ముమ్మాటికీ కక్ష సాధింపే

ABN , First Publish Date - 2023-03-26T01:43:30+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీపై లోక్‌సభలో అనర్హత వేటు వేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ముమ్మాటికీ కక్ష సాధింపే

రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని ఖండించిన నగరవాసులు

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతుకలను నొక్కే యత్నమని ఆందోళన

లోక్‌సభ స్పీకర్‌ తక్షణం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్‌ నేతల డిమాండ్‌

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీపై లోక్‌సభలో అనర్హత వేటు వేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై రాజకీయ పార్టీల నాయకులతోపాటు సాధారణ ప్రజల్లోనూ విస్తృతమైన చర్చ సాగుతోంది. పరువు నష్టం కేసులో రాహుల్‌గాంధీని దోషిగా నిర్ధారిస్తూ సూరత్‌ కోర్టు తీర్పు ఇచ్చిన మరుసటిరోజే ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌ చర్యలు తీసుకున్నారు. దీనిపై నగరంలో పెద్దఎత్తున చర్చ సాగుతోంది.

అదానీ వ్యవహారంలో మోదీ, షా ద్వయాన్ని పార్లమెంట్‌ సాక్షిగా ప్రశ్నించినందుకే రాహుల్‌గాంధీపై ఈ చర్యకు పాల్పడ్డారని మద్దిలపాలెంలో వుంటున్న రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి ఒకరు పేర్కొన్నారు. ఇది విపక్షాల గొంతు నొక్కే చర్యల్లో భాగమేనన్నారు. గత తొమ్మిదేళ్లుగా నియంతృత్వ విధానాలకు అలవాటు పడిన ప్రధాని, కేంద్ర హోం మంత్రి విమర్శలను తట్టుకోలేక రాహుల్‌గాంధీపై అన్యాయంగా చర్యలు తీసుకున్నారని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రీసెర్చ్‌ చేస్తున్న ఒక విద్యార్థి పేర్కొన్నాడు. దేశంలో పెద్ద పెద్ద నేరాలు చేసిన నాయకులు దర్జాగా పదవులు అనుభవిస్తున్నారని, అంతేగాకుండా తమ పార్టీలోనే ఎంతోమంది నాయకులపై అత్యాచారం, హత్యాయత్నం వంటి కేసులు ఉన్నా పట్టించుకోని బీజేపీ పెద్దలు...రాహుల్‌పై చర్యలు తీసుకోవడం వెనుక రాజకీయ కక్ష సాధింపు ధోరణి కనిపిస్తోందని ఎకనామిక్స్‌ అధ్యాపకుడొకరు పేర్కొన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉండాలే తప్ప..కక్ష సాధింపు ధోరణు లు ఉండకూడదని, ఇది అత్యంత ప్రమాదకరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాలను అదుపులో పెట్టుకునేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని, ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగిస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని డీవైఎఫ్‌ఐ జిల్లా ప్రెసిడెంట్‌ రాజు పేర్కొన్నారు. ఈ తరహా చర్యలను ప్రజాస్వామ పక్షాలన్నీ తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరముందన్నారు.

పార్టీ నేతల ఆగ్రహం

రాహుల్‌గాంధీపై తీసుకున్న చర్యను కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. స్పీకర్‌ తక్షణం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వజ్జపర్తి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. బీజేపీతో దేశానికి ఎంత ప్రమాదమో ఈ తరహా చర్యల వల్ల ప్రజలకు అర్థమవుతోందన్నారు. రాహుల్‌గాంధీ వంటి దేశభక్తి కలిగిన నాయకుడిని లోక్‌సభ నుంచి బహిష్కరించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా భావించాలని ఆ పార్టీ నాయకుడు మూల వెంకటరావు పేర్కొన్నారు.

Updated Date - 2023-03-26T01:43:30+05:30 IST