మున్సిపల్‌ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలి

ABN , First Publish Date - 2023-06-02T23:56:02+05:30 IST

రాష్ట్రంలో మున్సిపల్‌ కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

మున్సిపల్‌ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలి
మాట్లాడుతున్న ఉమామహేశ్వరరావు

అనకాపల్లి టౌన్‌, జూన్‌ 2 : రాష్ట్రంలో మున్సిపల్‌ కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ యూనియన్‌ రాష్ట్ర జాత శుక్రవారం అనకాపల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా జీవీఎంసీ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెండు జాతాలు జూన్‌ 8వ తేదీ నాటికి విజయవాడ చేరుకుంటున్నాయని తెలిపారు. రాష్ట్రంలో 123 కార్పొరేషన్‌లో మున్సిపాలిటీలు నగర పంచాయతీలలో 40వేల మందికి పైగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది, పది వేలకు పైగా సీపీఎస్‌ ఉద్యోగులు, వెయ్యి మందికి పైగా క్లాప్‌ డ్రైవర్లు పనిచేస్తున్నారని తెలిపారు. కార్మికులను పర్మినెంట్‌ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఆప్కాస్‌ విధానాన్ని తీసుకొచ్చి మరింత పనిభారం మోపారన్నారు. పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు, హెల్త్‌ అలవెన్సులు, ఈఎస్‌ఎఫ్‌, పీఎఫ్‌ సక్రమంగా రావడం లేదన్నారు. ఆప్కాస్‌ విధానాన్ని రద్దు చేసి 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించాలన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఈనెల 20 తరువాత రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు రుత్తల శంకరరావు మాట్లాడుతూ.. మున్సిపల్‌ కార్మికుల జాతాకు నాయకత్వం వహిస్తున్న నాయకులను అభినందించారు. ఈ జాతాలో యూనియన్‌ రాష్ట్ర కోశాధికారి జ్యోతి బసు, నాయకులు టి. నూకరాజు, సత్యనారాయణ, మహేష్‌, రత్నం, శివ, కౌలు రైతు సంఘం కార్యదర్శి ఎ.బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-02T23:56:02+05:30 IST