ఘాట్‌లో ‘రక్షణ’ కరువు

ABN , First Publish Date - 2023-02-02T00:37:30+05:30 IST

పాడేరు నుంచి మైదాన ప్రాంతానికి రాకపోకలు సాగించే స్థానిక ఘాట్‌ మార్గంలో రక్షణ గోడలు శిథిలమై ఏళ్లు గడుస్తున్నాయి. వాస్తవానికి ఎక్కడైనా ఘాట్‌ రోడ్లకు రక్షణ గోడలే ప్రధాన ఆధారం. కానీ వీటిపై అధికారులు దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది.

ఘాట్‌లో ‘రక్షణ’ కరువు
ప్రమాదకరమైన మలుపు వద్ద రక్షణ గోడ లేని పరిస్థితి

పాడేరు ఘాట్‌ మార్గంలో రక్షణ గోడలు శిథిలం

ఏళ్లు గడుస్తున్నా మరమ్మతులు శూన్యం

కార్యరూపం దాల్చని ఇనుప గడ్డర్ల ఏర్పాటు ప్రతిపాదన

తరచూ ప్రమాదాలు

భీతిల్లుతున్న వాహనచోదకులు

పట్టించుకోని అధికారులు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

పాడేరు నుంచి మైదాన ప్రాంతానికి రాకపోకలు సాగించే స్థానిక ఘాట్‌ మార్గంలో రక్షణ గోడలు శిథిలమై ఏళ్లు గడుస్తున్నాయి. వాస్తవానికి ఎక్కడైనా ఘాట్‌ రోడ్లకు రక్షణ గోడలే ప్రధాన ఆధారం. కానీ వీటిపై అధికారులు దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది.

పాడేరు ప్రస్తుతం జిల్లా కేంద్రం కావడంతో ఘాట్‌ మార్గంలో రాకపోకలు పెరిగాయి. ఈ క్రమంలో స్థానిక ఘాట్‌ రక్షణపై ప్రభుత్వం దృష్టి సారించాలనే డిమాండ్‌ ఉత్పన్నమవుతున్నది. పాడేరు నుంచి చోడవరం, అనకాపల్లి, విశాఖపట్నం ప్రాంతాలకు రాకపోకలు సాగించాలన్నా, ఆయా ప్రాంతాల నుంచి పాడేరుతో పాటు ఒడిశా రాష్ట్రానికి వెళ్లాలన్నా ఘాట్‌ ప్రయాణం తప్పని సరి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ ఘాట్‌ మార్గంలో రక్షణపై పాలకులు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. ప్రధానంగా ఘాట్‌లోని వ్యూపాయింట్‌కు సమీపంలో, రాజాపురం వద్ద, ఏసుప్రభు బొమ్మ మలుపులకు అటూ, ఇటూ, వంట్లమామిడి నుంచి గరికిబంద వరకు ఉన్న మలుపుల్లో రక్షణ గోడలు శిథిలమైపోయాయి. పొరపాటున వాహనాలు అదుపు తప్పితే... లోయలోకి దూసుకుపోవాల్సిందే. గతంలో నిర్మించిన రక్షణ గోడలు శిథిలం కాగా, చాలా ఏళ్లుగా కొత్త రక్షణ గోడలు నిర్మించకపోవడంతో ఘాట్‌ ప్రయాణం భయం... భయంగానే ఉందని డ్రైవర్లు, ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

ఇనుప గడ్డర్ల ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితం

స్థానిక ఘాట్‌ మార్గంలో ప్రమాదకరంగా ఉన్న మలుపుల వద్ద ఇనుప గడ్డర్లను ఏర్పాటు చేయాలని చాలా కాలంగా రోడ్లు, భవనాల శాఖాధికారులు ప్రతిపాదిస్తున్నప్పటికీ కార్యరూపం దాల్చడం లేదు. ఘాట్‌ మార్గ మధ్యంలో ఏసుప్రభు బొమ్మ మలుపుల వద్ద రక్షణలో భాగంగా ఐదేళ్ల క్రితం రోడ్లు, భవనాల శాఖాధికారులు ఇనుప గడ్డర్లను ఏర్పాటు చేశారు. దీంతో అవి ఆయా మలుపుల వద్ద ఎంతో రక్షణగా ఉండడంతో పాటు ఆ మార్గంలో రాకపోకలు సాగించే డ్రైవర్లకు సైతం మనో ధైర్యాన్ని ఇచ్చేలా ఉన్నాయి. దీంతో ఘాట్‌ మార్గంలోని ప్రమాదకరంగా ఉన్న మలుపుల వద్ద ఇటువంటి ఇనుప గడ్డర్లను ఏర్పాటు చేస్తే రక్షణగా ఉంటుందని రోడ్లు, భవనాల శాఖాధికారులు భావించారు. ఘాట్‌లో ఇనుప గడ్డర్లను ఏర్పాటు చేసేందుకు గానూ అధికారులు గతంలో రూ.7 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. అయితే ప్రభుత్వం వద్ద సైతం నిధుల లేమి కారణంగా దానిపై కనీసం దృష్టి సారించిన దాఖలాలు లేవు. అలాగే కనీసం ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న రక్షణ గోడలకైనా మరమ్మతులు చేపట్టినా కాస్త మెరుగ్గా ఉంటుందని డ్రైవర్లు, ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.

ఏవోబీ రవాణాకు ఘాట్‌ రోడ్డు కీలకం

స్థానిక ఘాట్‌ రోడ్డు కేవలం మైదాన ప్రాంతం నుంచి ఏజెన్సీకి మాత్రమే రాకపోకలు సాగించేందుకే కాకుండా సరిహద్దున ఉన్న ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన రవాణాకు కీలక మే. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నుంచి ఒడిశా రాష్ట్రం జైపూర్‌, కొరాపుట్‌ ప్రాంతాలకు వెళ్లే సరకు రవాణా వాహనాలు పాడేరు ఘాట్‌ మీదుగానే రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో స్థానిక ఘాట్‌ మార్గం వల్ల ఒడిశా రాష్ట్రానికి చాలా వరకు మేలు జరుగుతుంది. అలాగే ఇటీవల కాలంలో ఏజెన్సీ ప్రాంతానికి పర్యాటకులు పెరగడంతో ఘాట్‌లో రాకపోకలు సాగించే వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ తరుణంలో ఘాట్‌ రోడ్డు రక్షణకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలు

- పాడేరు, అరకులోయ, చింతపల్లి ఘాట్‌లలో ప్రతి మలుపు వద్ద రక్షణ గోడలను పటిష్ఠం చేయాలి.

- ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించేలా ప్రత్యేక బోర్డులు పెట్టాలి.

- వాహనాల వేగాన్ని నిరోధించేందుకు అవసరమైన ప్రదేశాల్లో స్పీడ్‌ బ్రేకర్లు వేయాలి.

- అన్ని ప్రాంతాల్లో పోలీసులు డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టాలి.

- ఘాట్‌ మార్గంలో ప్రతి మలుపు వద్ద వాహనాలు లోయల్లోకి పోకుండా పటిష్ఠమైన రక్షణ గోడలు నిర్మించాలి.

- వాహనాల్లో పరిమితి మించకుండా ప్రయాణికులను తీసుకువెళ్లేలా చర్యలు చేపట్టాలి.

Updated Date - 2023-02-02T00:37:34+05:30 IST