Share News

స్మార్ట్‌గా వడ్డింపు!

ABN , Publish Date - Dec 28 , 2023 | 01:30 AM

జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ల పేరుతో విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) అభివృద్ధి చేసిన లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ భారం మోపి, ఆ తప్పు తమది కాదని వీఎంఆర్‌డీఏ, డీటీసీపీ అధికారులు తప్పించుకుంటున్నారు. వడ్డీతో కలిపి వాయిదాలు చెల్లించాలని ఒత్తిడి పెడుతున్నారు.

స్మార్ట్‌గా వడ్డింపు!

పాలవలసలో జగనన్న ఎంఐజీ కాలనీ లేఅవుట్‌

జగనన్న టౌన్‌షిప్‌లలో

ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి

వీఎంఆర్‌డీఏ ఝలక్‌

వడ్డీతో వాయిదాలు కట్టాలని నోటీసులు

ప్రక్రియ పూర్తిలో జాప్యం

అధికారుల చేసిన తప్పిదానికి

తమపై భారం మోపడం ఏమిటని గగ్గోలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ల పేరుతో విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) అభివృద్ధి చేసిన లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ భారం మోపి, ఆ తప్పు తమది కాదని వీఎంఆర్‌డీఏ, డీటీసీపీ అధికారులు తప్పించుకుంటున్నారు. వడ్డీతో కలిపి వాయిదాలు చెల్లించాలని ఒత్తిడి పెడుతున్నారు.

ఆనందపురం మండలంలో మధ్య తరగతి ప్రజల కోసం నాలుగుచోట్ల ఎంఐజీ లేఅవుట్లు వేయగా ఎక్కువ దరఖాస్తులు వచ్చిన పాలవలసలో ముందు ప్లాట్ల విక్రయం ప్రారంభించారు. గజం రూ.14,500 చొప్పున 94 మందికి ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో విక్రయించారు. ముందుగా ప్లాటు విలువలో 10 శాతం కట్టించుకొని, మిగిలి మొత్తాన్ని మూడు వాయిదాల్లో చెల్లించాలని సూచించారు. ఒప్పందం చేసుకున్న నెల రోజుల్లో పూర్తి మొత్తం చెలిస్తే ఐదు శాతం రాయితీ ఇస్తామని హామీ ఇచ్చారు. అంతా ఆన్‌లైన్‌ ప్రక్రియ అని, మెసేజ్‌ వచ్చిన వెంటనే సొమ్ములు కట్టాల్సి ఉంటుందని చెప్పారు. ఇక్కడ విశేషం ఏమిటంటే...రాష్ట్రంలో జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ల లేఅవుట్లు వేసి, ప్లాట్ల విక్రయం నగరాభివృద్ధి సంస్థలు, మునిసిపాలిటీలు చేస్తే...వాటికి సంబంధించిన పేమెంట్లన్నీ డీటీసీపీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వెళతాయి. వీటికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను డీటీసీపీ తయారుచేసింది.

ఏం జరిగిందంటే..?

ఏప్రిల్‌-మే నెలల మధ్య కొనుగోలుదారులతో ఒప్పందాలు జరగ్గా, ఆ పత్రాలపై వీఎంఆర్‌డీఏలో సెక్షన్ల వారీగా సెక్రటరీ, చీఫ్‌ అర్బన్‌ ప్లానర్‌, ఎస్టేట్‌ ఆఫీసర్‌, కమిషనర్‌ ఇలా అందరి సంతకాలు పూర్తిచేసి కొన్ని నెలల తరువాత అంటే ఆగస్టులో వాటిని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు. అప్పటి నుంచి కొనుగోలుదారులు తాము డబ్బులు కడతామని ముందుకు వస్తుంటే...‘పేమెంట్‌ గేట్‌వే’ ఓపెన్‌ కాలేదని, అది ఓపెన్‌ అయిన తరువాత చెల్లించండి అంటూ వీఎంఆర్‌డీఏ అధికారులు సలహా ఇచ్చారు. తీరా ఇప్పుడు చూస్తే కొనుగోలుదారులు అందరికీ మే నెల నుంచి వడ్డీతో సహా వాయిదాల సొమ్ము చెల్లించాలని నోటీసులు ఇస్తున్నారు. నెలకు ఐదు శాతం వడ్డీ చొప్పున లెక్కలేసి పంపుతున్నారు. పైగా 5 శాతం రాయితీ కోసం ఒకేసారి సొమ్ము కడతామని కొందరు ముందుకు వస్తుంటే...ఇప్పుడు అవకాశం లేదని, జూన్‌ నెలాఖరులోపే కట్టాల్సింది అని చెబుతున్నారు.

అంతా అధికారుల జాప్యమే

ఒప్పందం చేసుకున్న నెల రోజుల్లో డబ్బులు చెల్లించాలనేది నిబంధన. పూర్తి మొత్తం చెల్లిస్తే ఐదు శాతం రాయితీ. అయితే కొనుగోలుదారులు ఒప్పందాలు చేసి పత్రాలు ఇచ్చినా, వాటిపై సంతకాలు చేసి, వెబ్‌సైట్‌లోకి అప్‌లోడ్‌ చేయడంలో వీఎంఆర్‌డీఏ అధికారులు జాప్యం చేశారు. ఆ తరువాత డీటీసీపీ అధికారులు పేమెంట్‌ గేట్‌వే నవంబరు నెలాఖరులో తెరిచారు. చెల్లింపులకు అవకాశం లేకుండా చేసి, ఇప్పుడు వడ్డీ కట్టాలని, రాయితీ వర్తించదని చెప్పడంపై కొనుగోలుదారులు నిరసన వ్యక్తంచేస్తున్నారు. అధికారులు చేసిన జాప్యానికి తాము ఎందుకు వడ్డీ కట్టాలని ప్రశ్నిస్తే...చెల్లింపులతో తమకు సంబంధం లేదని వీఎంఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు. అమరావతి డీటీసీపీలో ప్రశ్నిస్తే...తాము కేవలం సాఫ్ట్‌వేర్‌ మాత్రమే ఇచ్చామని, ఆ విషయాలేవీ తెలియదని వారు చెబుతున్నారు. సమస్యను పరిష్కరించకుండా ఒకరిపై మరొకరు నెపం నెట్టుకుంటున్నారని, వారి జాప్యానికి లక్షల రూపాయల వడ్దీ ఎందుకు భరించాలని కొనుగోలుదారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే వీఎంఆర్‌డీఏ వద్ద ప్లాట్లు కొనేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది. ఇలాంటి సమస్యలు కూడా సృష్టిస్తే ఇంకెవరు ముందుకు వస్తారని కొనుగోలుదారులు వాపోతున్నారు.

ప్రభుత్వానికి రాస్తున్నాం

సీయూపీ, వీఎంఆర్‌డీఏ

ఈ సమస్యను వీఎంఆర్‌డీఏ సీయూపీ దృష్టికి తీసుకువెళ్లగా, ఇటీవల సెక్రటరీలు మారిన కారణంగా డాక్యుమెంట్ల అప్‌లోడింగ్‌లో జాప్యం జరిగిందని, ఆన్‌లైన్‌ ప్రాసెస్‌ కావడంతో ఏ నెలకు ఆ నెల వడ్డీ పడిపోతున్నదని, దీనిపై ప్రభుత్వానికి రాస్తున్నామని, వడ్డీ లేకుండా వాయిదాలు చెల్లించుకునేలా చూస్తామని చెప్పారు.

Updated Date - Dec 28 , 2023 | 01:30 AM