Share News

రియల్‌ ఢమాల్‌

ABN , First Publish Date - 2023-11-10T01:06:14+05:30 IST

గ్రామీణ ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పడకేసింది. భూముల క్రయవిక్రయాలు తగ్గిపోయాయి. వేసిన లేఅవుట్లలో ప్లాట్లు అమ్ముకోవడానికి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు నానాపాట్లు పడుతున్నారు. కొంతమంది రియల్టర్లు పెట్టుబడి కోసం చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక తక్కువ రేటుకు స్థలాలను తెగనమ్ముకుని నష్టపోతున్నారు.

రియల్‌ ఢమాల్‌
చోడవరం పట్టణ శివారులో వేసిన ఒక లేఅవుట్‌ 8సీడీఎం3: తుప్పలు పెరిగిపోయి ఆనవాళ్లు లేని లేఅవుట్‌

గ్రామీణ ప్రాంతంలో పడకేసిన స్థిరాస్తి వ్యాపారం

లేఅవుట్లలో బాగా తగ్గిపోయిన స్థలాల క్రయవిక్రయాలు

ప్లాట్లు అమ్ముకోవడానికి వ్యాపారులు నానాపాట్లు

రేటు తగ్గించి అమ్ముదామన్నా ముందుకు రాని కొనుగోలుదారులు

పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రియల్టర్లు

చోడవరం, నవంబరు 8: గ్రామీణ ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పడకేసింది. భూముల క్రయవిక్రయాలు తగ్గిపోయాయి. వేసిన లేఅవుట్లలో ప్లాట్లు అమ్ముకోవడానికి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు నానాపాట్లు పడుతున్నారు. కొంతమంది రియల్టర్లు పెట్టుబడి కోసం చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక తక్కువ రేటుకు స్థలాలను తెగనమ్ముకుని నష్టపోతున్నారు.

జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో ఏడాది క్రితం వరకు భూముల కొనుగోలు దారులు, అమ్మకందారులు, మధ్యవర్తుల హడావుడితో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా ఉండేది. జాతీయ రహదారి పక్కనున్న మండలాలతోపాటు చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో రోడ్డు పక్కన ఉన్న భూములే కాకుండా, ప్రధాన రహదారికి దూరంగా ఉన్న భూములను కూడా కొనుగోలు చేసి వెంచర్లు వేసేవారు. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద క్రయవిక్రయదారులతో సందడిగా వుండేది. ఇదంతా ఏడాది క్రితం నాటి మాట. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పూర్తిగా మందగించింది. భూముల కొనుగోళ్లు, అమ్మకాలు తగ్గిపోయాయి. గతంలో వేసిన లేఅవుట్లలో ప్లాట్లు అమ్ముడుపోక ఏం చేయాలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు పాలుపోవడంలేదు. కొంతమంది రియల్టర్లు అప్పులు చేసి భూములు కొనుగోలు చేశారు. లేఅవుట్‌లలో స్థలాలు అమ్ముడుపోకపోవడం, తెచ్చినర అప్పులకు వడ్డీలు పెరిగిపోతుండడంతో తక్కువ రేటుకు స్థలాలను అమ్మేస్తున్నారు. మొత్తంగా చేస్తే నష్టమే తప్ప లాభం లేదని అంటున్నారు. ప్రభుత్వమే భూముల విలువను విపరీతంగా పెంచేయడం, ఇందుకు అనుగుణంగా స్థలాల రేట్లు నిర్ధారించాల్సి రావడం వంటి కారణాల వల్ల లేఅవుట్లలో స్థలాలు అమ్ముడుపోవడంలేదని రియల్టర్లు వాపోతున్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతంలోని రియల్‌ ఎస్టేట్‌ల లేఅవుట్లలో స్థలాల అమ్మకాలు/ కొనుగోళ్లు దాదాపు సగానికి పడిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో రిజిస్ట్రేషన్లు తగ్గిపోయి సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాల వద్ద హడావుడి తగ్గిపోయింది. డాక్యుమెంట్‌ రైటర్లు సైతం ఖాళీగా వుండాల్సిన పరిస్థితి నెలకొంది.

