కేజీబీవీ టీచర్లకు జీతాల్లేవ్‌

ABN , First Publish Date - 2023-03-31T01:22:24+05:30 IST

ఉమ్మడి జిల్లాలోని 34 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేబీవీవీ)ల్లో పనిచేసే ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి ఫిబ్రవరి నెల జీతాలు ఇప్పటికీ అందలేదు.

కేజీబీవీ టీచర్లకు జీతాల్లేవ్‌

మూడు జిల్లాలో పరిధిలోని 1,500 మందికి అందని ఫిబ్రవరి నెల వేతనాలు

స్పందించని సంఘాల నేతలు

విశాఖపట్నం, మార్చి 30 (ఆంధ్రజ్యోతి):

ఉమ్మడి జిల్లాలోని 34 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేబీవీవీ)ల్లో పనిచేసే ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి ఫిబ్రవరి నెల జీతాలు ఇప్పటికీ అందలేదు. వీరితోపాటు మండల విద్యాశాఖ కార్యాలయాలు, స్కూల్‌కాంప్లెక్స్‌లో పనిచేసే సీఆర్పీలు, ఇతర సిబ్బందికి కూడా జీతాలు రాలేదు.

ఉమ్మడి జిల్లా పరిధిలో కేజీబీవీ టీచర్లు, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌, సీఆర్పీలు కలిసి 1,500 మంది వరకు ఉంటారు. కొన్ని నెలలుగా వీరికి సక్రమంగా జీతాలు అందడం లేదు. ప్రతినెలా సిబ్బందికి అవసరమైన బడ్జెట్‌ ప్రభుత్వం విడుదల చేస్తే, సమగ్రశిక్ష అభియాన్‌ అధికారులు బిల్లులు అప్‌లోడ్‌ చేస్తుంటారు. ఆ తరువాతే బిల్లులు మంజూరు చేస్తుంటారు. ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. జిల్లాల విభజన తరువాత విశాఖ జిల్లాలో మూడు కేజీబీవీలు, మండలాల్లో పనిచేసే సీఆర్పీలకు ఇక్కడి సమగ్రశిక్ష అభియాన్‌ ప్రధాన కార్యాలయంలో వున్న నిధుల నుంచి ప్రతినెలా జీతాలు విడుదల చేసేవారు. ప్రభుత్వం బడ్జెట్‌ విడుదల చేసిన తరువాత తిరిగి సమగ్రశిక్ష అభియాన్‌ ఖాతాకు సర్దుబాటు చేసుకునేవారు. అయితే ఫిబ్రవరి నెలకు మాత్రం విశాఖ జిల్లాలో కూడా నిధులు అందుబాటులో లేక జీతాలు అందలేదు. అనకాపల్లి జిల్లాలో 20 కేజీబీవీలు ఉండగా వాటిలో పనిచేసే సిబ్బందికి ప్రతి నెలా జీతం కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 11 కేజీబీవీల సిబ్బందికి జీతాల బట్వాడాలో జాప్యం జరుగుతోంది. వీరికి డిసెంబరు, జనవరి నెల జీతాలు వారం క్రితం అందాయి. మూడు జిల్లాల అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో జీతాల బట్వాడాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని టీచర్లు ఆరోపిస్తున్నారు. గతంలో ఏడాదికి సరిపడా బడ్జెట్‌ జిల్లా కలెక్టర్‌ ఖాతాకు జమచేసేవారు. ప్రతినెలా జీతం కోసం ముందుగానే బిల్లులు సిద్ధం చేసి, జీతాలు డ్రాచేసి టీచర్లు, ఇతర సిబ్బందికి అందజేసేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జీతాల బట్వాడాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వీరంతా ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల జరిగిన పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కేజీబీవీ టీచర్ల ఓట్లన్నీ గంపగుత్తగా వైసీపీ అభ్యర్థికి వేస్తామని అఽధికార పార్టీ నేతల వద్ద ప్రమాణం చేసిన సంఘాల నేతలు జీతాలపై పెదవి విప్పడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కేజీబీవీలు, మండల విద్యాశాఖ కార్యాలయాలు, స్కూలు కాంప్లెక్స్‌లలో పనిచేసే సీఆర్పీల సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా హామీలిచ్చినా...ఆకలి కేకలు పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు.

Updated Date - 2023-03-31T01:22:24+05:30 IST