హౌసింగ్ పీడీ పోస్టుకు పైరవీలు
ABN , First Publish Date - 2023-06-26T01:16:44+05:30 IST
జిల్లా గృహనిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ పోస్టు కోసం పలువురు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
అధికార పార్టీ నేతల ద్వారా ఆశావహుల ప్రయత్నాలు
కోర్టు ఆదేశాలతో కొనసాగుతున్న పీడీ శ్రీనివాసరావు
విద్యా మౌలిక వసతుల కల్పన సంస్థ ఉద్యోగులకు ఇచ్చిన స్టేను ఇటీవల కొట్టివేసిన హైకోర్టు డివిజన్ బెంచ్
ఈ ఉత్తర్వులు హౌసింగ్‌కూ వర్తిస్తాయని ఉద్యోగుల వాదన
విశాఖపట్నం, జూన్ 25 (ఆంధ్రజ్యోతి):
జిల్లా గృహనిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ పోస్టు కోసం పలువురు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారపార్టీ నేతల ద్వారా ఉన్నతస్థాయిలో ఒత్తిడి తీసుకువస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచిన ఉత్తర్వులు తమకూ వర్తిస్తాయంటూ కోర్టును ఆశ్రయించి 60 ఏళ్లు దాటినా జిల్లా హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ పి.శ్రీనివాసరావు విధుల్లో కొనసాగుతున్నారు. కాగా ఉద్యోగ విరమణ తరువాత కొనసాగుతున్న ఏపీ విద్యా మౌలిక వసతుల కల్పన సంస్థలోని ఉద్యోగులకు ఇచ్చిన స్టేను రెండునెలల కిందట హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ఈ ఆదేశాలు హౌసింగ్‌కు కూడా వర్తిస్తా యంటూ సీనియర్ అధికారులు విశాఖ పీడీగా వచ్చేందుకు పైరవీలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జీతం, వాహనం అలవెన్స్ లేకపోయినా కొనసాగుతున్న పీడీ స్థానంలో వచ్చేందుకు వీరంతా పట్టుబడుతున్నా రని కార్పొరేషన్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది.
అధికార అండతోనే...
కాగా పీడీ శ్రీనివాసరావుకు సంబంధిత మంత్రి పేషీలో కీలకవ్యక్తి అండగా నిలుస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. విశాఖకు చెందిన ఈ వ్యక్తి నగరానికి వచ్చినపుడు మర్యాదలన్నీ హౌసింగ్ కార్యాలయమే చూసుకుంటుందని, ఇతనికి నగరంలో సొంత ఇల్లున్నా హోటల్‌లో గది, కారు సమకూర్చుతున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో ప్రస్తుత పీడీ కొనసాగేందుకు సాయపడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పీడీ శ్రీనివాసరావుకు గత ఏడాది జూలైతో 60 ఏళ్లు పూర్తయ్యాయి. ఉద్యోగ విరమణ చేయాల్సి ఉన్నప్పటికీ కోర్టునుంచి స్టేతెచ్చుకుని కొనసాగుతున్నారు.
రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు రిటైర్‌మెంట్ వయసు 62 ఏళ్లు. కానీ రాష్ట్ర ప్రభుత్వం పరిఽధి లోని కార్పొరేషన్‌లకు ఉద్యోగ విరమణ వయసు పెంచలేదు. దీంతో హౌసింగ్ కార్పొరేషన్‌లోని సుమారు 200 మంది ఉద్యోగులు కోర్టు నుంచి స్టే తెచ్చుకుని కొనసాగుతున్నారు. ఈ జాబితాలో జిల్లా నుంచి ఈఈ ప్రసంగరాజు, డీఈ బీఆర్‌వీ ప్రసాద్, మరో ఏఈ ఉన్నారు. కోర్టు స్టే ఇచ్చినా కార్పొరేషన్ మాత్రం వీరికి జీతాలు, వాహన అలవెన్స్‌లు ఇవ్వడంలేదు. అయినా ఏడాదిగా పీడీ, గత ఏడాది సెప్టెంబరు నుంచి ఈఈ ప్రసంగరాజు, డిసెంబరు నుంచి డీఈ ప్రసాద్ విధులు నిర్వర్తిస్తూనే ఉన్నారు. అయితే డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు అమలైతే పీడీ ఉద్యోగ విరమణ చేస్తారని, ఆ పోస్టులో చేరేందుకు పలువురు సీనియర్లు తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు.