కాలుష్యం బీభత్సం
ABN , First Publish Date - 2023-09-26T01:33:44+05:30 IST
విశాఖపట్నంలో పరిశ్రమల కాలుష్యంపై కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది.

కలుషిత నగరంగా విశాఖపట్నం
‘కాగ్’ ఆందోళన
నియంత్రణ చర్యలు చేపట్టడంలో కాలుష్య నియంత్రణ మండలి విఫలమైందని ఆక్షేపణ
కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి పంపినా అమలు శూన్యం
ప్రజారోగ్యం, పర్యావరణానికి తీవ్ర విఘాతం
పరిశ్రమల్లో నామమాత్రంగా తనిఖీలు
లైసెన్స్‌లు లేకుండా 70 పరిశ్రమలు నిర్వహణ
పోర్టు, స్టీలుప్లాంటు, జీవీఎంసీ, కేజీహెచ్, ఏయూలపైనా తీవ్ర వ్యాఖ్యలు
విశాఖపట్నం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నంలో పరిశ్రమల కాలుష్యంపై కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. తాజాగా అసెంబ్లీకి సమర్పించిన నివేదికలో అనేక అంశాలను ప్రస్తావించింది. పరిశ్రమలు పేర్కొన్న విధంగా కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టడం లేదని, తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని, కాలుష్య నియంత్రణ మండలి పూర్తిగా విఫలమైందని తప్పుబట్టింది. ప్రమాదకర, ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తితో అత్యంత కలుషిత నగరంగా విశాఖ నమోదుకావడంపై ‘కాగ్’ ఆందోళన వ్యక్తంచేసింది. నీటి, వాయు కాలుష్యం నివారణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించినా అమలులో సమర్థత కనిపించలేదని ఎత్తిచూపింది.
2009లో విశాఖ తీవ్ర కాలుష్య నగరంగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకటించడంతో నగరంలో పరిశ్రమల ఏర్పాటుపై 2010లో నిషేధం విధించిన విషయాన్ని గుర్తుచేస్తూ తరువాత తీసుకున్న చర్యల మేరకు 2103లో నిషేధం ఎత్తివేసిందని గుర్తుచేసింది. అయినా వాయు, నీటి స్వచ్ఛతలో నాణ్యతా ప్రమాణాలు సాధించలేదని 2016లో సీపీసీబీ ప్రకటించిన నేపథ్యంలో 2017లో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు సమగ్ర స్వచ్ఛ, వాయు కాలుష్య నివారణకు ప్రణాళిక రూపొందించిన విషయాన్ని తాజా నివేదికలో పేర్కొంది. అలాగే 2019లో వాయు నాణ్యత పర్యవేక్షణకు కార్యాచరణ అమలు చేయాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశించినా పట్టించుకోలేదని తప్పుబట్టింది. ఇందుకు పీసీబీ కారణాలు చెప్పలేదు సరికదా...కనీసం వివరణ ఇవ్వలేదని పేర్కొంది. పారిశ్రామిక, వాయు కాలుష్యం, బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు కాల్చడం, మైనింగ్ కార్యకలాపాల వంటి కాలుష్య కారకాల నియంత్రణను పీసీబీ పట్టించుకోలేదని తప్పుబట్టింది. ఎన్జీటీ ఆదేశాల మేరకు ఏపీపీసీబీ 2020 జనవరిలో నిర్వహణ ప్రణాళిక తయారుచేసి ఇచ్చినా సమీక్షలు చేపట్టలేదని తప్పుబట్టింది. దీని పర్యావసానంగా విశాఖలో పరిశ్రమల కాలుష్యం కొనసాగుతూ ప్రజారోగ్యం, పర్యావరణానికి హాని కలిగిస్తోందని కాగ్ ఆందోళన వ్యక్తంచేసింది.
