అంగట్లో పారిశుధ్య కార్మికుల పోస్టులు

ABN , First Publish Date - 2023-05-26T01:31:00+05:30 IST

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)లో పారిశుధ్య కార్మికుల పోస్టులను కొంతమంది కార్పొరేటర్లు అమ్ముకుంటున్నారు.

అంగట్లో పారిశుధ్య కార్మికుల పోస్టులు

ఒక్కో పోస్టుకి రూ.1.5 లక్షల నుంచి రూ.రెండు లక్షలు వసూలు

అధికార పార్టీ కార్పొరేటర్లకు నాలుగు కేటాయింపు

కొంతమంది విపక్ష కార్పొరేటర్లకు మూడు...

అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలంటూ వల

జీవీఎంసీ ఉన్నతాధికారులు అప్రమత్తం

భర్తీ నిబంధనల ప్రకారం జరుగుతుందని ప్రకటన

ఎవరికీ డబ్బులిచ్చి మోసపోవద్దని సూచన

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)లో పారిశుధ్య కార్మికుల పోస్టులను కొంతమంది కార్పొరేటర్లు అమ్ముకుంటున్నారు. తొలుత తాత్కాలిక ప్రాతిపదికపై ఉద్యోగంలో చేరితే తర్వాత అవుట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ పరిధిలోకి తీసుకువస్తామంటూ హామీ ఇస్తున్నారు. ఒక్కో ఉద్యోగానికి రూ.1.5 లక్షల నుంచి రూ.రెండు లక్షలు వరకూ వసూలు చేస్తున్నారు. విషయం బయటకు పొక్కడంతో అధికారులు చర్యలు ప్రారంభించారు. దీంతో డబ్బులు తీసుకున్న కార్పొరేటర్లు హైరానా పడుతున్నారు.

జీవీఎంసీ పరిధిలోని ప్రజారోగ్య విభాగంలో 5,400 మంది పారిశుధ్య కార్మికులు ఉంటారు. వీరందరికీ ఆప్కోస్‌ ద్వారా జీతాలు అందుతాయి. అయితే పలు కారణాలతో ప్రస్తుతం 482 పోస్టులు ఖాళీ అయ్యాయి. ఇవి కాకుండా క్లాప్‌ వాహనాల వెంట ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ చేసేందుకు ఒక్కో వాహనానికి ఇద్దరు కార్మికులను (మొత్తం 600 వాహనాలకు 1,200 మంది) కేటాయించాల్సి వచ్చింది. నాలుగో వంతు (1,682) పోస్టులు ఖాళీ కావడంతో పారిశుధ్య నిర్వహణపై ప్రభావం పడింది. దీనిని అధిగమించేందుకు గత కమిషనర్‌ పి.రాజాబాబు తొలుత 482 ఖాళీలను ఆప్కోస్‌ ద్వారా భర్తీ చేసేందుకు అవకాశం ఇవ్వాలంటూ ఆప్కోస్‌ చైర్మన్‌, జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జునకు లేఖ రాశారు. దీనికి అనుమతి లభించడంతో గత ఏడాది డిసెంబరులో 482 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేశారు. గతంలో ఆప్కోస్‌ కార్మికులుగా పనిచేసి మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు తొలిప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించడంతో 77 మంది అర్హులుగా తేలారు. మిగిలిన పోస్టులను కొంతమంది అధికార పార్టీ కార్పొరేటర్లు సొమ్ము చేసుకోవాలని భావించి, తమకు కొన్ని పోస్టులను కేటాయిస్తే...వార్డుల్లో తమ వెంట తిరిగే వారికి ఉపాధి కల్పించినట్టవుతుందంటూ కమిషనర్‌పై ఒత్తిడి తెచ్చారు. అధికార పార్టీ కార్పొరేటర్లతోపాటు పాలక వర్గంలో చక్రం తిప్పుతున్న నలుగురు నేతలు కూడా భారీగా జాబితాను తయారుచేసుకుని కమిషనర్‌కు అందజేశారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఒక్కో పోస్టును రూ.2 లక్షలకు అమ్ముకుంటున్నారంటూ యూనియన్‌ నేతలు కూడా ఆరోపణలు గుప్పించారు. దీంతో అప్పటి కమిషనర్‌ రాజాబాబు అప్కోస్‌ పోస్టుల భర్తీని తాత్కాలికంగా పక్కనపెట్టేశారు. తాజాగా కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సాయికాంత్‌వర్మ నగరంలో పారిశుధ్య నిర్వహణ మెరుగుపడాలంటే కార్మికుల కొరతను అధిగమించాల్సిందేనని గుర్తించారు. ఈ మేరకు గతంలో నిలిచిపోయిన ఆప్కోస్‌ కార్మికుల భర్తీ ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికార పార్టీ కార్పొరేటర్లలో మళ్లీ ఉత్సాహం వచ్చింది. గతంలో మాదిరిగా పోస్టుల భర్తీ అంశం వివాదాస్పదం కాకుండా ఉండేందుకు విపక్ష కార్పొరేటర్లలో క్రియాశీలకంగా ఉండేవారిని కలుపుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు వారితో సంప్రతింపులు జరిపారు. అందరూ ఏకాభిప్రాయానికి రావడంతో అధికార పార్టీ కార్పొరేటర్లకు నాలుగు, విపక్షంలో కొంతమంది కార్పొరేటర్లకు మూడేసి పోస్టులు చొప్పున పంచుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. వార్డుల్లో తమ అనుచరుల ద్వారా పారిశుధ్య కార్మికుల పోస్టులపై ఆసక్తి ఉన్నవారిని గుర్తించారు. ఆప్కోస్‌ ద్వారా ఉద్యోగం వస్తుందని, నెలకు జీతం, అలవెన్సు కింద రూ.24 వేలు వస్తాయని, జీవితాంతం ఉద్యోగానికి భద్రత ఉండడంతోపాటు అదృష్టం బాగుంటే పర్మనెంట్‌ అయిపోతుందంటూ ఆశలు రేకెత్తించారు. దీనికోసం అధికారులకు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షలు వరకు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగం వస్తుందనే సరికే రూ.రెండు లక్షలు చెల్లించేందుకు ఆశావహులు వెనుకాడడం లేదు. ఇప్పటికే కార్పొరేటర్లు తమ కోటా కింద నియమించాల్సిన వారి జాబితాను తమ లెటర్‌హెడ్‌లపై ప్రజారోగ్య అధికారులకు అందజేసినట్టు సమాచారం. కార్మికుల పోస్టులు అమ్మకానికి పెట్టినట్టు పెద్దఎత్తున ప్రచారం జరుగుతుండడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. మీడియా సమావేశం పెట్టి ఎవరూ డబ్బులు చెల్లించొద్దని, భర్తీ అంతా నిబంధనలకు అనుగుణంగానే జరుగుతుందని చెప్పే ప్రయత్నాల్లో పడ్డారు.

