ఇష్టారాజ్యం!

ABN , First Publish Date - 2023-07-10T01:25:31+05:30 IST

విద్యాశాఖ పరిధిలోని ప్రతి పాఠశాల (ప్రభుత్వ, ప్రైవేటు) రాష్ట్ర విద్య, పరిశోధన, శిక్షణ సంస్థ (ఎస్‌సీఈఆర్‌టీ) ముద్రించిన పాఠ్యపుస్తకాలతోనే విద్యార్థులకు తరగతులను బోధించాలి.

ఇష్టారాజ్యం!

ప్రభుత్వ పాఠ్యపుస్తకాల కొనుగోలుకు ప్రైవేటు పాఠశాలలు దూరం

విద్యాశాఖ కమిషనర్‌ ఆదేశించినా స్పందన శూన్యం

కొరవడుతున్న జిల్లా అధికారుల పర్యవేక్షణ

అసలు ధర కన్నా ఎక్కువగా వసూలు

గగ్గోలుపెడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు

విశాఖపట్నం, జూలై 9 (ఆంధ్రజ్యోతి):

విద్యాశాఖ పరిధిలోని ప్రతి పాఠశాల (ప్రభుత్వ, ప్రైవేటు) రాష్ట్ర విద్య, పరిశోధన, శిక్షణ సంస్థ (ఎస్‌సీఈఆర్‌టీ) ముద్రించిన పాఠ్యపుస్తకాలతోనే విద్యార్థులకు తరగతులను బోధించాలి. అయితే మెజార్టీ ప్రైవేటు విద్యాసంస్థలు ప్రైవేటు ముద్రణాసంస్థల నుంచి కొనుగోలు చేసిన పుస్తకాలతో తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించడంలేదు. కొన్ని యాజమాన్యాలు తమ పరిధిలో పాఠశాలల విద్యార్థుల సంఖ్య మేరకు కాకుండా, నామమాత్రంగా ప్రభుత్వ పుస్తకాలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో విద్యాశాఖ క్షేత్రస్థాయి అధికారులు సమర్థంగా వ్యవహరించడం లేదనే విమర్శలున్నాయి. దీంతో విద్యాసంవత్సరం ప్రారంభమై నెల గడుస్తున్నా జిల్లాలో సగం పాఠశాలలు ప్రభుత్వం ముద్రించిన పాఠ్యపుస్తకాలు కొనుగోలుచేయలేదు.

జిల్లాలో 778 ప్రైవేటు పాఠశాలలున్నాయి. సుమారు 50 పాఠశాలలు సీబీఎస్‌ఈ అమలు చేస్తుండగా మిగిలిన పాఠశాలలు ఎస్‌సీఈఆర్‌టీ సిలబస్‌లోనే బోధిస్తున్నాయి. పాఠశాల విద్యాశాఖ అనుమతితో నడుస్తున్న ప్రతి పాఠశాల ఎస్‌సీఈఆర్‌టీ సిలబస్‌తో ముద్రించిన పాఠ్యపుస్తకాలు కొనుగోలుచేసి, విద్యార్థులకు బోధించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఆదేశించారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖాధికారులు తమ పరిధిలోని ప్రైవేటు యాజమాన్యాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఎస్‌సీఈఆర్‌టీ ముద్రించిన పాఠ్యపుస్తకాలు కొనుగోలుచేయాలని సూచించారు. విద్యార్థుల సంఖ్య మేరకు ముందుగా ఐదుశాతం పాఠశాల విద్యాశాఖకు ఆన్‌లైన్‌లో చెల్లించాలి. తరువాత నగరంలోని రెండు ప్రైవేటు ముద్రణా సంస్థల డిపోల నుంచి పాఠ్యపుస్తకాలు తీసుకునే వెసులుబాటు కల్పించారు. పాఠ్యపుస్తకాలు తీసుకునేటప్పుడు ప్రభుత్వానికి చెల్లించిన ఐదుశాతం మినహాయించి మిగిలిన 95 శాతం చెల్లించాలి. అయితే జిల్లాలో ఇప్పటివరకు 439ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఐదు శాతం చొప్పున రూ.14,91,126 చెల్లించారు. మిగిలిన మొత్తం చెల్లించలేదని, పాఠ్యపుస్తకాలు కొనుగోలు చేయలేదని సమాచారం. కాగా మిగిలిన పాఠశాలలు రూపాయి కూడా చెల్లించలేదు. విద్యాశాఖ అధికారులు చెబుతున్నా పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. క్షేత్రస్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, ప్రైవేటు యాజమాన్యాలపై పట్టుకోల్పోడం వంటి కారణాలతో విద్యాశాఖ ఆదేశాలు పట్టించుకోవడంలేదని సమాచారం.

