పద్మనాభంలో రెవెన్యూ మాయాజాలం

ABN , First Publish Date - 2023-03-31T01:24:14+05:30 IST

జగనన్న కాలనీల కోసం పద్మనాభం మండలంలో భూములు ఇచ్చిన రైతుల పేర్లను మార్చేశారనే ప్రచారం జరుగుతోంది.

పద్మనాభంలో రెవెన్యూ మాయాజాలం

జగనన్న కాలనీల కోసం భూములు ఇచ్చిన వారి జాబితాల్లో అధికార పార్టీ నేతలు, వారి బినామీల పేర్లు నమోదు

అడంగల్‌ రికార్డుల్లో కూడా మార్పు

రైతుల్లో ఆందోళన

తమ వద్ద తీసుకున్న దానికంటే తక్కువ విస్తీర్ణం ఇచ్చినట్టు చూపుతున్నారని ఆరోపణ

విశాఖపట్నం/పద్మనాభం, మార్చి 30 (ఆంధ్రజ్యోతి):

జగనన్న కాలనీల కోసం పద్మనాభం మండలంలో భూములు ఇచ్చిన రైతుల పేర్లను మార్చేశారనే ప్రచారం జరుగుతోంది. ఆ స్థానంలో అధికార పార్టీకి చెందిన పలువురి నేతలు, వారి కుటుంబసభ్యులు, అనుయాయుల పేర్లు పొందుపరిచారని తెలుస్తోంది. భూములు ఇచ్చిన రైతుల పేర్లతో కూడిన జాబితా ఇవ్వడానికి పద్మనాభం మండల తహసీల్దార్‌ కార్యాలయ వర్గాలు నిరాకరిస్తుండడం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.

జగనన్న కాలనీల కోసం ఉమ్మడి విశాఖ జిల్లాలో భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి, పరవాడ, సబ్బవరం, పెదగంట్యాడ, విశాఖ రూరల్‌, అనకాపల్లి మండలాల నుంచి 6,115 ఎకరాలు సమీకరించాలని 2020 జనవరి 25వ తేదీన ప్రభుత్వం జీవో జారీచేసింది. ఖాళీగా ప్రభుత్వ భూములతోపాటు అసైన్డ్‌/రైతుల ఆక్రమణలో ఉన్న భూములు తీసుకోవాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా పద్మనాభం మండలంలో 23.47 ఎకరాలు అసైన్డ్‌ భూములు, పీవోటీ భూములు 3.29 ఎకరాలు, రైతుల ఆక్రమణలో ఉన్న 391.23 ఎకరాలు, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు 97.96 ఎకరాలు...మొత్తం 515.95 ఎకరాలు సమీకరించారు. అయితే భూసమీకరణ చేపట్టినప్పుడు అడంగల్‌ రికార్డును ఆధారంగా తీసుకుంటారు. అసైన్డ్‌ భూమికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చే పట్టాతోపాటు పాస్‌ పుస్తకం వివరాలు ఆన్‌లైన్‌లో నమోదవుతుంటాయి. ఆక్రమణ భూముల వివరాలకు కేవలం గ్రామాలకు చెందిన అడంగల్‌ రికార్డులను ప్రామాణికంగా తీసుకుంటారు. గతంలో ఏటా గ్రామాల వారీగా జమాబందీ (తనిఖీ) పేరిట భూముల రికార్డులను తనిఖీ చేసేవారు. ఆ సంవత్సరంలో గ్రామంలో కొత్తగా ఎవరైనా ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నారని గ్రామ పాలనాధికారి నిర్ధారిస్తే వెంటనే.... మెమో జారీచేసి సదరు రైతు నుంచి కొంత మొత్తం కట్టించుకుని రశీదు ఇచ్చేవారు. దీంతో సదరు భూమిలో రైతును ఆక్రమణదారుడిగా గుర్తించి అడంగల్‌లో నమోదుచేసేవారు. జమాబందీ నిర్వహించినప్పుడు అడంగల్‌లో మార్పులు, చేర్పులు జరిగేవి. ఈ ప్రక్రియ దాదాపు రెండు దశాబ్దాల నుంచి జరగడం లేదు. అందువల్ల ఆక్రమణదారుల విషయంలో 2000 సంవత్సరాని కంటే ముందు వుండే అడంగల్‌ రికార్డులే ప్రామాణికం. దీని ఆధారంగానే భూసమీకరణ చేపట్టారు. పద్మనాభం మండలంలో గ్రామాల వారీగా జాబితాలు రూపొందించేటప్పుడు అధికార పార్టీ నేతలతో కుమ్మక్కై అధికారులు అడంగల్‌ రికార్డులు మార్చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. ఉదాహరణకు ఒక రైతు సుమారు మూడెకరాల ప్రభుత్వ భూమి ఆక్రమించుకుని తోటలు వేసుకుంటే...తాజాగా సమీకరణలో మూడెకరాలకు బదులు 2/1.5 ఎకరాలు మాత్రమే రికార్డుల్లో వున్నట్టు అధికారులు చెబుతున్నారు. నరసాపురం, రెడ్డిపల్లి, కొవ్వాడ, గంధవరం గ్రామాల్లో ఎక్కువగా ఇటువంటి గోల్‌మాల్‌ వ్యవహారం జరిగిందని రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. రికార్డుల్లో రైతుల పేర్లు మార్చడం లేదా సాగు విస్తీర్ణాన్ని తగ్గించి...వారు సూచించిన వ్యక్తుల పేర్లను ఆక్రమణదారులుగా నమోదుచేశారని చెబుతున్నారు. సమీకరణ సమయంలో తీసుకున్న భూములకు తగ్గట్టుగా ప్లాట్లు కేటాయించకపోవడంతో అసలు విషయం బయటకు వచ్చింది. రైతుల జాబితా, అడంగల్‌ రికార్డుల వివరాలు అడుగుతున్నా చెప్పేందుకు పద్మనాభం తహసీల్దారు కార్యాలయం సిబ్బంది నిరాకరిస్తుండడంతో ఏదో గూడుపుఠాణి జరిగిందనే వాదనకు బలం చేకూరుస్తోంది.