అధికారుల తీరుతో కార్పొరేటర్ల హైరానా

కార్మికుల పోస్టుల భర్తీలో అక్రమాలకు కార్పొరేటర్లు తెరతీశారనే సమాచారంతో అధికారులు దీనిపై స్పష్టత ఇచ్చే పనిలో పడ్డారు. దీనిలో భాగంగా మీడియా సమావేశాలు పెట్టి ఆప్కోస్‌లో అర్హులకు మాత్రమే ఉద్యోగాలిస్తామని, తొలుత చనిపోయిన కార్మికుల కుటుంబసభ్యులకు అవకాశం ఇస్తామని, మిగిలిన పోస్టులను ఇప్పట్లో భర్తీ చేయబోమని ప్రకటించారు. దీంతో ఇప్పటికే ఆశావహుల నుంచి డబ్బులు వసూలుచేసిన కార్పొరేటర్లలో ఆందోళన మొదలైంది. డెత్‌ పోస్టులు భర్తీ చేయగా మిగిలిన పోస్టుల్లో తాము సూచించిన వారిని కనీసం రోజువారీ కూలీ ప్రాతిపదికనైనా తీసుకోవాలంటూ అధికారులను అభ్యర్థించే పనిలో పడ్డారు. మరోపక్క తమకు డబ్బులు ఇచ్చిన వారిని పిలిచి తొలుత రోజువారీ కూలీ ప్రాతిపదికన పనిలో చేర్చుకుంటారని, కొద్దిరోజులైన తర్వాత తామే ఆప్కోస్‌లోకి తీసుకునేలా చూస్తామంటూ భరోసా కల్పిస్తున్నారు. ఆశావహుల్లో నమ్మకం కల్పించేందుకు సంబంధిత కార్పొరేటర్లు తమకు డబ్బులు ఇచ్చినవారిని పాలకవర్గంలోని కీలకనేత వద్దకు తీసుకువెళ్లి మరీ ఈ మేరకు హామీ ఇప్పిస్తున్నట్టు తెలిసింది.

Updated Date - 2023-05-26T01:31:00+05:30 IST