జీపీఎస్‌తో తీవ్ర నష్టం
ABN , First Publish Date - 2023-09-22T01:04:22+05:30 IST
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)కు బదులు గ్యారంటీ పింఛన్ స్కీమ్ (జీపీఎస్) అమలు చేయాలన్న మంత్రి వర్గం నిర్ణయంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు మండి పడుతున్నారు.
ఇది సీపీఎస్‌కు ప్రతిరూపం
ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు విస్పష్టం
ప్రభుత్వం మొండిగా ముందుకెళితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక
ఓపీఎస్ సాధనకు పోరాటం మరింత ఉధృతం
అనకాపల్లి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి):
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)కు బదులు గ్యారంటీ పింఛన్ స్కీమ్ (జీపీఎస్) అమలు చేయాలన్న మంత్రి వర్గం నిర్ణయంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు మండి పడుతున్నారు. జీపీఎస్‌ను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించ బోమని స్పష్టంచేస్తున్నారు. జీపీఎస్‌ను ఉద్యోగులంతా వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం ఒంటెత్తు పోకడలతో నిరంకుశంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య విలువలను కాలరాయడమే నని ఆరోపిస్తున్నారు. విపక్ష నేత హోదాలో సీపీఎస్ రద్దు చేస్తానని ఇచ్చిన హామీని జగన్మోహన్‌రెడ్డి విస్మరించారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఉద్యోగులకు ‘మాటతప్పి... మడమ తిప్పిన’ వ్యక్తిగా ఆయన పేరు చరిత్రలో ఉండి పోతుందని సీపీఎస్ పోరాట సమితి నాయకులు వ్యాఖ్యా నిస్తున్నారు.
సీపీఎస్ విధానంలో ఒక ఉద్యోగి తన సర్వీస్‌లో దాచుకున్న మొత్తం నుంచి 60 శాతం రిటైరైన సమయంలో ఇచ్చి, మిగిలిన 40 శాతంపై వచ్చే వడ్డీని పింఛన్‌గా అందజేస్తుంటారు. అయితే మంత్రివర్గం ఆమోదించిన గ్యారంటీ పింఛన్ స్కీమ్‌లో రిటైరైన సమయంలో డబ్బులేమీ ఇవ్వకుండా...బేసిక్‌లో సగం మొత్తం పింఛన్‌గా ఇస్తామని ప్రభుత్వం చెబుతుందని, దీనివల్ల తీవ్ర అన్యాయం జరుగుతుందని సీపీఎస్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తంచేశారు. దేశంలో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాలు ఇప్పటికే పాత పింఛన్ విధానం అమలు చేస్తున్నాయని గుర్తుచేస్తున్నారు. అలాంటప్పుడు ఏపీలో ఎందుకు అమలు చేయలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో 2004 సెప్టెంబరు ఒకటో తేదీ తరువాత నియమితులైన ఉద్యోగ, ఉపాధ్యాయులు సుమారు నాలుగు వేల మంది ఉంటారు. వీరిలో సగం వరకు ఉపాధ్యాయులు ఉంటారు. కాగా సీపీఎస్ స్థానంలో జీపీఎస్ అమలు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) తీవ్రంగా వ్యతిరేకించింది. అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్ రద్దు చేస్తామని విపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీని నాలుగేళ్లు దాటినా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. జీపీఎస్‌ను ఉద్యోగులు, ఉపాధ్యాయులంతా వ్యతిరేకిస్తున్నా మొండిపట్టుదలతో ప్రభుత్వం ముందుకువెళ్లి మంత్రివర్గంలో ఆమోదించడం దారుణమని ఫ్యాప్టో అభిప్రాయపడింది. దీనిని వ్యతిరేకించకపోతే 2003 డీఎస్సీలో ఎంపికై పాత పింఛన్ విధానంలో ఉన్న ఉపాధ్యాయులకు కూడా జీపీఎస్ అమలు చేయడానికి ప్రభుత్వం వెనుకాడబోదని ఫ్యాప్టో జిల్లా నేత ఒకరు ఆందోళన వ్యక్తంచేశారు. జీపీఎస్‌కు మంత్రివర్గం ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ శుక్రవారం సీపీఎస్ ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతారని, 23న అన్ని తాలూకా కేంద్రాల్లో నిరసన వ్యక్తంచేస్తారని ప్రక టించారు. ఈనెల 25వ తేదీన ఛలో కలెక్టరేట్‌కు పిలుపు నిచ్చినట్టు తెలిపారు.
‘వారంలో సీపీఎస్ రద్దు’ హామీ ఏమైంది?
కొరుకొండ సతీశ్, ఏపీసీపీఎస్‌ఈఏ జిల్లా అధ్యక్షుడు
జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేస్తున్న సమయంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్‌ను రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. వైసీపీ మేనిఫెస్టోని బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావిస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత సీపీఎస్ రద్దు హామీని అమలు చేయకుండా నాలుగున్నరేళ్ల తరువాత జీపీఎస్ పేరుతో ‘గోల్‌మాల్ పెన్షన్ స్కీమ్’ను తీసుకువచ్చి ఉద్యోగులను మరింత మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. మాట నిలబెట్టుకోలేని రాజకీయ నాయకుడిని కాలరు పట్టుకొని నిలదీయాలని ప్రతిపక్ష నేతగా వున్నప్పుడు మీరు అన్న మాటలకు ఇప్పుడు సమాధానం చెప్పాలి.
బలవంతంగా జీపీఎస్ అమలు సరికాదు
గొంది చినబ్బాయ్, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
జీపీఎస్ విధానాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం బలవంతంగా అమలు చేయడం సరికాదు. పెన్షన్ అంటే ఉద్యోగికి పదవీ విరమణ తరువాత ప్రభుత్వం చెల్లించే భరణం లేదా జీవన భృతి అని గుర్తించాలి. కానీ ఉద్యోగుల నుంచి చందాలు వసూలుచేసి పెన్షన్ ఇస్తామనడం సరికాదు. పదవీ విరమణ సమయంలో వున్న జీతంలో 50 శాతం పెన్షన్‌గా పొందాలంటే ఉద్యోగి తన ప్రాన్ అకౌంట్‌లో అప్పటివరకు దాచుకున్న మొత్తం డబ్బును ప్రభుత్వానికి ఇచ్చేయాలి. డీఏలు, పీఆర్‌సీలు వర్తించని జీపీఎస్ అమలును వ్యతిరేకిస్తున్నాం.