Share News

వణికిస్తున్న చలి

ABN , First Publish Date - 2023-12-11T01:09:59+05:30 IST

మన్యంలో చలి జనాన్ని వణికిస్తున్నది. మిచౌంగ్‌ తుఫాన్‌ వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. ఆదివారం చింతపల్లిలో 11 డిగ్రీల సెంటీగ్రేడ్‌ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్‌, వాతావరణ విభాగం నోడల్‌ అధికారి డాక్టర్‌ ఎం.సురేశ్‌కుమార్‌ తెలిపారు.

వణికిస్తున్న చలి
ముంచంగిపుట్టులో ఆదివారం ఉదయం 9 గంటలకు కురుస్తున్న మంచు

- చింతపల్లిలో 11 డిగ్రీలు

చింతపల్లి, డిసెంబరు 10: మన్యంలో చలి జనాన్ని వణికిస్తున్నది. మిచౌంగ్‌ తుఫాన్‌ వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. ఆదివారం చింతపల్లిలో 11 డిగ్రీల సెంటీగ్రేడ్‌ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్‌, వాతావరణ విభాగం నోడల్‌ అధికారి డాక్టర్‌ ఎం.సురేశ్‌కుమార్‌ తెలిపారు. నెలాఖరు నాటికి కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గుతాయన్నారు. చలితో పాటు అర్ధరాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం పది గంటల వరకు దట్టంగా మంచు కురుస్తున్నది. లంబసింగి, చింతపల్లి, తాజంగి ప్రాంతాల్లో ఉదయం వేళల్లో మంచు చిరుజల్లుల్లా కురుస్తున్నది. సాయంత్రం నాలుగు గంటల నుంచే శీతలగాలులు వీస్తున్నాయి. మంచు ఉధృతి అధికంగా ఉండడంతో వాహన చోదకులు లైట్లు వేసుకుని నెమ్మదిగా ప్రయాణం సాగిస్తున్నారు. ప్రజలు అధిక సమయం ఉన్ని దుస్తుల్లోనే కనిపిస్తున్నారు. ప్రధాన కేంద్రాల్లో జనసంచారం తగ్గింది. దుకాణాలను సాధారణ రోజుల కంటే ముందుగానే మూసివేస్తున్నారు. చలి తీవ్రతకు చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

పాడేరులో 13 డిగ్రీలు

పాడేరు, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం శీతాకాలం కావడంతో మన్యంపై మంచు దుప్పటి కప్పుకొంటున్నది. ఆదివారం తెల్లవారుజాము నుంచి ఉదయం పది గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్మేసింది. దీంతో ఎదురుగా వస్తున్న వాహనాలు సైతం కనిపించని పరిస్థితి ఏర్పడడంతో లైట్లు వేసుకుని వాహనాలు రాకపోకలు సాగించాయి. పొగ మంచుతో మన్యంలోని ప్రకృతి అందాలు మరింత మనోహరంగా కనిపిస్తున్నాయి. కాగా పాడేరులో ఆదివారం 13 డిగ్రీలు కనిష్ఠ, 24 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - 2023-12-11T01:10:00+05:30 IST