సర్కారు తీరుతో మూత‘బడి’

ABN , First Publish Date - 2023-02-21T00:07:31+05:30 IST

జిల్లాలో పది మంది లోపు విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలను ఎత్తి వేసేందుకు విద్యాశాఖ రంగం సిద్ధం చేస్తున్నది. ఇందులో భాగంగా పది మంది లోపు విద్యార్థులున్న 87 ప్రాథమిక పాఠశాలలను విద్యాశాఖాధికారులు గుర్తించారు.

సర్కారు తీరుతో మూత‘బడి’
ముంచంగిపుట్టు మండలం కుమిడిపుట్టు పాఠశాల వద్ద గిరిజన సంఘం ఆందోళన

జిల్లాలో 87 ప్రాథమిక పాఠశాలలు ఎత్తివేత?

మారుమూల ప్రాంతవాసులకు దూరంకానున్న ప్రాథమిక విద్య

వైసీపీ ప్రభుత్వ చర్యపై గిరిజనుల ఆవేదన

పాఠశాలల విలీనం విరమించుకోవాలని డిమాండ్‌

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో పది మంది లోపు విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలను ఎత్తి వేసేందుకు విద్యాశాఖ రంగం సిద్ధం చేస్తున్నది. ఇందులో భాగంగా పది మంది లోపు విద్యార్థులున్న 87 ప్రాథమిక పాఠశాలలను విద్యాశాఖాధికారులు గుర్తించారు. పాఠశాలల విలీనంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తక్కువ మంది విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలను సమీపంలోని ప్రాథమికోన్నత పాఠశాలల్లోకి విలీనం చేయాలని విద్యాశాఖను ఆదేశించిన క్రమంలో అధికారులు చర్యలు చేపట్టారు.

జిల్లాలో పది మందిలోపు విద్యార్థులున్న 87 ప్రాథమిక పాఠశాలలను విద్యాశాఖాధికారులు గుర్తించారు. అవి... అనంతగిరి మండలంలో 11, అరకులోయలో 2, చింతూరులో 4, డుంబ్రిగుడలో 5, జీకేవీధిలో 7, జి.మాడుగులలో 9, హుకుంపేటలో 5, కొయ్యూరులో 8, కూనవరంలో 7, ముంచంగిపుట్టులో 11, నెల్లిపాకలో 2, పాడేరులో 3, పెదబయలులో 3, రాజవొమ్మంగిలో 3, వీఆర్‌ పురంలో 3, మారేడుమిల్లి 2, వై.రామవరంలో 1, చింతపల్లిలో 1 చొప్పున పాఠశాలలను అధికారులు గుర్తించారు.

దూరం కానున్న ప్రాథమిక విద్య

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పాఠశాలల విలీన ప్రక్రియ కారణంగా గిరిజన ప్రాంతంలో మారుమూల ప్రాంతాల్లో ఉండే గిరిజన బాలలకు ప్రాథమిక విద్య దూరమయ్యే ప్రమాదముందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మైదాన ప్రాంతాల్లో పాఠశాలలు దగ్గరగా ఉండడంతో పాటు పంచాయతీ పరిధిలో ఒకటి లేదా రెండు గ్రామాలు మాత్రమే ఉంటాయి. కానీ ఏజెన్సీలో ప్రాంతాల్లో అందుకు పూర్తి భిన్నంగా గ్రామాల మధ్య 5 నుంచి 10 కిలోమీటర్ల దూరం ఉండడంతో పాటు పంచాయతీ పరిధిలో 10 నుంచి 30 వరకు గ్రామాలుంటాయి. దీంతో ఇప్పటికే మారుమూల ప్రాంతాల్లోని గిరిజన బాలలకు పాఠశాలలు దూరంగా ఉన్నాయి. ఆ కారణంగానే ఏజెన్సీలో అధిక సంఖ్యలో ప్రాథమిక పాఠశాలల్లో 20కి మించకుండా విద్యార్థులుంటారు. ప్రస్తుతం వైసీపీ సర్కారు చేపడుతున్న పాఠశాలల విలీన ప్రక్రియ కారణంగా మారుమూల ప్రాంతాల్లో తక్కువ మంది విద్యార్థులతో ఉన్న పాఠశాలలను ఎత్తేస్తే, దూరంగా ఉన్న పాఠశాలలకు కొండ కోనలు దాటి వెళ్లలేక గిరిజన విద్యార్థులు డ్రాపవుట్‌లుగా మారే అవకాశం లేకపోలేదని విద్యార్థి, ప్రజా సంఘాలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆవేదన చెందుతున్నారు. ఉదాహరణకు పాడేరు మండలంలోని గడివలసలోని ప్రాథమిక పాఠశాలను ఎత్తేస్తే, అక్కడి విద్యార్థులు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవరాపల్లి ప్రాథమిక పాఠశాలకు నడుచుకుంటూ రావాల్సిన పరిస్థితి. ప్రస్తుతం తక్కువ విద్యార్థులున్నారనే నెపంతో ఎత్తేయాలనుకుంటున్న ఏజెన్సీలోని పాఠశాలలకు చెందిన విద్యార్థులందరి దుస్థితి ఇదే. తమ విద్యార్థులకు ప్రాథమిక విద్య దూరమయ్యేలా ఉన్న పాఠశాలల విలీన ప్రక్రియను ప్రభుత్వం నిలుపుదల చేయాలని విద్యార్థి, ప్రజా సంఘాలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2023-02-21T00:07:35+05:30 IST