Share News

పోలిపల్లి సభపై సమీక్ష

ABN , Publish Date - Dec 17 , 2023 | 01:22 AM

యువగళం పాదయాత్ర ముగింపు, విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద ఈనెల 20వ తేదీన నిర్వహించనున్న బహిరంగసభ ఏర్పాట్లపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు శనివారం నగరంలోని పార్టీ కార్యాలయంలో సీనియర్‌ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

పోలిపల్లి సభపై సమీక్ష

సీనియర్‌ నేతలతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సమావేశం

నగరంలోని అన్ని కూడళ్లను పార్టీ పతాకాలతో అలంకరించాలని నిర్ణయం

జన సమీకరణకు నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జుల నియామకం

విశాఖపట్నం, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి):

యువగళం పాదయాత్ర ముగింపు, విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద ఈనెల 20వ తేదీన నిర్వహించనున్న బహిరంగసభ ఏర్పాట్లపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు శనివారం నగరంలోని పార్టీ కార్యాలయంలో సీనియర్‌ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలిపల్లి సభకు భారీగా జన సమీకరణ చేయాలని, అదేవిధంగా ఈనెల 18వ తేదీ సాయంత్రం అగనంపూడి వద్ద పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనేలా చూడాలని సమావేశం నిర్ణయించింది. యువగళం పాదయాత్ర ముగింపు సభ ఏర్పాట్ల పర్యవేక్షణకు ఇప్పటికే 16 కమిటీలు వేశారు. ఈ సందర్భంగా నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లను అలంకరించాలని, యువగళం పాదయాత్ర హోర్డింగ్‌లు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. గాజువాక నుంచి రాజాపులోవ వరకు జాతీయ రహదారి పొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు, పార్టీ జెండాలతో అలంకరించాలని సమావేశంలో పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్రం నలుమూలల నుంచి సభలో పాల్గొనేందుకు వచ్చే కార్యకర్తల కోసం ప్రత్యేక రైళ్లు ఏర్పాటుచేసినట్టు పాదయాత్ర కమిటీ తరపున రాజేశ్‌ వెల్లడించారు. రైళ్లు నేరుగా విజయనగరం వెళతాయని, అక్కడ నుంచి బస్సుల్లో సభా ప్రాంగణానికి వస్తారన్నారు. రైళ్లలో వచ్చిన వారికి విజయనగరంలోనే కల్యాణమండపాలు రిజర్వు చేశామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సభ నిర్వహించే పోలిపల్లి ప్రాంతం నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉందని, అక్కడ నుంచి భారీగా జనాలను సమీకరించాలని ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజుకు సూచించారు. భీమిలి నుంచి ఎక్కువ మందిని సమీకరిస్తున్నామని ఇన్‌చార్జి కోరాడ రాజబాబు, పార్టీ నియమించిన జీవీ ఆంజనేయులు తెలిపారు. కాగా సభ కోసం ఉత్తరాంధ్రలోని ఐదు పార్లమెంటు, 34 అసెంబ్లీ నియోజక వర్గాలకు సీనియర్లను ఇన్‌చార్జులుగా నియమించామని అచ్చెన్నాయుడు వెల్లడించారు. సమీక్ష సమావేశంలో పార్టీ నేతలు కిమిడి కళావెంకటరావు, నిమ్మకాయల చినరాజప్ప, బండారు సత్యనారాయణమూర్తి, గంటా శ్రీనివాసరావు, బీదా రవిచంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, గోరంట్ల బుచ్చెయ్యచౌదరి, బుద్దా వెంకన్న, కోండ్రు మురళి, ఎం.శ్రీభరత్‌, పల్లా శ్రీనివాసరావు, గణబాబు, దువ్వారపు రామారావు, దామచర్ల సత్య, వేపాడ చిరంజీవిరావు, గండి బాబ్జీ, పీలా శ్రీనివాస్‌, కూన రవికుమార్‌, మహ్మద్‌ నజీర్‌, పెందుర్తి వెంకటేష్‌, తదితరులు పాల్గొన్నారు.

18న పాదయాత్ర ముగింపు

ఈనెల 18వ తేదీన ఉదయం లోకేశ్‌ అగనంపూడి సమీపంలోని ఉక్కు సంక్షేమ భవన్‌ నుంచి పాదయాత్ర ప్రారంభించి మధ్యాహ్నానికి 14 కిలోమీటర్ల మేర నడుస్తారని గాజువాక ఇన్‌చార్జి పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. మధ్యాహ్నం భోజనం తరువాత తిరిగి పాదయాత్ర మొదలుపెట్టి సాయంత్రం ఐదు గంటలకు అగనంపూడి టోల్‌గేట్‌ వద్దనున్న పైలాన్‌ వద్దకు చేరుకుంటారన్నారు. పైలాన్‌ ఆవిష్కరించిన అనంతరం లోకేశ్‌ మాట్లాడతారని వివరించారు.

Updated Date - Dec 17 , 2023 | 01:22 AM