విశాఖ నగరంలో కాలుష్య తీవ్రతను తగ్గించడానికి కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల మేరకు కేటాయింపులు, ఖర్చు చేయలేదని ఆక్షేపించింది. 2017-18లో 16 పర్యావరణ పథకాలకు రూ.4.3 కోట్లు కేటాయించగా, కేవలం రూ.0.16 కోట్లు, 2018-19లో 12 పథకాలకు రూ.0.65 కోట్లకుగాను రూ.0.30 కోట్లు ఖర్చు చేశారని...కొన్ని పథకాలకు నిధులు కేటాయించలేదని తప్పుబట్టింది. 2019-20లో బడ్జెట్‌లో అసలు నిధులు ప్రస్తావన చేయలేదని ఎత్తిచూపింది. ఉమ్మడి జిల్లాలో 882 పరిశ్రమలు ఉండగా వీటిలో రెడ్ కేటగిరీలో 386 పరిశ్రమలు, ఆరెంజ్ కేటగిరీలో 319, గ్రీన్ కేటగిరీలో 171 పరిశ్రమలు ఉన్నాయని, 2019-20లో 1,043 పర్యాయాలు తనిఖీ చేయాల్సి ఉండగా...219 పర్యాయాలు తనిఖీ చేశారని కాగ్ పేర్కొంది. నిబంధనల మేరకు రెడ్ కేటగిరీ పరిశ్రమలను ఏడాదికి నాలుగుసార్లు తనిఖీ చేయాల్సి ఉన్నా పీసీబీ కార్యాలయంలో సిబ్బంది తక్కువగా ఉన్నందున తనిఖీలు చేయడం లేదని అధికారులు చెప్పినట్టు పేర్కొంది. పరిశ్రమలు తనిఖీలు చేయనందున జీవరాశికి, పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని కాగ్ హెచ్చరించింది. అంతేగాకుండా పరిశ్రమల నిర్వహణకు లైసెన్స్‌ల పునరుద్ధరణకు 120 రోజుల ముందు దరఖాస్తు చేయాల్సి ఉండగా, 70 పరిశ్రమలు లైసెన్స్‌లు లేకుండా నడుపుకుంటున్నా జరిమానా విధించడంలో అధికారులు తాత్సారం చేశారని తప్పుబట్టింది. కేవలం రూ.22.56 లక్షలు జరిమానా విధించిందని తాజా రిపోర్టులో పేర్కొంది.
పోర్టుకు అక్షింతలు
విశాఖపట్నం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం పోర్టు వంటి సంస్థలు జరిమానా కూడా చెల్లించాయని, ఇకపై ఆ పద్ధతి విడిచి సక్రమంగా పనిచేసేలా చూడాలని ‘కాగ్’ సూచించింది. విశాఖ పోర్టులో ఇనుము, ఎరువులు, ఇతర ఖనిజాల వల్ల కాలుష్యం అధికంగా ఉందని, నియంత్రణ చర్యలు చేపట్టాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) 2017లోనే ఆదేశించింది. అయితే సూచించిన ప్రమాణాలు పాటించకపోవడంతో 2020 పీసీబీ రూ.1,97 కోట్ల జరిమానా విధించింది. పోర్టు ఆ మొత్తం చెల్లించింది. 2021 మార్చి నాటికి కూడా పోర్టు సూచించిన చర్యలు చేపట్టలేదని కాగ్ ఆరోపించింది.
ఉక్కు కర్మాగారానిదీ అదే పరిస్థితి
విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు నుంచి కాలుష్యం వెలువడుతోందని కాగ్ ఆరోపించింది. వ్యర్థ జలాలను నేరుగా సముద్రంలోకి వదలకుండా చెరువులు నిర్మించాలని, ప్లాంటు 2020 నాటికి 218 చెరువులు నిర్మించలేదని తెలిపింది. రెండు యాష్‌పాండ్లు ఉండగా అందులో ఒక దాని నుంచి అప్పికొండ చెరువులోకి బూడిద వెళుతోందని స్పష్టంచేసింది. బ్లాస్ట్ ఫర్నేస్-2 నుంచి విషవాయువులు వస్తున్నాయని తెలిపింది. ఇక్కడ వాయు కాలుష్యాన్ని కొలిచే పరికరాలు పనిచేయడం లేదని, వాటిని పీసీబీకి అనుసంధానం చేయలేదని ఆరోపించింది.
- హిందూజా విద్యుత్ కర్మాగారం కూడా కాలుష్యం పెంచుతోందని తెలిపింది. అక్కడ వెలువడే బూడిద 50 శాతం తరలిస్తున్నారని, మిగిలిన 50 శాతం చెరువుల్లో నింపుతున్నారని పేర్కొంది.
కాపులుప్పాడ డంపింగ్ యార్డుతో
భూగర్భ జలాలు కలుషితం
జీవీఎంసీ కాపులుప్పాడలో 100 ఎకరాల్లో నిర్వహిస్తున్న డంపింగ్ యార్డు వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని కాగ్ స్పష్టంచేసింది. అక్కడ బహిరంగంగా చెత్తను కాల్చడం వల్ల విషవాయువులు వ్యాప్తి చెందుతున్నాయని తెలిపింది. ఘన వ్యర్థాలను తరలించే వాహనాలకు ఆర్‌ఐఎఫ్‌డీ ట్యాగ్‌లు వేశారని, అవి పనిచేయడం లేదని ఆరోపించింది.
