Share News

వడివడిగా... కలివిడిగా...

ABN , Publish Date - Dec 18 , 2023 | 12:35 AM

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. యువనేతకు అడుగడుగునా అన్నివర్గాల ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఆదివారం ఉదయం పది గంటలకు అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం తోటాడ సమీపంలోని విడిది ప్రదేశం నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభమైంది.

వడివడిగా... కలివిడిగా...

ఉత్సాహంగా సాగుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పాదయాత్ర

ఎలమంచిలి, పెందుర్తి,

గాజువాక నియోజకవర్గాల్లో సాగిన యువగళం

రహదారులకు ఇరువైపులా

బారులుతీరి ఘనంగా స్వాగతం పలికిన జనం

గుమ్మడి కాయలతో దిష్టి తీసి, హారతులు పట్టిన మహిళలు

సమస్యలు చెప్పుకున్న పలు వర్గాల ప్రజలు

నిరుద్యోగుల సంఘీభావం

ఉక్కు టౌన్‌షిప్‌లో బెలూన్లతో మహిళలు ఘన స్వాగతం

226వ రోజు...17.6 కిలోమీటర్ల మేర పాదయాత్ర

మునగపాక/పరవాడ/విశాఖపట్నం,

డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి):

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. యువనేతకు అడుగడుగునా అన్నివర్గాల ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఆదివారం ఉదయం పది గంటలకు అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం తోటాడ సమీపంలోని విడిది ప్రదేశం నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభమైంది. టి.సిరసపల్లి, వెంకటాపురం మీదుగా భరిణికం వద్ద పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని పరవాడ మండలంలోకి ప్రవేశించింది. పరవాడ, గొర్లివానిపాలెం, చింతల గొర్లివానిపాలెం, జాజులవానిపాలెం, దేశపాత్రునిపాలెం మీదుగా గాజువాక నియోజకవర్గలోకి సాగింది. దారిపొడవునా మహిళలను, యువతను పలుకరిస్తూ చిన్నారులను ముద్దాడుతూ ముందుకుసాగారు. ఆదివారం రాత్రి 9.30 గంటలకు ఉక్కు టౌన్‌షిప్‌లో సాయి బాబా గుడి సమీపంలోని సీడబ్ల్యూసీ సెంటర్‌ వద్ద ఏర్పాటు చేసిన విడిది కేంద్రానికి చేరుకున్నారు. లోకేశ్‌ 226వ రోజు మొత్తం 17.6 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.

మునగపాక మండలం తోటాడ వద్ద వైఎస్‌ఆర్‌ జగనన్న భూ రక్ష సర్వే రాళ్లు పరిశీలనతో ప్రారంభమైన పాదయాత్ర ఆద్యంతం ప్రజలతో మమేకమవుతూ ముందుకుసాగింది. అక్కడి నుంచి వెంకటాపురానికి చేరుకున్న లోకేశ్‌కు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. అనకాపల్లి నుంచి తోటాడ మీదుగా పరవాడకు వెళ్లే రోడ్డు పూర్తిగా ఛిద్రమైందంటూ గ్రామస్థులు వినతిపత్రం సమర్పించారు. లోకేశ్‌ స్పందిస్తూ..టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే రోడ్డును బాగుచేయిస్తానని హామీ ఇచ్చారు. తరువాత పరవాడ మండలం భరణికం వద్ద పెందుర్తి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించింది. నియోజకవర్గ ఇన్‌చార్జి బండారు సత్యనారాయణమూర్తి, జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేశ్‌బాబు, ఇరు పార్టీలకు చెందిన పలువురు నేతలు గజమాలలతో ఘన స్వాగతం పలికారు. మహిళలు లోకేశ్‌కు దిష్టి తీసి, హారతులు పట్టారు. రోడ్డుకు ఇరువైపులా బారులుతీరిన ప్రజలు పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా లోకేశ్‌తో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు పలువురు పోటీ పడ్డారు. అనంతరం భరణికాంలో మధ్యాహ్న భోజన విరామ క్యాంపునకు చేరుకున్నారు. ఇక్కడ పంచగ్రామాల భూ సమస్య బాధితులతో ముఖాముఖి నిర్వహించారు. మాజీ మంత్రులు గంటా, బండారు, ఎమ్మెల్యే గణబాబు తదితరులు పాల్గొన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే జీవో 229ను అమలు చేసి సమస్య పరిష్కరిస్తామని లోకేశ్‌ వారికి హామీ ఇచ్చారు. భోజన విరామం తరువాత 3.30 గంటలకు పాదయాత్రను తిరిగి ప్రారంభించి పరవాడ చేరుకున్నారు. ఆయనతోపాటు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు, బండారు, తదితరులు ఎన్‌టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పరవాడ సంతబయలు వద్దకు మహిళలు భారీగా తరలివచ్చారు. పెరుగుతున్న ధరలతో నిత్యావసర సరకులు కొనుగోలు చేయడం కష్టంగా వుందని పలువురు లోకేశ్‌కు వివరించి, ప్యాకింగ్‌ చేసిన పలురకాల నిత్యావసర వస్తువుల గజమాలను లోకేశ్‌కు వేశారు. ఏపీసీపీఎస్‌ ఉద్యోగులు లోకేశ్‌ను కలిసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని వినతిపత్రం సమర్పించారు. ముదపాక భూ సమీకరణ బాధితులు కూడా వినతిపత్రాన్ని అందించారు. పరవాడ పెట్రోల్‌ బంక్‌ వద్ద కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు నాయకులు కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ కాపు రిజర్వేషన్‌ విషయమై టీడీపీ హయాంలో అసెంబ్లీలో చేసిన తీర్మానానికి కట్టుబడి ఉన్నామన్నారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి కాపుల సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, బడ్జెట్‌లో కాపులకు మూడు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తానని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్తిగా నిలిచిపోయిన కాపు సంక్షేమ భవనాలను పూర్తి చేస్తామని, కాపులకు టీడీపీ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.