ల్యాండ్‌ పూలింగ్‌ రికార్డులతో రండి

పద్మనాభం తహసీల్దార్‌కు జేసీ ఆదేశం

అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు రావడంతో విచారణకు నిర్ణయం

విశాఖపట్నం, మార్చి 30 (ఆంధ్రజ్యోతి):

పద్మనాభం మండలంలో జగనన్న కాలనీలకు అవసరమైన భూసమీకరణలో జరిగిన గోల్‌మాల్‌పై జిల్లా యంత్రాంగం స్పందించింది. ‘వైసీపీ నేత భూ మేత’ శీర్షికతో ఈనెల 28న ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనంపై జాయింట్‌ కలెక్టర్‌ కేఎస్‌ విశ్వనాథన్‌ స్పందించారు. భూసమీకరణకు సంబంధించి రికార్డులు తీసుకుని రావాలని మండల అధికారులను ఆదేశించారు. శుక్ర లేదా శనివారం తహసీల్దార్‌, డీటీ, సర్వేయర్‌, వీఆర్వోలు రికార్డులతో జేసీ వద్దకు రానున్నారు. మండలంలో ప్రధానంగా నరసాపురం, రెడ్డిపల్లి, గంధవరం, కొవ్వాడ గ్రామాల్లో అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతలు, వారి బినామీల పేర్లను అధికారులు భూములు ఇచ్చిన వారి జాబితాలో చేర్చారు. ఇంకా రైతులు ఇచ్చిన దానికంటే తక్కువ విస్తీర్ణం చూపించి, మిగతాది అధికార పార్టీ నేతల పేరిట నమోదుచేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీ నేతలకు చెందిన కుటుంబీకులకు తునివలసలో ప్రధాన రహదారికి ఆనుకుని ప్లాట్లు కేటాయింపులో పద్మనాభం తహసీల్దార్‌ కార్యాలయ అఽధికారులు, కొందరు సిబ్బంది పాత్ర వున్నట్టు ఫిర్యాదులు రావడంతో పూర్తిస్థాయి విచారణకు జేసీ నిర్ణయించారు.

Updated Date - 2023-03-31T01:24:14+05:30 IST