- జీవీఎంసీ ఆస్తి పన్ను ఎగవేసిన వారిని విచారణ చేయడం లేదు. దీనివల్ల 2012-15లో రూ.31.34 కోట్ల నష్టం వాటిల్లింది. ప్రతి ఇంటికీ కొళాయి కనెక్షన్ ఇవ్వాలని ఆదేశించగా జీవీఎంసీ 4,83,000 ఇళ్లలో 2021 మార్చి నాటికి ఇంకా 48 శాతం పూర్తి చేయలేదని స్పష్టంచేసింది.
- 2016 -17 మధ్య కాలంలో జీవీఎంసీ 6,886 ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వగా, వారిలో 1,498 మంది మాత్రమే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు తీసుకున్నారని, మిగిలిన వాటిని జీవీఎంసీ పట్టించుకోలేదని తెలిపింది.
కేజీహెచ్‌లో జీవ వ్యర్థాల నిర్వహణ ఘోరం
కేజీహెచ్‌లో జీవ వ్యర్థాల నిర్వహణ అత్యంత ఘోరంగా ఉన్నట్టు కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తప్పుబట్టింది. సాధారణ చెత్తలో జీవ వ్యర్థాలు కలుస్తున్నట్టు తెలిసింది. వాడేసిన సిరంజిలు, సూదులు, కలుషితమైన కాటన్ స్వాబ్‌లు, ఇంటర్ వీనల్ సెట్‌లు వంటివి సాధారణ చెత్తలో కలుస్తున్నట్టు పేర్కొంది. జీవ వైద్య సంబంధిత వ్యర్థాలను వార్డుల నుంచి ఓపెన్ ట్రాలీ రిక్షా ద్వారా సాధారణ సేకరణ కేంద్రానికి రవాణా చేస్తున్నారని, ఇలాంటి వ్యక్తిగత సంరక్షణ పరికరాలు లేకుండా వ్యర్థాల నిర్వహణ జరుగుతోందని ఆక్షేపించింది. నిబంధనలకు అనుగుణంగా జీవ వ్యర్థాల నిర్వహణ పద్ధతులను పాటించడం లేదని, తద్వారా ప్రజారోగ్యానికి, పర్యావరణానికి ముప్పు వాటిల్లుతున్నట్టు వెల్లడించింది.
ఏయూలో నిధులు దుబారా
నీటి కోసం జీవీఎంసీకి రూ.3 కోట్ల మేర అనవసర చెల్లింపు
నీటి వినియోగానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం నిధులు వృథా చేస్తున్నట్టు కాగ్ తన నివేదికలో పేర్కొంది. ప్రత్యేక పైప్‌లైన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల జీవీఎంసీకి అనవసరంగా మూడు కోట్ల రూపాయలను చెల్లించినట్టు కాగ్ వెల్లడించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం రోజువారీ అవసరాలకు 2.5 లక్షల ఇంపీరియల్ గ్యాలన్ల (ఇంపీరియల్ గ్యాలన్ అంటే 4.546 లీటర్లు) నీటి సరఫరా కోసం జీవీఎంసీతో ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం ఒక నెలలో వినియోగించే నీటి పరిమాణం 60 శాతం కంటే తక్కువగా ఉంటే...60 శాతం కనీస చార్జీ గానీ, నీటి వాస్తవ వినియోగంలో ఏది ఎక్కువ అయితే దాన్ని విశ్వవిద్యాలయం చెల్లించాల్సి ఉంటుంది. నీటిని తీసుకునేందుకు విశ్వవిద్యాలయం సొంత ఏర్పాటు చేసుకోవాలని జీవీఎంసీ సూచించింది. అయితే, గడిచిన 11 ఏళ్లుగా జీవీఎంసీ నుంచి తక్కువ నీటిని తీసుకుంటూ నెలవారీ ఎక్కువ చెల్లించాల్సి వస్తున్నప్పటికీ విశ్వవిద్యాలయం అధికారులు నీటి పరిమాణాన్ని పెంచుకునేందుకు, ప్రత్యేక పైప్‌లైన్ వేయడానికి ప్రయత్నాలు చేయలేదని కాగ్ పేర్కొంది. ఈ కారణంగా 2015 నుంచి 2021 జూలై మధ్య కాలంలో జీవీఎంసీకి ఏయూ రూ.మూడు కోట్లు అనవసరంగా చెల్లించినట్టు కాగ్ తెలిపింది.