అవిసె సాగు విస్తరణకు సై
ABN , First Publish Date - 2023-02-17T01:02:27+05:30 IST
ఏజెన్సీలో గంజాయికి ప్రత్యామ్నాయ పంటగా లిన్‌సీడ్(అవిసె) సాగు విస్తరింపజేసేందుకు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశారు. గిరిజన ప్రాంత వాతావరణం లిన్‌సీడ్ సాగుకు అనుకూలమని భావించిన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ఎనిమిదేళ్ల కిందట ప్రయోగాత్మక సాగును ప్రారంభించారు.
- శాస్త్రవేత్తల ప్రయోగాత్మక సాగు విజయవంతం
- ఈ ఏడాది రైతులకు విత్తనాల మినీకిట్స్ పంపిణీకి చర్యలు
చింతపల్లి, ఫిబ్రవరి 16:
ఏజెన్సీలో గంజాయికి ప్రత్యామ్నాయ పంటగా లిన్‌సీడ్(అవిసె) సాగు విస్తరింపజేసేందుకు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశారు. గిరిజన ప్రాంత వాతావరణం లిన్‌సీడ్ సాగుకు అనుకూలమని భావించిన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ఎనిమిదేళ్ల కిందట ప్రయోగాత్మక సాగును ప్రారంభించారు. ప్రయోగాత్మక సాగు ఫలితాలను విస్తృత స్థాయిలో అధ్యాయనం చేసి ఆదివాసీ రైతుల ఆర్థిక ప్రగతికి లిన్‌సీడ్ లాభదాయకమని గుర్తించారు. ఈ నేపథ్యంలో పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు లిన్‌సీడ్ విత్తనాలను ఈ ఏడాది రైతులకు మినీకిట్స్ రూపంలో అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆకర్షణీయమైన పూలతో లిన్‌సీడ్ పంట చూపరులను అమితంగా ఆకట్టుకుంటోంది.
ఉత్తర భారతదేశం, విదేశాల్లో లిన్‌సీడ్(అవిసె) పంటను పురాతన కాలం నుంచి నార, నూనె కోసం రైతులు సాగుచేస్తున్నారు. ఈ గింజల్లో నూనె 37-43 శాతం వుంటుంది. ఈ నూనెను వంటకాలతో పాటు రంగులు, వార్నిషులు, వాటర్‌ప్రూఫ్ దుస్తులు, అలంకరణ క్రీములు, ఆయుర్వేద ఔషధాలు, బేకరీ వంటకాల తయారీలో ప్రముఖంగా ఉపయోగిస్తారు. నూనె తీయగా వచ్చిన పిండి పశువుల దాణాగా, ఎరువులుగా ఉపయోగపడుతోంది. ఈ మొక్కల కాండం నుంచి నార కూడా తీస్తున్నారు. ఉత్తర భారతదేశం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో అధిక విస్తీర్ణంలోనూ, బిహార్, రాజస్తాన్, కర్ణాటక, వెస్ట్‌బెంగాల్‌లో తక్కువ విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు.
గిరిజన ప్రాంతాలు అనుకూలం
లిన్‌సీడ్ సాగుకు అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన ప్రాంతం అత్యంత అనుకూలమని శాస్త్రవేత్తలు పరిశోధనలు ద్వారా నిర్ధారించారు. సముద్రమట్టానికి 770 మీటర్లు ఎత్తు, ఏడాదికి సగటున 450-750 వర్షపాతం, శీతల వాతావరణం కలిగిన ప్రాంతాలు సాగుకు అనుకూలం. గిరిజన ప్రాంతం సముద్రమట్టానికి 1000-1200 మీటర్ల ఎత్తులో ఉంది. సాధారణ వర్షపాతం 1250ఎంఎం కాగా, 1350-1450ఎంఎం వర్షపాతం నమోదవుతుంది. వాతావరణం అనుకూలించడంతో సాగుకు అనుకూలమని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
లిన్‌సీడ్ సాగు లాభదాయకం
లిన్‌సీడ్ ఆధిక ఆదాయం సమకూర్చే లాభదాయక పంటగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆరోగ్యానికి మేలుచేసే గుణాలు లిన్‌సీడ్‌లో పుష్కలంగా వున్నాయి. ఈ మేరకు అంతర్జాతీయ మార్కెట్‌లో 200 గ్రాముల గింజలు రూ.180 ధరకు లభిస్తున్నాయి. లిన్‌సీడ్ ఎకరానికి 5-6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎకరం విస్తీర్ణంలో లిన్‌సీడ్ సాగుచేసేందుకు ఒక రైతు సుమారు రూ.60-80 వేలు ఖర్చు చేయాల్సి వుంటుంది. రైతు ఎకరానికి కనీసం ఐదు క్వింటాళ్లు దిగుబడి సాధించినా కిలో రూ.600-800 మధ్య ధరకు ప్రాంతీయ మార్కెట్‌లో విక్రయించుకుంటే దాదాపు రూ.4.5 లక్షల ఆదాయం వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లిన్‌సీడ్ సాగు చేపట్టిన రైతులకు కేవలం మూడు నెలల్లో ఎకరం విస్తీర్ణం నుంచి నాలుగు లక్షల నికర ఆదాయం వచ్చే అవకాశముంది.
