కొనసాగుతున్న ఆరోగ్య శాఖ తనిఖీలు

ABN , First Publish Date - 2023-06-03T01:07:09+05:30 IST

జిల్లాలో అనుమతి లేకుండా నడుస్తున్న హెల్త్‌ క్లినిక్‌లు పదమూడు వరకూ వున్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటివరకూ గుర్తించారు.

కొనసాగుతున్న ఆరోగ్య శాఖ తనిఖీలు

ఇప్పటివరకూ అనుమతి లేకుండా నడుస్తున్న 13 క్లినిక్స్‌ గుర్తింపు

తగరపువలసలో ఒక ఆస్పత్రి సీజ్‌

నగర పరిధిలో మరిన్ని వెలుగులోకి వచ్చే అవకాశం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో అనుమతి లేకుండా నడుస్తున్న హెల్త్‌ క్లినిక్‌లు పదమూడు వరకూ వున్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటివరకూ గుర్తించారు. కిడ్నీ రాకెట్‌ వెలుగులోకి వచ్చిన తరువాత పెందుర్తిలో శ్రీతిరుమల ఆస్పత్రిని సీజ్‌ చేసిన వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌లు, ల్యాబ్‌లలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఇప్పటివరకూ జిల్లాలో రిజిస్ర్టేషన్‌ లేకుండా నడుస్తున్న 13 క్లినిక్స్‌ను గుర్తించారు. అలాగే తగరపువలసలో అనధికారికంగా నడుస్తున్న ఆస్పత్రిని సీజ్‌ చేసిన అధికారులు...కలెక్టర్‌ అనుమతితో తదుపరి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. రిజిస్ర్టేషన్‌ లేకుండా నడుస్తున్న క్లినిక్స్‌లపై కూడా కలెక్టర్‌ అనుమతితో చర్యలు తీసుకునే యోచనలో అధికారులు ఉన్నారు. నగర పరిధిలో ఈ తనిఖీలు ఇంకా కొనసాగుతుండడంతో అనుమతి లేకుండా నడుస్తున్న మరిన్ని ఆస్పత్రులు, క్లినిక్స్‌ వెలుగులోకి వచ్చే అవకాశం వుందని అధికారులు భావిస్తున్నారు.

మరిన్ని వెలుగులోకి వచ్చే అవకాశం..

వైద్య, ఆరోగ్య శాఖలో తగిన స్థాయిలో సిబ్బంది లేకపోవడంతో తనిఖీల ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యులు, ఇతర అధికారులతోనే ఈ తనిఖీలు చేపట్టాల్సి వస్తోంది. తనిఖీలు పూర్తయ్యేసరికి ఈ తరహా క్లినిక్‌లు మరో 30-40 వరకు బయటపడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. క్లినిక్‌ నిర్వహణకు అనుమతి తప్పనిసరి అని, రిజిస్ర్టేషన్‌కు వచ్చే నెల పదో తేదీ వరకు అవకాశం వుందని అధికారులు చెబుతున్నారు. అనుమతి లేకుండా నడుస్తున్న ఆస్పత్రులు, క్లినిక్‌లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2023-06-03T01:07:09+05:30 IST