ఎస్‌సీఈఆర్‌టీ రేట్ల కంటే ఎక్కువ వసూలు

నగరం, పరిసరాల్లో చాలా పాఠశాలలు ప్రభుత్వం ముద్రించే పుస్తకాలు కంటే ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలోని కొన్ని ప్రైవేటు సంస్థలు ముద్రించే పుస్తకాలు కొనుగోలు చేస్తున్నారు. ఈ పుస్తకాల్లో కంటెంట్‌ కంటే రంగులతో ఆకర్షణీయంగా ఉండడంతో తల్లిదండ్రుల నుంచి భారీగా దండుకుంటున్నారు. ఒకటి నుంచి ఐదోతరగతి చిన్నారుల తల్లిదండ్రులను నిలువుదోపిడీ చేస్తున్నారు. హైస్కూలు విద్యార్థుల విషయంలో ఎస్‌సీఈఆర్‌టీ లేదా ఎస్‌సీఈఆర్‌టీ సిలబస్‌తో కూడిన పుస్తకాలు సరఫరాచేసి అక్కడ కూడా నిర్ణీత ధరలకు విక్రయించాలి. కానీ ప్రభుత్వం నిర్ణయించిన రేటు కంటే రెండు మూడు రెట్లు ఎక్కువగా వసూలు చేస్తున్నారు. అవసరం లేకపోయినా పలు రకాల పుస్తకాలు బలవంతంగా కొనుగోలు చేయించి ఆరోతరగతి విద్యార్థికి రూ.మూడువేల వరకు వసూలుచేశారని గోపాలపట్నానికి చెందిన దాసరి కిశోర్‌కుమార్‌ ఆరోపించారు. నగరంలో కార్పొరేట్‌ పాఠశాలలో చదివే నాలుగోతరగతి విద్యార్ధికి పుస్తకాల కోసం రూ.8 వేలు తీసుకున్నారని భాస్కరరావు అనే పేరెంట్‌ వాపోయారు. ఇష్టమున్నా లేకున్నా పాఠశాలలో విక్రయించే అన్నిరకాల పుస్తకాలు కొనుగోలు చేయమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పాఠ్యపుస్తకాలు కొనాల్సిందే

-ఎల్‌.చంద్రకళ, డీఈవో, విశాఖపట్నం

ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి గుర్తింపు పొందిన ప్రతి ప్రైవేటు పాఠశాల ఎస్‌సీఈఆర్‌టీ ముద్రించిన పాఠ్యపుస్తకాలు కొనుగోలుచేయాలి. ఈ పుస్తకాలతోనే బోధన చేయాలి. పరీక్షలు కూడా వీటి ఆధారంగానే జరుగుతాయి. ప్రైవేటు ముద్రణా సంస్థలు ముద్రించే పుస్తకాలతో బోధన కుదరదు. ఇప్పటివరకు 439 పాఠశాలల యాజమాన్యాలు పాఠ్యపుస్తకాలు కొనుగోలుకు ఐదుశాతం చొప్పున చెల్లించాలి. మిగిలిన పాఠశాలలు కూడా పాఠ్యపుస్తకాలు కొనుగోలుచేయాలి. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటాం.

ఎస్‌సీఈఆర్‌టీ పుస్తకాల రేట్లు

తరగతి ఖరీదు (రూ.)

ఒకటి 399.00

రెండు 425.00

మూడు 675.00

నాలుగు 702.0

ఐదు 727.00

ఆరు 747.00

ఏడు 871.00

ఎనిమిది 1,181.00

తొమ్మిది 1,167.00

పది 859.00

Updated Date - 2023-07-10T01:25:31+05:30 IST