సాయిరెడ్డి వర్సెస్ సుబ్బారెడ్డి
ABN , First Publish Date - 2023-05-14T01:42:20+05:30 IST
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి.
వైసీపీలో ఆధిపత్య పోరు
తమ అనుయాయులకు పదవులు కట్టబెట్టేందుకు ఆరాటం
పదవుల్లో ఉన్నవారిని తొలగిస్తూ ఒకరు ఉత్తర్వులు
క్షణాల్లో వాటిని రద్దు చేస్తూ మరొక నేత ఆదేశాలు
రెండు రోజుల క్రితం జోనల్ మహిళా అధ్యక్షురాలు, యువజన విభాగం అధ్యక్షుడు మార్పు
తాజాగా ఒక కార్పొరేటర్, ఒక వార్డు అధ్యక్షుడిపై సస్పెన్షన్ వేటు
రెండు వర్గాలుగా విడిపోయిన నేతలు
ఎప్పుడు ఏం జరుగుతుందనేదానిపై నేతల్లో ఉత్కంఠ
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. పార్టీలో ఆధిపత్యం కోసం గతంలో ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వకర్తగా పనిచేసిన విజయసాయిరెడ్డి, ప్రస్తుతం సమన్వయకర్తగా పనిచేస్తున్న వైవీ సుబ్బారెడ్డి ఎత్తుకుపైఎత్తులు వేసుకుంటున్నారు. నేతలు కూడా రెండు వర్గాలుగా విడిపోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని పార్టీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల పార్టీ మహిళా, యువజన విభాగం జోనల్ అధ్యక్షుల మార్పుతోపాటు ఒక కార్పొరేటర్‌ను మరొక వార్డు అధ్యక్షుడిని తాజాగా పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి ఇరువురు నేతల మధ్య విభేదాలే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపై ప్రత్యేక దృష్టిసారించింది. విశాఖ కేంద్రంగా పార్టీ కార్యకలాపాలు పర్యవేక్షించేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా నియమించింది. ఆయన దాదాపు మూడేళ్లపాటు సమన్వయకర్తగా పనిచేయడంతో పార్టీలో బాగా పట్టుసంపాదించారు. అయితే విజయసాయిరెడ్డిపై ఆరోపణలు రావడంతో ఆయన్ను తప్పించి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి సుమారు ఏడాది కిందట ప్రాంతీయ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు. కాగా విజయసాయిరెడ్డికి, వైవీ సుబ్బారెడ్డికి మధ్య అప్పటికే విభేదాలు ఉన్నాయనే ప్రచారం ఉంది. వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత...అప్పటివరకూ విజయసాయిరెడ్డి దూరంపెట్టిన నేతలంతా పార్టీలో చురుగ్గా తిరగడం మొదలెట్టారు. సుబ్బారెడ్డికి దగ్గరయ్యారు. ఆ విధంగా సుబ్బారెడ్డికి దగ్గరైన వారిలో కొందరు...గతంలో విజయసాయిరెడ్డికి దగ్గరగా ఉన్నవారి గురించి, సన్నిహితంగా మెలిగిన అధికారుల గురించి ఆయనకు చెబుతుండేవారు. అలాగే విజయసాయిరెడ్డి వద్దకు కొందరు చేరి, సుబ్బారెడ్డి గురించి, ఆయనకు దగ్గరైన వారి గురించి అదేతరహాలో చెప్పడం మొదలెట్టారు. దీంతో వారిరువురి మధ్య దూరం మరింత పెరిగిందని పార్టీలో తటస్థంగా వుండే కొందరు నేతలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో పట్టు కోసం ఇరువురు నేతలు ఎత్తుకుపైఎత్తులు వేస్తున్నారని నేతలు చెబుతున్నారు.
