Share News

ఇన్‌ఆర్బిట్‌ మాల్‌తో మళ్లీ ఒప్పందమా?

ABN , First Publish Date - 2023-10-18T03:48:41+05:30 IST

సీఎం జగన్‌ ప్రభుత్వ తీరు చూసి ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకురావడం లేదు. ఈ విషయాన్ని కప్పి పుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కిందామీద పడుతోంది.

ఇన్‌ఆర్బిట్‌ మాల్‌తో మళ్లీ ఒప్పందమా?

శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుకే మళ్లీ ఎంవోయూ

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

సీఎం జగన్‌ ప్రభుత్వ తీరు చూసి ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకురావడం లేదు. ఈ విషయాన్ని కప్పి పుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కిందామీద పడుతోంది. తనకు సంబంధం లేని, ప్రమేయం లేని ప్రాజెక్టులను కూడా ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోంది. విశాఖలో ఇన్ఫోసిస్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ (సోమవారం ముఖ్యమంత్రి ప్రారంభించారు) ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి పాత్రా లేదు. అందులో కొత్తగా ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేదు. ఆగస్టులోనే లాంఛనంగా ప్రారంభమైన ఇన్ఫోసిస్‌ కార్యాలయానికి సోమవారం మరోసారి అట్టహాసంగా ప్రారంభోత్సవం చేసి ఐటీ అభివృద్ధికి నడుం బిగించినట్టు ప్రచారం చేసుకున్నారు. విశాఖలో ఆగస్టు 1న ఇన్‌ఆర్బిట్‌ మాల్‌కు శంకుస్థాపన చేశారు. తాజాగా.. ఇదే ప్రాజెక్టుకు సంబంధించి ముంబైలో మరో ఒప్పందం చేసుకున్నారు. రహేజా గ్రూపు కేంద్ర ప్రభుత్వ సంస్థ విశాఖపట్నం పోర్టు నుంచి 17 ఎకరాల స్థలాన్ని దీర్ఘకాలిక లీజుకు తీసుకొని అందులో రూ.600 కోట్లతో ఇన్‌ఆర్బిట్‌ మాల్‌ నిర్మించడానికి ఒప్పందం చేసుకుంది. దీనికి ఈ ఏడాది ఆగస్టు 1న రాష్ట్ర ప్రభుత్వం శంకుస్థాపన జరిపింది. భూమి విశాఖ పోర్టుది. అది కేంద్ర సంస్థ. నిధులు ప్రైవేటు కంపెనీవి. కానీ ఇక్కడ ప్రచారం కోసం నేరుగా సీఎం జగన్‌ వచ్చి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధమూ లేని ఈ ప్రాజెక్టు తమ వల్లే వచ్చిందని బిల్డప్‌ ఇచ్చారు. అక్కడితో ఆగలేదు. ఇదే ప్రాజెక్టుకు సంబంధించి తాజాగా ముంబైలో మరో ఒప్పందం చేసుకున్నారు. అక్కడ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఫొటోలకు పోజులిచ్చారు. కాకపోతే ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు సంస్థ పేరు మార్చేశారు. ట్రయాన్‌ ప్రాపర్టీ్‌సతో ఒప్పందం చేసుకుంటున్నట్టు, వారు రూ.900 కోట్లు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించారు. పోర్టుకు చెందిన స్థలం (అదే సాలిగ్రామపురం)లో ఐటీ వర్క్స్‌, షాపింగ్‌ మాల్‌ నిర్మిస్తారని ప్రకటించారు. ట్రయాన్‌ సంస్థ తరఫున రజనీశ్‌ మహాజన్‌ సంతకాలు చేయగా, పోర్టు తరఫున చైర్మన్‌ అంగముత్తు, డిప్యూటీ చైర్మన్‌ దూబే పాల్గొన్నారు. వచ్చేది ఒకటే ప్రాజెక్టు. కానీ ఒప్పందాలు రెండు. ప్రజల్ని నమ్మించడానికి ‘చెల్లికి మళ్లీ పెళ్లి’ అన్నట్టుగా విశాఖ పోర్టును అడ్డం పెట్టుకొని మరో రూ.900 కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని ప్రపంచస్థాయి సదస్సులో అడ్డంగా అబద్ధాలు ఆడేశారు.

Updated Date - 2023-10-18T03:48:41+05:30 IST