భక్తులతో కిటకిటలాడిన నూకాంబిక ఆలయం
ABN , First Publish Date - 2023-06-26T00:07:47+05:30 IST
స్థానిక నూకాంబిక అమ్మవారి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామున ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
అనకాపల్లి టౌన్, జూన్ 25 : స్థానిక నూకాంబిక అమ్మవారి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామున ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఉమ్మడి విశాఖ జిల్లా నలుమూలల నుంచి భక్తులు తెల్లవారుజామున ఆలయానికి రావడం ప్రారంభించారు. సాయంత్రం నాలుగున్నర గంటలు దాటినా ఆలయంలో భక్తుల సందడి తగ్గలేదు. ఆలయ క్యాటేజిలతోపాటు పరిసరాల్లోని తాటాకుల పందిళ్ల నీడలో భక్తులు వంటలు తయారుచేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి కుటుంబసమేతంగా సహపంక్తి భోజనాలు చేశారు. మొక్కుబడుల్లో భాగంగా కొందరు పండగ చేసుకుని ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి వచ్చి ఘటాలను సమర్పించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.