కొనసాగుతున్న ముసురు

ABN , First Publish Date - 2023-03-19T01:05:13+05:30 IST

మన్యంలో మూడు రోజులుగా ముసురు వాతావరణం కొనసాగుతున్నది. గురువారం మధ్యాహ్నం నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని వర్షాకాలాన్ని తలపించే వాతావరణం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

కొనసాగుతున్న ముసురు
సీలేరులో శనివారం సాయంత్రం కురుస్తున్న వర్షం దృశ్యం

జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం

పాడేరు, మార్చి 18(ఆంధ్రజ్యోతి): మన్యంలో మూడు రోజులుగా ముసురు వాతావరణం కొనసాగుతున్నది. గురువారం మధ్యాహ్నం నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని వర్షాకాలాన్ని తలపించే వాతావరణం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అలాగే శనివారం ఉదయం నుంచి ఆకాశమంతా మేఘావృతమై మబ్బుల వాతావరణం కొనసాగింది. సాయంత్రం మూడు గంటల తరువాత పాడేరులో జల్లులతో కూడిన వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ చిత్తడిగా మారింది.

చింతపల్లి: మండలంలో భారీ వర్షం కురిసింది. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వాతావరణం సాధారణంగా ఉన్నది. మూడు గంటల నుంచి వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు కుండపోత వర్షం కురిసింది. వాగులు, కాలువాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు, లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో నిండాయి. కాగా అల్పపీడనం వల్ల కురుస్తున్న వర్షాలు కాఫీ పంట పూతకు ఎంతగానో ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సీలేరు: జీకేవీధి మండలం సీలేరులో శనివారం సాయంత్రం గంటసేపు ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షానికి వాతావరణం చల్లబడింది.

గూడెంకొత్తవీధి: మండలంలో మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు, చెరువులు వర్షపు నీటితో నిండాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వర్షం వల్ల పూజారిపాకలు, గూడెంకాలనీ గ్రామ దేవతల జాతరకు తీవ్ర అంతరాయం కలిగింది.

అరకులోయ: పట్టణంలో సాయంత్రం చిరుజల్లులు కురిశాయి. దీంతో వాతావరణం చల్లబడింది.

కొయ్యూరు: మండలంలో శనివారం ఉదయం ఈదురు గాలులుతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో లాలం అప్పలనాయుడు, సూరెడ్డి నర్సింహామూర్తిలకు చెందిన ఆరు ఎకరాలలో గల అరటి తోటలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. కొయ్యూరు వాల్మీకిపేట రోడ్డు జలమయమైంది. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న భారీ మామిడిచెట్టు ఈదురు గాలలకు నేలకూలింది.

డుంబ్రిగుడ: మండలంలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం కురుస్తూనే ఉంది.

పెదబయలు: మండలంలో శనివారం మధ్యాహ్నం నుంచి జల్లులతో కూడిన వర్షం పడింది. దీంతో రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. సాయంత్రం గంటన్నర సేపు భారీ వర్షం కురిసింది. దీంతో జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.

Updated Date - 2023-03-19T01:05:13+05:30 IST