Share News

అంగన్‌వాడీల సమ్మెపై సర్కార్‌ ఉక్కుపాదం

ABN , Publish Date - Dec 18 , 2023 | 12:31 AM

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆరు రోజుల నుంచి సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతున్నది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ పేరుతో మూడు రోజుల నుంచి ఐసీడీఎస్‌ ఉద్యోగులు, సచివాలయాల సిబ్బంది, పోలీసులతో పలుచోట్ల అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టించి తెరుస్తున్న విషయం తెలిసిందే. దీంతో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలతోపాటు టీడీపీ, జనసేన, సీపీఎం నాయకులు చాలాచోట్ల అడ్డగించారు.

అంగన్‌వాడీల సమ్మెపై సర్కార్‌ ఉక్కుపాదం
అంగన్‌వాడీల సమ్మెకు మద్దతుగా చోడవరం మండలం లక్కవరంలో ఆందోళన చేస్తున్న చిన్నారులు, వారి తల్లిదండ్రులు

నేడు అన్ని కేంద్రాలను తెరవాల్సిందే

తలుపుల తాళాలు పగలగొట్టండి

మండలాల అధికారులకు మౌఖిక ఆదేశాలు

నక్కపల్లి, డిసెంబరు 17: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆరు రోజుల నుంచి సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతున్నది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ పేరుతో మూడు రోజుల నుంచి ఐసీడీఎస్‌ ఉద్యోగులు, సచివాలయాల సిబ్బంది, పోలీసులతో పలుచోట్ల అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టించి తెరుస్తున్న విషయం తెలిసిందే. దీంతో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలతోపాటు టీడీపీ, జనసేన, సీపీఎం నాయకులు చాలాచోట్ల అడ్డగించారు. అంతేకాక సమ్మెను ఉధృతం చేశారు. ఇక లాభం లేదనుకున్న వైసీపీ ప్రభుత్వం మరింత దూకుడు చర్యలకు దిగుతున్నది. ఆరు నూరైనా సరే సోమవారం నుంచి అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు తెరచుకోవాల్సిందేని ఆదివారం అన్ని జిల్లాల అధికారులకు మౌఖింగా ఆదేశాలు జారీచేసినట్టు తెలిసింది. దీంతో జిల్లా కలెక్టర్లు అన్ని మండలాల అధికారులకు ఆదివారం సాయంత్రం వర్తమానం పంపారు. అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు పగులగొట్టి తెరవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. సచివాలయ మహిళా పోలీసులు, కార్యదర్శులు, వలంటీర్లు, ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ అధికారులు, ఇతర ప్రభుత్వ సిబ్బందిని ఉపయోగించి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.

అడ్డుకోవడానికి టీడీపీ, జనసేన, వామపక్షాలు సన్నద్ధం

అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు పగులగొట్టి తెరవాలన్న ప్రభుత్వ ఆదేశాల గురించి తెలుసుకున్న టీడీపీ, జనసేన, వామపక్షాల నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంగన్‌వాడీల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించకుండా తొందరపాటు చర్యలకు పాల్పడుతున్నదని అన్నారు. సోమవారం ఉదయం అన్ని అంగన్‌వాడీ కేంద్రాల వద్దకు వెళ్లి, ప్రభుత్వ నిరంకుశ చర్యలను అడ్డుకోవాలని అధిష్ఠానం పిలుపునిచ్చిందని టీడీపీ జిల్లా నేతలు తెలిపారు. జనసేన, వామపక్షాల నాయకులు కూడా ప్రభుత్వ చర్యలను అడ్డుకోవడానికి సిద్ధమవుతున్నారు.

----

(ఆంధ్రజ్యోతి- న్యూస్‌నెట్‌వర్క్‌)

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన సమ్మె ఆదివారం ఆరో రోజుకు చేరింది. సీడీపీవో, తహసీల్దారు కార్యాలయాల ఎదుట ఏర్పాటు చేసిన శిబిరాల్లో నిరసనను కొనసాగిస్తున్నారు. అంగన్‌వాడీలకు మద్దతుగా పలు గ్రామాల్లో చిన్నారులు, వారి తల్లిదండ్రులు, గర్భిణులు, బాలింతలు ర్యాలీలు నిర్వహించి అంగన్‌వాడీ కేంద్రాల వద్ద నిరసన తెలిపారు. అంగన్‌వాడీలకు కనీస వేతనం, ప్రమాద బీమా, గ్రాట్యూటీ అమలు వంటి న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. ఇతర శాఖ ఉద్యోగులతో అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టించడం సరైన విధానం కాదని అన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 12:31 AM