పీజీ సెట్‌లో సత్తా చాటారు

ABN , First Publish Date - 2023-07-15T01:48:06+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీపీజీసెట్‌-2023లో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటారు.

పీజీ సెట్‌లో సత్తా చాటారు

నాలుగు సబ్జెక్టుల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులకు ప్రథమ ర్యాంకులు

మరికొంతమందికి ద్వితీ, తృతీయ ర్యాంకులు

విశాఖఫట్నం, జూలై 14 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్రవ్యాప్తంగా పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీపీజీసెట్‌-2023లో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 21 సబ్జెక్టుల్లో ప్రవేశాల కోసం పరీక్ష నిర్వహించగా...నాలుగింటిలో ఉమ్మడి జిల్లాకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు. ఇంగ్లీష్‌ సబ్జెక్టులో నగర పరిధిలోని దయాళ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన దత్తి సుధాకర్‌రావు, స్టాటిస్టిక్స్‌లో మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన తమరాల ప్రద్యున్‌, ఎకనామిక్స్‌లో అనకాపల్లి జిల్లా చోడవరం మండలం పీఎస్‌ పేట గ్రామానికి చెందిన బొడ్డపాటి ప్రసాద్‌, ఎడ్యుకేషన్‌ సబ్జెక్ట్‌లో నక్కపల్లి మండలం దోసలపాడు గ్రామానికి చెందిన భవిరిశెట్టి రామకృష్ణ మొదటి ర్యాంకు సాధించారు. కాగా స్టాటిస్టిక్స్‌లో నగరంలోని మర్రిపాలెం ప్రాంతానికి చెందిన సూరిరెడ్డి చందననాగసాయి రెండో ర్యాంకు, అక్కయ్యపాలెం ప్రాంతానికి చెందిన గొరపల్లి కార్తీక్‌ మూడో ర్యాంకు, హిస్టరీలో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలానికి చెందిన గొర్లె ప్రభుతేజ రెండో ర్యాంకు, ఎలక్ర్టానిక్స్‌లో గాజువాక పరిధి అగనంపూడి ప్రాంతానికి చెందిన బుడిరెడ్డి వసంతి రెండో ర్యాంకు, సైకాలజీలో నగర పరిధిలోని వినోద్‌నగర్‌కు చెందిన కోట వంశీ రాజేష్‌రెడ్డి మూడో ర్యాంకు, కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్ట్‌లో కె.కోటపాడు మండలం చౌడువాడ గ్రామానికి చెందిన భీశెట్టి అనిల్‌కుమార్‌ రెండో ర్యాంకు, నగర పరిధిలోని గోపాలపట్నం ప్రాంతానికి చెందిన భీశెట్టి గౌతమ్‌కుమార్‌ మూడో ర్యాంకు సాధించారు.

ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యం..

- తమరాన ప్రద్యున్‌, స్టాటిస్టిక్స్‌ సబ్జెక్ట్‌ టాపర్‌

ప్రభుత్వ రంగ సంస్థల్లో మెరుగైన ఉద్యోగాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నా. పీజీ తరువాత సీజీఎల్‌ రాస్తాను. అందుకు అనుగుణంగా ప్రణాళికతో సిద్ధమవుతున్నా. ఎంట్రన్స్‌ టెస్ట్‌ కూడా అదే ఉద్దేశంతో ప్రణాళిక ప్రకారం రాయడం ద్వారా మెరుగైన ఫలితాన్ని సాధించగలిగాను. అమ్మ ప్రమీణ గృహిణి, నాన్న సీతారామ్మూర్మి. నాన్న ఆర్మీలో రిటైర్‌ అయ్యారు. వీరిద్దరి సహకారంతో చదువులో ముందుకు సాగుతున్నా. తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావడమే లక్ష్యం.

ఏపీ ఎడ్‌సెట్‌ ఫలితాల్లోనూ మెరుగైన ర్యాంకులు

బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఎడ్‌సెట్‌లోనూ ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధించారు. మెథడాలజీ...ఇంగ్లీష్‌లో మర్రిపాలెం ప్రాంతానికి చెందిన ఎల్‌.అమృత రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు, బయాలాజికల్‌ సైన్స్‌లో అనకాపల్లి జిల్లా నాతవరం గ్రామానికి చెందిన పొలపర్తి దత్తసాయి రెండో ర్యాంకు సాధించారు. అలాగే, మేథమెటిక్స్‌లో అనకాపల్లి జిల్లా చోడవరం మండలం రేవళ్లు గ్రామానికి చెందిన ఓరుగంటి మనోజ త్రిభువని రెండో ర్యాంకు సాధించింది.

Updated Date - 2023-07-15T01:48:06+05:30 IST