తరువాత గొర్లివానిపాలెం జూనియర్‌ కాలేజీ వద్ద బోనంగి, లేమర్తి, తాడి, తానాం గ్రామాలకు చెందిన నిరుద్యోగులు లోకేశ్‌ను కలిసి సంఘీభావం తెలిపారు. ఫార్మా సిటీకి భూములు ఇచ్చిన తమకు ఉద్యోగులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. లోకేశ్‌ స్పందిస్తూ..టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడిన తరువాత నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని, ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. అక్కడి నుంచి దేశపాత్రునిపాలెం మీదుగా ఉక్కు టౌన్‌ షిప్‌కు పాదయాత్ర చేరింది. మహిళలు పెద్దఎత్తున బెలూన్లు పట్టుకుని లోకేశ్‌కు స్వాగతం పలికారు. అలాగే ఉక్కును కాపాడాలంటూ కొంతమంది కార్మికులు లోకేశ్‌కు వినతిపత్రం సమర్పించారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కుతో కూడిన బ్యానర్‌ ప్రదర్శించి నినాదాలు చేశారు.

‘ఫార్మా కాలుష్య’ బాధితుల గోడు

పరవాడ, డిసెంబరు 17: ఫార్మాసిటీ కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని తరలించేందుకు చర్యలు తీసుకోవాలని మాజీ సర్పంచ్‌ బొడ్డపల్లి అప్పారావు, పలువురు గ్రామస్థులు టీడీపీ యువనేత నారా లోకేశ్‌కు వినతిపత్రం అందజేశారు. గ్రామం తరలింపునకు గత టీడీపీ ప్రభుత్వం జీవో కూడా జారీ చేసిందని, అయితే దీనిని అమలు చేసే సమయానికి ఎన్నికల కోడ్‌ రావడంతో తరలింపు ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం తాడి గ్రామాన్ని తరలిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. లోకేశ్‌ స్పందిస్తూ.. మూడు నెలలు ఆగితే టీడీపీ అధికారంలోకి వస్తుందని, వెంటనే గ్రామాన్ని తరలిస్తామని హామీ ఇచ్చారు.

పెద్ద చెరువును కాపాడండి

ఫార్మా వ్యర్థ జలాల కారణంగా పరవాడ పెద్ద చెరువు కలుషితమైందని ఇటీవల మూడు టన్నులకుపైగా చేపలు మృత్యువాత పడ్డాయని ఆయకట్టు రైతులు లోకేశ్‌ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఆయన టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫార్మాసిటీ నుంచి పరిసర గ్రామాలతోపాటు సాగునీటి చెరువుల్లోకి వ్యర్థ జలాలు రాకుండా చర్యలు చేపడతామని, ఫార్మా కాలుష్యంపై ఉక్కుపాదం మోపుతామని హామీ ఇచ్చారు.

Updated Date - Dec 18 , 2023 | 12:35 AM