పాడేరు ఐటీడీఏ సేవలకు గుర్తింపు
ABN , First Publish Date - 2023-04-11T00:13:59+05:30 IST
స్థానిక సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) ద్వారా గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి చేపడుతున్న చర్యలు, నాణ్యమైన సేవలకు గానూ ఆర్గనైజేషన్ ఫర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్(ఐఎస్‌వో) గుర్తింపు లభించింది. దీనికి సంబంధించిన సర్టిఫికెట్‌ను సోమవారం జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్, ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణకు సంస్థ ఎండీ శివయ్య సోమవారం అందించారు.
వరించిన ఐఎస్‌వో: 9001-2015 సర్టిఫికెట్
అందుకున్న కలెక్టర్, ఐటీడీఏ పీవో
తెలుగు రాష్ట్రాల్లో ఈ ఐటీడీఏకే గుర్తింపు రావడంపై సర్వత్రా హర్షం
(ఆంధ్రజ్యోతి- పాడేరు)
స్థానిక సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) ద్వారా గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి చేపడుతున్న చర్యలు, నాణ్యమైన సేవలకు గానూ ఆర్గనైజేషన్ ఫర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్(ఐఎస్‌వో) గుర్తింపు లభించింది. దీనికి సంబంధించిన సర్టిఫికెట్‌ను సోమవారం జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్, ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణకు సంస్థ ఎండీ శివయ్య సోమవారం అందించారు. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి వారిని ప్రగతి పథంలో నడిపించేందుకు గానూ 1975లో ఐటీడీఏలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పది వరకు ఐటీడీఏలుండగా.... ప్రస్తుతం నవ్యాంధ్రలో పాడేరు, రంపచోడవరం, పార్వతీపురం, సీతంపేట, చింతూరు, వీఆర్.పురం, శ్రీశైలం ప్రాంతాల్లో ఐటీడీఏలున్నాయి. ఆయా ఐటీడీఏల ద్వారా సుమారుగా 27 లక్షల మంది గిరిజనుల సంక్షేమానికి చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలో స్థానిక ఐటీడీఏ పెద్దది కావడంతోపాటు దీని ద్వారా 7 లక్షల మంది గిరిజనుల సంక్షేమ, అభివృద్ధికి చర్యలు చేపడుతున్నారు.
నాణ్యమైన సేవలకు పాడేరు ఐటీడీఏకు గుర్తింపు
స్థానిక ఐటీడీఏ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల కోసం విడుదల చేస్తున్న నిధుల ద్వారా నాణ్యమైన సేవలు అందుతున్నాయని ఆర్గనైజేషన్ ఫర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్(ఐఎస్‌వో) గుర్తించింది. ప్రధానంగా గిరిజన గ్రామాల అభివృద్ధికి వివిధ రకాల చర్యలు చేపట్టడంపాటు ఉత్తమ విద్య, వైద్య సేవలు అందిస్తుండడంతోపాటు మెరుగైన జీవనోపాధికి కృషి చేస్తున్నట్టు గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మొత్తం ఐటీడీఏల్లో పాడేరు ఐటీడీఏ పరిధిలోనే గిరిజనులకు నాణ్యమైన సేవలు అందుతున్నట్టు ఈ సంస్థ పలు సర్వేలు చేసి నిర్ధారించింది. దీంతో పాడేరు ఐటీడీఏను ఐఎస్‌వో: 9001- 2015 ధ్రువీకరణకు ఎంపిక చేసి, ఆ సర్టిఫికెట్‌ను సోమవారం కలెక్టర్, ఐటీడీఏ పీవోలకు అందించారు.
ఐఎస్‌వో ధ్రువీకరణ పొందేందుకు గోపాలక్రిష్ణ కృషి
స్థానిక ఐటీడీఏకు ఐఎస్‌వో గుర్తింపు లభించేందుకు ప్రాజెక్టు అధికారి రోణంకి గోపాలక్రిష్ణ కృషి ఎంతో ఉందని అధికారులు అంటున్నారు. ఆయన పీవోగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏజెన్సీలో విద్య, వైద్య రంగాలను గాడిలో పెట్టడడంతో పాటు మారుమూల ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం, ఉపాధి పనులు, వెలుగు ద్వారా గిరిజనుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టారు. ఏజెన్సీ ఆస్పత్రుల్లోనే ఆపరేషన్లు జరిగేలా, పలు పీహెచ్‌సీల్లో గర్భిణులకు ఆశ్రయం కల్పించేందుకు బర్త్ వెయిటింగ్ హాళ్ల నిర్మాణం వంటివి గిరిజనులకు ఎంతో ఉపయోగపడ్డాయి. మారుమూల ప్రాంతాల్లో సైతం పర్యటించి, అక్కడి గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఈ క్రమంలో ఐటీడీఏ ద్వారా గిరిజనులకు అందుతున్న సేవలపై ఐఎస్‌వో సర్వే నిర్వహించడం లాభించిందని అధికారులు అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో స్థానిక ఐటీడీఏకు మాత్రమే ఐఎస్‌వో గుర్తింపు లభించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.