బ్రెయిన్‌డెడ్‌ అయిన యువకుడి అవయవాలు దానం

ABN , First Publish Date - 2023-06-03T00:35:10+05:30 IST

బ్రెయిన్‌డెడ్‌ అయిన తమ కుమారుడి అవయవాలు దానం చేసేందుకు ముందుకువచ్చి ఏడు కుటుంబాల్లో వెలుగులు నింపారు ఆ తల్లిదండ్రులు. వివరాలిలా ఉన్నాయి.

బ్రెయిన్‌డెడ్‌ అయిన యువకుడి అవయవాలు దానం
మణికంఠ (ఫైల్‌ ఫొటో)

ఎలమంచిలి, జూన్‌ 2: బ్రెయిన్‌డెడ్‌ అయిన తమ కుమారుడి అవయవాలు దానం చేసేందుకు ముందుకువచ్చి ఏడు కుటుంబాల్లో వెలుగులు నింపారు ఆ తల్లిదండ్రులు. వివరాలిలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మునిసిపాలిటీ పరిధిలోని కొత్తపాలెం ప్రాంతానికి చెందిన మళ్ల కృష్ణ, పోలేరమ్మ దంపతులకు ఒక కుమారుడు వెంకట మణికంఠ (20), ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మణికంఠ స్థానికంగా ఒక ప్రైవేటు కళాశాలలో బీఎస్‌సీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. కృష్ణ, పోలేరమ్మలు ఇద్దరూ వ్యవసాయ పనులు చేసుకుంటూ పిల్లలను చదివిస్తున్నారు. కుటుంబ సభ్యులంతా కలిసి శుభకార్యం ఉండడంతో మంగళవారం సీలేరు సమీపంలో గల ధారకొండ వెళ్లారు. అక్కడ కార్యక్రమం అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో కశింకోట మండలం తాళ్లపాలెం సమీపంలోకి వచ్చేసరికి వ్యాన్‌ నుంచి ప్రమాదవశాత్తూ మణికంఠ జారిపడిపోయాడు. తలకు తీవ్ర గాయం కావడంతో విశాఖలోని కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు రెండు రోజులు చికిత్స అందించిన అనంతరం బ్రెయిన్‌డెడ్‌ అయినట్టు తెలిపారు. కొడుకు దూరమైనా మరికొంతమంది కుటుంబాల్లో వెలుగులు నింపవచ్చుననే ఉద్దేశంతో అతడి అవయవాలు దానం చేసేందుకు కృష్ణ, పోలేరమ్మ అంగీకరించారు. ఆ కార్యక్రమం పూర్తయిన అనంతరం మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్వగ్రామమైన కొత్తపాలెం తీసుకువచ్చారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు, స్నేహితులు పెద్దసంఖ్యలో ఎలమంచిలి చేరుకున్నారు. అంబులెన్స్‌లో మణికంఠ భౌతికకాయాన్ని చూసి కన్నీటి పర్యంతమవుతూ జోహార్‌ మణికంఠ అంటూ నినాదాలు చేస్తూ ఎలమంచిలి నుంచి సుమారు మూడు కిలోమీటర్లు ర్యాలీగా కొత్తపాలెం తరలించారు. ఎలమంచిలి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ రమాకుమారి, కమిషనర్‌ కృష్ణవేణి, సీఐ గఫూర్‌, కౌన్సిలర్‌ సంతోష్‌, మునిసిపల్‌ అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు మణికంఠ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:35:10+05:30 IST