అక్రమాలపై స్పందిస్తే... అంతే!

ABN , First Publish Date - 2023-06-26T01:07:04+05:30 IST

కేటగిరీ-3లో ఉన్న ప్రధానోపాఽధ్యాయురాలికి కేటగిరీ-1లో ఉన్న పాఠశాలలో పోస్టింగ్‌ ఇవ్వడం అక్రమమని తన అభిప్రాయాన్ని తెలిపిన ఉపాధ్యాయ సంఘ నేతకు పాఠశాల విద్యాశాఖ విశాఖ ప్రాంతీయ సంచాలకురాలు ఎం.జ్యోతికుమారి షోకాజ్‌ నోటీస్‌ జారీచేశారు.

అక్రమాలపై స్పందిస్తే... అంతే!

ఉపాధ్యాయ సంఘ నేతకు ఆర్జేడీ షోకాజ్‌

కేటగిరీ-3లోని హెచ్‌ఎంకు కేటగిరీ-1లో పోస్టింగ్‌పై స్పందించిన ఉపాధ్యాయుడు

సర్వీస్‌ రూల్స్‌కు వ్యతిరేకమంటూ చర్యలు

హెచ్‌ఎం నియామకంపై పెదవివిప్పని అధికారి

‘ఆంధ్రజ్యోతి’ కథనానికి పొంతనలేని వివరణ

విశాఖపట్నం, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి):

కేటగిరీ-3లో ఉన్న ప్రధానోపాధ్యాయురాలికి కేటగిరీ-1లో ఉన్న పాఠశాలలో పోస్టింగ్‌ ఇవ్వడం అక్రమమని తన అభిప్రాయాన్ని తెలిపిన ఉపాధ్యాయ సంఘ నేతకు పాఠశాల విద్యాశాఖ విశాఖ ప్రాంతీయ సంచాలకురాలు ఎం.జ్యోతికుమారి షోకాజ్‌ నోటీస్‌ జారీచేశారు. ఈ చర్య ఉపాధ్యాయ వర్గాల్లో కలకలం రేపింది. చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా, బెదిరింపులకు దిగడం నిరంకుశ విధానాలకు పరాకాష్టగా ఉపాధ్యాయులు అభివర్ణిస్తున్నారు. ‘అడ్డగోలుగా హెచ్‌ఎం పోస్టు భర్తీ’ శీర్షికన ఈనెల 22న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంచాలకులు ‘ఆంధ్రజ్యోతి’కి వివరణ పంపారు. ఇందులో యూటీఎఫ్‌ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయ్‌కు షోకాజ్‌ జారీచేశామని పేర్కొన్నారు. అనకాపల్లి మండలం మామిడిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూలు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న చిన్నబ్బాయ్‌కు అక్కడి డీఈవో ద్వారా షోకాజ్‌ పంపించామన్నారు. అయితే నిబంధనలు పట్టించుకోకుండా చేపట్టిన నియామకంపై మాత్రం స్పందించలేదు.

అనకాపల్లి జిల్లా రోలుగుంట ఎంఈవోగా పనిచేసిన కిరణ్మయి అనే జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నిధుల దుర్వినియోగంలో ఆరోపణలు ఎదుర్కొని గత ఏడాది నవంబరులో సస్పెండయ్యారు. అయితే ఆమెను ఇటీవల పెందుర్తి జడ్పీ ఉన్నత పాఠశాల ప్రఽధానోపాధ్యాయురాలిగా నియమిస్తూ ఆర్జేడీ ఉత్తర్వులు ఇచ్చారు. నిబంధనల మేరకు ఏ కేటగిరీలో పనిచేస్తూ సస్పెన్షన్‌కు గురయ్యారో విచారణ తరువాత ఆ ఉద్యోగిని అదే కేటగిరీలో నియమించాలి. ఈ విషయం ఈ ఏడాది బదిలీ ఉత్తర్వుల్లోనూ ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. అయినా కేటగిరీ-3లో పనిచేసే ఉద్యోగిని కేటగిరీ-1లో నియమించడంలో ఆర్జేడీ కార్యాలయం అడ్డగోలుగా వ్యవహరించిందని యూటీఎఫ్‌ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నబ్బాయ్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తన అభిప్రాయాన్ని చెప్పారు. దీనిపై ఆర్జేడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఆంధ్రజ్యోతిలో వచ్చిన క్లిప్పింగ్‌ను తన అనుమతి లేకుండా వాట్సాప్‌ గ్రూప్‌లలో పోస్టు చేయడంపై షోకాజ్‌ జారీచేసి, అనకాపల్లి డీఈవో ద్వారా చిన్నబ్బాయ్‌కు పంపారు. ఏపీ సివిల్‌ సర్వీసెస్‌ రూల్స్‌ 1964ను ఉల్లంఘించారని, మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని నోటీస్‌లో పేర్కొన్నారు.

అసలు విషయంపై ఏదీ స్పందన?

ఉమ్మడి జిల్లాలో పదిరోజుల క్రితమే హెచ్‌ఎంల బదిలీలు, ఎంఈవోల పదోన్నతులు పూర్తయ్యాయి. దీంతో పలుచోట్ల ఉన్నత పాఠశాలల హెచ్‌ఎం పోస్టులు ఖాళీగా ఉండగా కేటగిరీ-1లోకి వచ్చే పెందుర్తి జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎంను ఆగమేఘాలపై నియమించడంలో ఆర్జేడీ కార్యాలయం అడ్డగోలుగా వ్యవహరించిందనేది ఆరోపణ. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించడంతో వివరణ పంపిన ఆర్జేడీ రోలుగుంటలో పనిచేసిన కాలంలో కిరణ్మయిపై మోపిన అభియోగాలపై విచారణాధికారి ఇచ్చిన నివేదిక, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు పెందుర్తి హెచ్‌ఎంగా నియమించామన్నారు. అయితే సస్పెన్షన్‌ గురైన కేటగిరీ 3లో పనిచేస్తున్న ఉద్యోగికి కేటగిరీ 1లో ఎలా పోస్టింగ్‌ ఇచ్చారనే దానిపై ఆర్జేడీ స్పందించలేదు.

న్యాయబద్ధమైన డిమాండ్లపైనే...

కేటగిరీ -3లో ఉన్న రోలుగుంట నుంచి కేటగిరీ--1కి వచ్చే పెందుర్తిలో కిరణ్మయికి పోస్టింగ్‌ ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం. దీనిపై ఉన్నతాధికారులు విచారించి చర్యలు తీసుకోవాలని ‘ఆంధ్రజ్యోతి’ ద్వారా కోరాను. ఇన్‌స్ట్రుమెంట్‌ నెగోషియబుల్‌ చట్టం మేరకు అన్యాయాన్ని ఖండించి, ఉద్యోగుల పక్షంగా స్పందించడం తప్పుకాదు. ఈ విషయాన్ని నా అభిప్రాయంగా ఆంధ్రజ్యోతికి చెప్పాను.

- గొంది చిన్నబ్బాయ్‌, యూటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి, అనకాపల్లి జిల్లా

Updated Date - 2023-06-26T01:07:04+05:30 IST