పార్టీ మహిళా విభాగం జోనల్ అధ్యక్షురాలు గరికన గౌరి, యువజన విభాగం జోనల్ అధ్యక్షుడు ఎం.సునీల్‌కుమార్‌ను సుబ్బారెడ్డి ప్రాంతీయ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే నియమించారు. అయితే వారిద్దరూ విజయసాయిరెడ్డి అనుచరులంటూ జిల్లా పార్టీలో కీలక పదవిలో వున్న ఒక నేత...వైవీ సుబ్బారెడ్డికి చెప్పారు. వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తే మీకు విధేయులుగా ఉంటారంటూ ...తనకు అనుకూలంగా వుండే పీలా వెంకటలక్ష్మి, ముత్తంశెట్టి వెంకటసాయి పేర్లను సదరు నేత సూచించినట్టు కొంతమంది పార్టీ నేతలు చెబుతున్నారు. జిల్లా పార్టీలోని కీలక నేత సూచన మేరకు వారిద్దరి నియామకాలకు సంబంధించి ఉత్తర్వులను సుబ్బారెడ్డి జారీచేయగా, మరుసటిరోజే అనుబంధ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో విజయసాయిరెడ్డి వాటిని రద్దు చేశారు. అక్కడితో ఆగకుండా పాతవారే ఆ హోదాల్లో కొనసాగుతారని స్పష్టంచేయడంతో ఇరువురి నేతల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. దీనికి ప్రతిచర్యగా...విజయసాయిరెడ్డికి అనుచరులుగా గుర్తింపుపొందిన 60వ వార్డు కార్పొరేటర్ పీవీ సురేష్‌తోపాటు 89వ వార్డు అధ్యక్షుడు దొడ్డి కిరణ్‌లను శనివారం పార్టీ నుంచి సస్పెండ్ చేయించడం ద్వారా సుబ్బారెడ్డి తన పట్టు చూపించుకునే యత్నం చేసినట్టు నేతలు విశ్లేషిస్తున్నారు. వారిద్దరూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంతోపాటు సమన్వయకర్త నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేస్తూ, సొంత అజెండాతో ముందుకువెళుతున్నందున సస్పెండ్ చేస్తున్నట్టు చెబుతున్నప్పటికీ కారణం మాత్రం ఇరువురు నేతల మధ్య విభేదాలేనని నేతలు పేర్కొంటున్నారు.
వైసీపీ నుంచి కార్పొరేటర్ పీవీ సురేష్ సస్పెన్షన్
89వ వార్డు పార్టీ అధ్యక్షుడు దొడ్డి కిరణ్ కూడా...
మల్కాపురం/గోపాలపట్నం, మే 13: జీవీఎంసీ 60వ వార్డు కార్పొరేటర్ పీవీ సురేష్, 89వ వార్డు అధ్యక్షుడు దొడ్డి కిరణ్‌లను వైసీపీ శనివారం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు ఈ చర్య తీసుకున్నట్టు ప్రకటించింది.
సురేష్ సస్పెండ్ కావడం రెండోసారి..
సురేష్ వైసీపీ నుంచి సస్పెండ్ కావడం ఇది రెండోసారి. మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్‌తో వున్న విభేదాల కారణంగా గతంలో ఒకసారి ఆయన సస్పెండయ్యారు. ఆయన తరచూ వివాదాలతో వార్తల్లో నిలుస్తుంటారు. పార్టీకి చెందిన మళ్ల ధనలత, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యానారాయణ, పొట్టి మూర్తి తదితరులతో ఆయన వేర్వేరు సందర్భాల్లో గొడవపడ్డారు. పొట్టి మూర్తి ఫిర్యాదు మేరకు మల్కాపురం పోలీసులు పీవీ సురేష్, ఆయన అనుచరులు నేవీ అనిల్, బిల్డర్ సంతోష్‌లపై కేసు నమోదుచేశారు. మొన్నటికి మొన్న దళిత వర్గానికి చెందిన రాజు చింత చెట్టు కింద ఏర్పాటుచేసుకున్న దుకాణానికి తనను వ్యతిరేకిస్తున్నవారు వస్తున్నారనే అక్కసుతో సచివాలయ ఉద్యోగుల సహకారంతో తొలగింపజేశారు. దీనిపై ఏడు వార్డుల్లో వున్న దళిత సంఘాల ప్రతినిధులు రోడ్డెక్కారు. ఈ తరుణంలో పశ్చిమ నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ ఆడారి ఆనంద్‌కుమార్ కల్పించుకుని దుకాణాన్ని పక్కనే ఉన్న హాకర్‌జోన్‌లో ఏర్పాటుచేయించారు. దానిని జీర్ణించుకోలేక సురేష్ ఈ అంశంపై జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు. అది పార్టీ వ్యతిరేక చర్యగా భావించిన వైసీపీ పెద్దలు సస్పెండ్ చేశారు.
మళ్ల ముఖ్య అనుచరుడు కిరణ్...
89వ వార్డు అధ్యక్షుడు దొడ్డి కిరణ్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు అందిన ఫిర్యాదు మేరకు సస్పెండ్ చేసినట్టు వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. గత కార్పొరేషన్ ఎన్నికల్లో 89వ వార్డు నుంచి కార్పొరేటర్ అభ్యర్ధిగా పోటీ చేసిన కిరణ్ టీడీపీ అభ్యర్థి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్‌కు ముఖ్య అనుచరుడిగా పేరొందిన దొడ్డి కిరణ్...ప్రస్తుత నియోజకవర్గ ఇన్‌చార్జి ఆడారి ఆనంద్‌కుమార్‌తో సఖ్యతగా ఉండడం లేదని అంటున్నారు.