‘స్కిల్‌ డెవలప్‌మెంట్‌’ను చూపిస్తాం వస్తారా?

ABN , First Publish Date - 2023-09-26T00:41:48+05:30 IST

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ శిక్షణ కేంద్రాలు కళ్లముందు కనిపిస్తున్నప్పటికీ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కళ్లు లేని కబోదిలా మాట్లాడడం విడ్డూరంగా ఉందని, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు అన్నారు.

‘స్కిల్‌ డెవలప్‌మెంట్‌’ను చూపిస్తాం వస్తారా?
కళ్లకు గంతలు కట్టుకొని, చేతులకు సంకెళ్లు వేసుకొని నిరసన తెలుపుతున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు, నాయకులు

మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగజగదీశ్‌ సవాల్‌

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కళ్లకు గంతలు, చేతులకు బేడీలతో ప్రదర్శన

అనకాపల్లి, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ శిక్షణ కేంద్రాలు కళ్లముందు కనిపిస్తున్నప్పటికీ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కళ్లు లేని కబోదిలా మాట్లాడడం విడ్డూరంగా ఉందని, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు అన్నారు. చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా సోమవారం పార్టీ శ్రేణులతో కలిసి కళ్లకు గంతలు కట్టుకొని, చేతులకు బేడీలు వేసుకొని స్థానిక రింగ్‌రోడ్డు కూడలిలో వినూత్న ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యావంతులైన యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 40 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇప్పటికీ అవి అక్కడే వున్నాయని, మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు వస్తే తమ సొంత ఖర్చుతో ఈ కేంద్రాలను చూపించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. టీడీపీ హయాంలో సుమారు నాలుగు లక్షల మంది శిక్షణ పొందగా వీరిలో 85 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. ఈ విషయం బొత్స సత్యనారాయణకు కూడా తెలుసని, కానీ యువతకు శిక్షణ ఇవ్వలేదని ఉద్దేశపూర్వకంగానే ఆరోపించారని ఆయన అన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా వున్నప్పుడు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న బొత్స.. వోక్స్‌ వ్యాగన్‌ కంపెనీ ఏర్పాటు కోసం ఓ డొల్ల కంపెనీకి రూ.11.5 కోట్ల ప్రభుత్వ సొమ్మును అప్పనంగా ఇచ్చిన విషయాన్ని మరిచిపోయి ఇప్పుడు చంద్రబాబుపై అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని బుద్ద అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు డాక్టర్‌ నారాయణరావు, సీనియర్‌ నాయకులు బి.శ్రీనివాసరావు, బి.విశ్వనాథం, కె.రవీంద్ర, జె.రాజు, పి.వరప్రసాద్‌, శ్రీనివాసరావు, మహాలక్ష్మినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-26T00:41:48+05:30 IST