నాలుగైదు నెలల క్రితం వరకు చోడవరం ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ ప్లాట్ల విక్రయాలు/ కొనుగోళ్లకు సంబంధించి రోజుకు 50 వరకు రిజిస్ర్టేషన్లు వుండగా, ప్రస్తుతం రోజుకు పది రిజిస్ట్రేషన్లకు మించి వుండడంలేదు. ఇవి కూడా కుటుంబ సభ్యుల మధ్యన పంపకాలు, గిఫ్గ్‌ట డీడ్‌లే ఎక్కువగా ఉంటున్నాయి. ఏడాదిన్నర క్రితం విశాఖ కేంద్రంగా పరిపాలన రాఽజధాని అంటూ పాలకులు హడావుడి చేయడంతో ఇతర ప్రాంతాలకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో ఎడాపెడా భూములు కొనేశారు. ఒక్క రోజులోనే భూమి కొనుగోలు ధర పది శాతం పెరిగిన సందర్భాలు కూడా వున్నాయి. మారుమూల గ్రామాల్లో సైతం ధరలు పెంచేశారు. తరువాత జరిగిన పరిణామాలతో విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు త్రిశంకుస్వర్గంలో పడడంతో భూముల కొనుగోళ్లను రియల్టర్లు ఆపేశారు. దీంతో ధరలు క్రమేపీ తగ్గుతూ వస్తున్నాయి. భూముల కొనుగోలుకు అగ్రిమెంట్‌ చేసుకుని, కొంత సొమ్మును అడ్వాన్సులు ఇచ్చిన వ్యాపారులు.. అనంతరం రిజిస్ట్రేషన్లు చేయించుకోలేక, తాము ఇచ్చిన అడ్వాన్సు సొమ్ములో కొంత మొత్తాన్ని మినహాయించుకుని మిగిలిన సొమ్మును తిరిగి ఇవ్వాలని బతిమాలుకుంటున్నారు. మరికొందరు రియల్టర్లు ఎక్కువ రేటుకు భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించుకుని మరింత నష్టంపోవడం ఎందుకున్న ఉద్దేశంతో అడ్వాన్సు సొమ్మును వదిలేసుకున్నారు. ఫలితంగా రియల్‌ భూమ్‌కు బ్రేకులు పడ్డాయి.

ప్రస్తుతం చోడవరం, మాడుగుల వంటి పట్టణ ప్రాంతాల్లో అక్కడక్కడా లే అవుట్లు వేస్తున్నప్పటికీ స్థలాల కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో వుండడంలేదు. పెట్టిన పెట్టుబడి ఇప్పట్లో చేతికి తిరిగి రావడం కష్టమేనని వ్యాపారులు అంటున్నారు. కొన్ని లేఅవుట్లలో కనీసం పదో వంతు స్థలాలు కూడా అమ్మడుపోలేదు. ప్రధాన రహదారికి దూరంగా వేసిన లేఅవుట్లలో తుప్పలు పెరిగిపోయి, సరిహద్దు రాళ్లు, రోడ్లు కనిపించని పరిస్థితి నెలకొంది. పెట్టిన పెట్టుబడి సైతం చేతికి వచ్చే అవకాశం లేకపోవడంతో పలువురు రియల్టర్లు ధర తగ్గించి అమ్మడానికి సిద్ధపడుతున్నా, కొనుగోలుదారులు ముందుకు రావడంలేదు. ఈ పరిస్థితి ఎంతకాలం వుంటుందో తలపండిన రియల్టర్లు, దళారులు సైతం అంచనా వేయలేకపోతున్నారు.

Updated Date - 2023-11-10T01:06:15+05:30 IST