 144 సెక్షన్ పెట్టడం దారుణమని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి పరిపాలన చూడలేదన్నారు. చంద్రబాబు ఆరోగ్యం కోసం పూజలు చేయడానికి ఆలయానికి వస్తే అడ్డుకోవడం ఎంత వరకు సమంజసమని అన్నారు.
రాష్ట్రంలో రాజ్యాంగం అమలు అవుతోందా?
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పరిపాలనలో రాష్ట్రంలో రాజ్యాంగం అమలు అవుతుందా? లేదా? అనే అనుమానం కలుగుతోందని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. సింహాద్రి అప్పన్నకు పూజలు చేసేందుకు సింహాచలం చేరుకున్న ఆమెను గ్రామదేవత పైడితల్లెమ్మ ఆలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం తమ సమస్యలపై ఉద్యమం చేసే వీలుందని, భావప్రకటనను వ్యక్తం చేసే ప్రాథమిక హక్కును జగన్ ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. పార్టీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం హిందూ మతాన్ని నాశనం చేసేందుకు పథకం ప్రకారం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. దైవ దర్శనానికి కూడా 144 సెక్షన్ విధించడం ఇందులో భాగమేనని అన్నారు. ఆయన వెంట వార్డు అధ్యక్షుడు పంచదార్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బి.పైడిరాజు, నేతలు రాజనాల సత్యారావు, రౌతు రాంబాబు తదితరులు వున్నారు.