ఏపీలో పెట్రోల్‌, డీజిల్‌ లీటరుకు రూ.12 అధికం

ABN , First Publish Date - 2023-06-01T05:38:37+05:30 IST

‘బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, ఏపీ పొరుగు రాష్ట్రాల్లో డీజిలు, పెట్రోలు తక్కువ ధరకు లభిస్తున్నాయి.

ఏపీలో పెట్రోల్‌, డీజిల్‌ లీటరుకు రూ.12 అధికం

‘మెట్రో’ ప్రాజెక్టుల జాప్యానికి వైసీపీ ప్రభుత్వమేకారణం: సత్యకుమార్‌

విశాఖపట్నం, మే 31(ఆంధ్రజ్యోతి): ‘‘బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, ఏపీ పొరుగు రాష్ట్రాల్లో డీజిలు, పెట్రోలు తక్కువ ధరకు లభిస్తున్నాయి. రాష్ట్రంలో మాత్రం లీటరుకు రూ.12 అదనంగా చెల్లిస్తున్నారు. అది ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసిన భారం’’ అని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ ఆరోపించారు. విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ‘‘రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం నగరాలకు కేంద్రం మెట్రో రైలు ప్రాజెక్టులు ఇచ్చింది. వాటికి సంబంధించిన ప్రతిపాదనలు పంపకుండా, భూమి సేకరించకుండా వైసీపీ ప్రభుత్వం జాప్యం చేస్తోంది. విశాఖకు రైల్వేజోన్‌ ఎప్పుడో ఇచ్చేశాం. నిధులు కూడా ఇచ్చాం. భూమిని కూడా ఎంపిక చేశాం. ప్రత్యేక హోదా చట్టంలో లేదు. దానికి ప్రత్యామ్నాయంగా కేంద్రం నిధులు ఇచ్చింది. కర్ణాటకలో ఓటమికి మూడు కారణాలు ఉన్నాయి. అక్కడ బీజేపీపై ప్రజల అభిమానం ఏమీ తగ్గలేదు. గతంలో 36 శాతం ఓట్లు వస్తే... ఇప్పుడు అలాగే వచ్చాయి. ఉచిత పథకాలకు బీజేపీ దూరం. అవే అక్కడ ప్రభావం చూపాయి’’ అని సత్యకుమార్‌ అన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్‌రాజు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-01T05:38:37+05:30 IST