జోరుగా రైల్వే లైన్ డబ్లింగ్ పనులు
ABN , First Publish Date - 2023-11-28T00:37:56+05:30 IST
కొత్తవలస- కిరండోల్ రైల్వే లైన్‌లో డబ్లింగ్ పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం సిమిలిగుడ రైల్వే స్టేషన్ నుంచి కరకవలస, బొర్రా రైల్వే స్టేషన్ల మధ్య జోరుగా డబ్లింగ్ ట్రాక్ పనులతో పాటు వంతెనలకు సంబంధించిన పిల్లర్ల పనులు జరుగుతున్నాయి.
కొత్తవలస- కిరండోల్ మధ్య చకచకా
శరవేగంగా రెండో ట్రాక్, వంతెనల నిర్మాణం
అరకులోయ, నవంబరు 27:
కొత్తవలస- కిరండోల్ రైల్వే లైన్‌లో డబ్లింగ్ పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం సిమిలిగుడ రైల్వే స్టేషన్ నుంచి కరకవలస, బొర్రా రైల్వే స్టేషన్ల మధ్య జోరుగా డబ్లింగ్ ట్రాక్ పనులతో పాటు వంతెనలకు సంబంధించిన పిల్లర్ల పనులు జరుగుతున్నాయి. మరో వైపు కొండలను తవ్వి రెండవ మార్గం ఏర్పాటుకు పెద్ద ఎత్తున యంత్రాలతో రేయింబవళ్లు పనులు చేస్తున్నారు. ముఖ్యంగా కరకవలస నుంచి బొడ్డవర వరకు అత్యధిక శాతం టన్నెల్స్, వంతెనలు ఉన్నాయి. వీటి ఏర్పాటులో భాగంగా మొదటగా కరకవలస- బొర్రా మధ్య రెండు చోట్ల పాత టన్నెల్‌కు కొంత దూరంలో అదే కొండను తవ్వి నూతన టన్నెల్ పనులు ప్రారంభించారు. అదే విధంగా రెండవ ట్రాక్ ఏర్పాటుకు కొండ అంచులను తవ్వి చదును చేసే పనులు చేపడుతున్నారు. అంతే కాకుండా బొడ్డవర, శివలింగపురం, తైడా, చిమిడిపల్లి, బొర్రా రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న వంతెనల పక్క నుంచే కొత్త వంతెనలను నిర్మించేందుకు మట్టి పనులు పెద్ద ఎత్తున చేపడుతున్నారు. ఈ పనులు రెండేళ్లుగా జరుగుతుండగా ఇటీవల గోరాపూర్ నుంచి సిమిలిగుడ వరకు 24 కిలోమీటర్ల మేర పనులు పూర్తిచేసి ట్రాక్‌ను రైల్వే సేఫ్టీ కమిషనర్, వాల్తేరు డీఆర్‌ఎం పరిశీలించి ప్రారంభించారు.
63.3 శాతం పనులు పూర్తి
కొత్తవలస నుంచి కిరండోల్ వరకు 445.5 కిలో మీటర్ల రైల్వే లైన్ ఉంది. ఈ మార్గంలో ఇప్పటి వరకు 282.8 కిలో మీటర్లు అంటే సుమారు 63.3 శాతం పనులు పూర్తి కాగా, మిగిలిన 167 కిలోమీటర్లు అంటే సుమారు 36.3 శాతం పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ మార్గంలో 58 టన్నెల్స్‌కు గాను ప్రస్తుతం కరకవలస- బొర్రా మధ్య రెండు టన్నెల్స్‌ను పూర్తి చేశారు.