తైవాన్ జామతో లాభాల పంట
ABN , First Publish Date - 2023-03-12T01:24:29+05:30 IST
పట్టుదల, కృషి ఉంటే అనుకున్నది సాధించవచ్చునని, విభిన్నంగా ఆలోచిస్తే అనేక ఆదాయ మార్గాలు ఉంటాయని నిరూపిస్తున్నారు అచ్యుతాపురం మండలం దుప్పితూరు గ్రామానికి చెందిన రైతు దేశంశెట్టి ఎల్లయ్యనాయుడు. అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని ఆధునిక పద్ధతుల్లో తైవాన్ రకం జామ తోటను సేంద్రీయ విధానంలో సాగు చేస్తున్నారు. శాస్త్రవేత్తల సలహాలతో ఎప్పటికప్పుడు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. తైవాన్ రకం జామ కాయలకు మార్కెట్‌లో గిరాకీ వుండడంతో అనుకున్నదానికన్నా ఎక్కువ ఆదాయం వస్తున్నదని ఎల్లయ్య నాయుడు చెబుతున్నారు.
సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తున్న ఎల్లయ్యనాయుడు
హరిపురంలో 1.36 ఎకరాల్లో 9 నెలల క్రితం మొక్కలు నాటిన రైతు
నాలుగో నెల నుంచే పూత.. ఆరు నెలలకు కాపు
తొలివిడత రెండు టన్నుల దిగుబడి
టన్ను రూ.50 వేలకు అమ్మకం
ఏటా ఆరేడుసార్లు దిగుబడి.. పదేళ్ల వరకు కాపు
ఆశాజనంగా ఆదాయం
రాంబిల్లి, మార్చి 11: పట్టుదల, కృషి ఉంటే అనుకున్నది సాధించవచ్చునని, విభిన్నంగా ఆలోచిస్తే అనేక ఆదాయ మార్గాలు ఉంటాయని నిరూపిస్తున్నారు అచ్యుతాపురం మండలం దుప్పితూరు గ్రామానికి చెందిన రైతు దేశంశెట్టి ఎల్లయ్యనాయుడు. అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని ఆధునిక పద్ధతుల్లో తైవాన్ రకం జామ తోటను సేంద్రీయ విధానంలో సాగు చేస్తున్నారు. శాస్త్రవేత్తల సలహాలతో ఎప్పటికప్పుడు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. తైవాన్ రకం జామ కాయలకు మార్కెట్‌లో గిరాకీ వుండడంతో అనుకున్నదానికన్నా ఎక్కువ ఆదాయం వస్తున్నదని ఎల్లయ్య నాయుడు చెబుతున్నారు.
రాంబిల్లి మండలం హరిపురం పంచాయతీ పరిధిలో దేశంశెట్టి ఎల్లయ్యనాయుడుకు వ్యవసాయ భూములు వున్నాయి. చిరుధాన్యాలు, అపరాల పంటలు పండించే ఇతను తైవాన్ జామపంట సాగు గురించి శాస్త్రవేత్తల నుంచి వివరాలు తెలుసుకున్నారు. సుమారు ఒకటిన్నర ఎకరా భూమిలో జామ మొక్కలు వేయాలని ఏడాది క్రితం నిర్ణయించుకుని పొలాన్ని సిద్ధం చేశారు. రాయపూర్ ప్రాంతం నుంచి ఒక్కో మొక్క రూ.60 చొప్పున (రవాణా ఖర్చులతో కలిపి) 1,300 జామ మొక్కలను కొనుగోలు చేసి రప్పించారు. ఇందుకు దాదాపు రూ.80 వేలు ఖర్చయ్యింది. అనంతరం పొలంలో మొక్కలకు, వరుసలకు మధ్య మీటరు దూరం వుండేలా నాటారు. ఎటువంటి రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడకుండా పూర్తిగా సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తున్నారు. పొలంలో కలుపు లేకుండా ఎప్పటికప్పుడు యంత్రంతో తొలగిస్తున్నారు. జామ మొక్కలు నాటిన నాలుగు నెలలకు పూత ఆరంభమైనంది. ఒక్కో గుత్తికి నాలుగు నుంచి ఆరు కాయలకు మించకుండా అధికంగా వచ్చిన పూలను తొలగిస్తున్నారు. (ఒకేచోట ఎక్కువ కాయలు వుంటే మొక్క ఒరిగిపోయి కొమ్మలు విరిగిపోయే ప్రమాదం వుంది). తోటలో నిరంతరం పనులు చేయడానికి ప్రత్యేకంగా కూలీలను నియమించుకున్నారు. మొక్కలు నాటిన ఆరు నెలలకు కాయలు కోతకు వచ్చాయి. జామ పండు పరిమాణం పెద్దదిగా వుండడంతో కిలోకు మూడు నుంచి నాలుగు కాయలు మాత్రమే తూగుతున్నాయి. తొలి విడత ఒక్కో మొక్క నుంచి 4-6 కాయలు కోయగా సుమారు రెండు టన్నుల దిగుబడి వచ్చింది. తైవాన్ రకం కావడం, సేంద్రీయ విధానంలో సాగు చేయడంతో వ్యాపారులే పొలం వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఏడాదిలో ఆరు నుంచి ఎనిమిది పర్యాయాలు దిగుబడి వస్తుంది. ప్రతి పర్యాయం దిగుబడి పెరుగుతుంది. కనీసం పదేళ్లపాటు తోట కాపు కాస్తుంది. కాయ దిగుబడి వచ్చిన సమయంలో మార్కెట్‌లో వున్న ధరల ప్రకారం ఆదాయం వస్తుంది. లాభమే తప్ప నష్టం వచ్చే పరిస్థితి లేదని రైతు ఎల్లయ్యనాయుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఏటా ఆరేడు కాపులు కాస్తుంది
దేశంశెట్టి ఎల్లయ్యనాయుడు (9ఆర్‌బిఎల్ 4)
తైవాన్ జామను సాగు చేస్తే అధిక ఆదాయం వస్తుందని బీసీటీ-కేవీకే శాస్త్రవేత్త నాగేంద్రప్రసాద్ చెప్పారు. ఆయన సలహాలు, సూచనలతో సేంద్రీయ విధానంలో జామ సాగు చేపట్టాను. నిరంతరం తోటను స్వయంగా పరిశీలిస్తాను. ఎప్పటికప్పుడు సస్యరక్షణ చర్యలు చేపడుతున్నాను. ఇటీవల తొలి విడత సుమారు రెండు టన్నుల దిగుబడి వచ్చింది. టన్ను రూ.50 వేల చొప్పున లక్ష రూపాయల ఆదాయం వచ్చింది. ఏడాదిలో ఆరేడు కాపులు కాస్తుంది. అన్ని ఖర్చులు పోను రూ.4 లక్షల వరకు మిగులుతాయని భావిస్తున్నాను.