--------
విత్తనాల కోసం సంప్రతించవచ్చు (ఫొటో-16సీటీపీ6)
లిన్‌సీడ్ సాగుపై ఆసక్తి కలిగిన గిరిజన రైతులు విత్తనాల కోసం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాన్ని సంప్రతించవచ్చు. గిరిజన ప్రాంతానికి కె-2, ఎన్‌ఎల్-42 రకాలు అనుకూలం. రెండూ స్వల్పకాలిక రకాలు. ఈ ఏడాది అభ్యుదయ రైతులకు చిరు సంచుల్లో విత్తనం అందజేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.
- పి.జోగారావు, భూసార విభాగం శాస్త్రవేత్త, ఆర్‌ఏఆర్‌ఎస్, చింతపల్లి
----------
రైతులకు ప్రత్యేక శిక్షణ (ఫొటో- 16సీటీపీ7)
లిన్‌సీడ్ సాగుపై గిరిజన రైతులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. గంజాయికి ప్రత్యామ్నాయంగా అధిక ఆదాయం సమకూర్చే పంటల్లో లిన్‌సీడ్ ఒకటి. లిన్‌సీడ్‌ను గిరిజన రైతులు రబీసీజన్‌లో వాణిజ్య సరళిలో సాగుచేసుకుంటే అధిక ఆదాయం పొందవచ్చు. అక్టోబరు- నవంబరులో నాట్లు వేసుకోవాలి. సాగుపై ఆసక్తి కలిగిన రైతులు ఏప్రిల్‌లోనే పరిశోధన స్థానాన్ని సంప్రతించాలి.
- డాక్టర్ ఎం.సురేశ్‌కుమార్, ఏడీఆర్, ఆర్‌ఏఆర్‌ఎస్ చింతపల్లి
------------
లిన్‌సీడ్‌లో బహుళ ఆరోగ్య ప్రయోజనాలు (ఫొటో- 16పీటీపీ8)
లిన్‌సీడ్ ఆయిల్, గింజల పొడిని ఆహారంగా తీసుకోవడం వల్ల మానవుల ఆరోగ్యానికి అత్యధిక ప్రయోజనాలు చేకూరతాయని నిపుణుల అధ్యాయనంలో రుజువైంది. ఆయిల్‌గా ఉపయోగించడంతో పాటు ఈ గింజలను వేయించుకుని తినేవారు అధికంగా వున్నారు. గింజలను పొడిగా చేసుకుని, పలు ఆహార పదార్థాల్లో కలుపుకుని ఆహారంగా తీసుకుంటున్నారు. లిన్‌సీడ్‌లో అత్యధికంగా రోగనిరోధక శక్తిని పెంపొందించే యాంటీఆక్సిడెంట్స్ వున్నాయి. దీంతో క్యాన్సర్‌ను నిరోధిస్తుంది. శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్‌ను నియంత్రించి అధిక బరువును తగ్గిస్తుంది. రక్తపోటు, మధుమేహాన్ని క్రమబద్ధీకరిస్తుంది. హార్మోన్ల్ల సమతుల్యతను మెరుగుపరిచి రుతుక్రమం సమస్యలను పరిష్కరిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
- బి.దివ్య సుధ, గృహ విజ్ఞాన శాస్త్రవేత్త, ఏవీకే హరిపురం