ఏసీబీ వలలో పీకే గూడెం వీఆర్వో

ABN , First Publish Date - 2023-09-26T00:42:23+05:30 IST

మండలంలోని పీకే గూడెం వీఆర్వో సత్యనారాయణ మ్యుటేషన్‌కు, పట్టాదారు పాస్‌పుస్తకం జారీకి ఓ రైతు నుంచి రూ.2 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌ హ్యాండెండ్‌గా పట్టుకున్నారు.

ఏసీబీ వలలో పీకే గూడెం వీఆర్వో
ఏసీబీ అధికారులకు చిక్కిన పీకే గూడెం వీఆర్‌ఓ సత్యనారాయణ

మ్యుటేషన్‌, పాస్‌పుస్తకంలో పేరు మార్పునకు రూ.4 వేలు డిమాండ్‌

రూ.2 వేలు ఫోన్‌ పే చేసిన రైతు

అయినా పనిచేయకపోవడంతో ఏసీబీకి ఫిర్యాదు

రూ.2 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు

నాతవరం, సెప్టెంబరు 25: మండలంలోని పీకే గూడెం వీఆర్వో సత్యనారాయణ మ్యుటేషన్‌కు, పట్టాదారు పాస్‌పుస్తకం జారీకి ఓ రైతు నుంచి రూ.2 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌ హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి సోమవారం సాయంత్రం ఇక్కడ ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఏసీబీ డీఎస్పీ రమ్య తెలిపిన వివరాలిలా వున్నాయి.

నాతవరం మండలం పీకే గూడెం గ్రామానికి చెందిన రెడ్డి రాజుబాబు ఇటీవల మృతిచెందాడు. ఇతని పేరుమీద వున్న భూమిని భార్య జగదాంబ పేరున మార్చాలని వీరి కుమారుడు రెడ్డి సన్యాసినాయుడు రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం వీఆర్వో సీహెచ్‌ సత్యనారాయణను కలిశారు. మ్యుటేషన్‌ చేయడానికి, పట్టాదారు పాసుపుస్తకంలో పేరు మార్చడానికి రూ.4 వేలు లంచం ఇవ్వాలని వీఆర్వో డిమాండ్‌ చేశాడు. అంత ఇచ్చుకోలేనంటూ సన్యాసినాయుడు రూ.2 వేలను ఫోన్‌పే ద్వారా వీఆర్వోకు చెల్లించాడు. అయినప్పటికీ మ్యుటేషన్‌చేయకపోవడంతో సన్యాసినాయుడు 14400 నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు. ఏసీబీ అదనపు ఎస్పీ శ్రావణి ఆదేశాల మేరకు డీఎస్పీ రమ్య సీఐలు కిశోర్‌, ప్రేమ్‌కుమార్‌, శ్రీనివాసరావు రంగంలోకి దిగారు. వీఆర్వోను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి పథకం రూపొందించి ఈ విషయాన్ని సన్యాసినాయుడుకు ఫోన్‌ చెప్పారు. సోమవారం మధ్యాహ్నం తరువాత ఏసీబీ అధికారులు తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలో మాటువేశారు. కొద్దిసేపటి తరువాత సన్యాసినాయుడుకు రూ.2 వేల నగదు ఇచ్చి తహసీల్దార్‌ కార్యాలయంలోకి పంపారు. అతను లోపలికి వెళ్లి నగదును వీఆర్వో సత్యనారాయణకు ఇచ్చారు. క్షణాల్లోనే ఏసీబీ అధికారులు అక్కడకు చేరుకుని నగదుతో సహా వీఆర్వోను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం డీఎస్పీ రమ్య మాట్లాడుతూ, వీఆర్‌వో సత్యనారాయణను అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని, రైతు సన్యాసినాయుడు గతంలో వీఆర్వోకు ఫోన్‌ పే ద్వారా రూ.2 వేలు చెల్లించారని, దీనిపైన కూడా విచారణ జరుపుతామని ఆమె వెల్లడించారు.

Updated Date - 2023-09-26T00:42:23+05:30 IST