414 ఇళ్లకు నోటీసులు

ABN , First Publish Date - 2023-02-07T01:28:06+05:30 IST

ఒకటి, రెండు కాదు...ఏకంగా వందల సంఖ్యలో ఇళ్లకు ఆక్రమణలని పేర్కొంటూ రెవెన్యూ సిబ్బంది నోటీసులు జారీచేయడం పెందుర్తి ప్రాంతంలో కలకలం రేపుతోంది.

414 ఇళ్లకు నోటీసులు

చెరువులు, గెడ్డలు, వాగులు ఆక్రమించి నిర్మించినట్టు సర్వేలో తేలిందంటున్న రెవెన్యూ అధికారులు

పెందుర్తిలో కలకలం

ప్రభుత్వ భూముల ఆక్రమణదారులకూ త్వరలో నోటీసులు

పెందుర్తి, ఫిబ్రవరి 6:

ఒకటి, రెండు కాదు...ఏకంగా వందల సంఖ్యలో ఇళ్లకు ఆక్రమణలని పేర్కొంటూ రెవెన్యూ సిబ్బంది నోటీసులు జారీచేయడం పెందుర్తి ప్రాంతంలో కలకలం రేపుతోంది. చెరువులు, గెడ్డ, వాగుల్లో నిర్మించినట్టు సర్వేలో నిర్ధారణ కావడంతో నోటీసులు జారీచేశామని సిబ్బంది అంటున్నారు. మండల తహసీల్దార్‌ కార్యాలయ పరిధిలో సుమారు 15 ఎకరాల్లో ఆక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ 414 మంది ఇంటి యజమానులకు రెవెన్యూ సిబ్బంది సెక్షన్‌ 7 కింద నోటీసులు జారీచేశారు. ఏడు రోజుల్లోగా సమాధానం చెప్పాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

417 మందికి నోటీసులు

చెరువు, గెడ్డ, వాగులు సుమారు 15 ఎకరాల మేర ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారంటూ పెందుర్తిలో 257, చినముషిడివాడలో 73, వేపగుంటలో 25, లక్ష్మీపురంలో 8, గ్రామీణ ప్రాంతం సరిపల్లిలో 31, ఎస్‌.ఆర్‌.పురంలో 14, గుర్రపాలెంలో 6...మొత్తం 414 మంది ఇళ్ల యజమానులకు రెవెన్యూ సిబ్బంది సెక్షన్‌ 7 నోటీసులు జారీచేశారు. ఇంకా సుజాతనగర్‌లో కార్మికనగర్‌, గిరిప్రసాద్‌నగర్‌, నాగమల్లి నగర్‌, కృష్ణరాయపురం, సేనాతివానిపాలెంలో కూడా చెరువులు ఆక్రమించి పలువురు నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించామని, వారికి కూడా నోటీసులు అందజేయనున్నామని రెవెన్యూ సిబ్బంది అంటున్నారు. సుజాతనగర్‌లో ఒక నిర్మాణ సంస్థ ఎదురుగా గల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించామని వాటికి నోటీసులు అందజేసి వివరణ కోరనున్నామంటున్నారు.

పెందుర్తిలో గల గోకాడ చెరువు, పెద్దన్న చెరువు, రాతిచెరువు, విజయనరామ చెరువు స్థలాల్లో దశాబ్దాల క్రితం ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ఈ స్థలాల్లో గల ఇంటి యజమానులకు నోటీసులు జారీచేశారు. కాగా ఎన్నో ఏళ్లుగా నివాసముంటున్నామని, అన్ని పన్నులు చెల్లిస్తున్నామని ఇప్పుడు ఆక్రమణలుగా పేర్కొంటూ నోటీసులు జారీచేయడం ఏమిటని ఇళ్ల యజమానులు అంటున్నారు.

వాటర్‌ బాడీస్‌ ఆక్రమణదారులకు నోటీసులు జారీ

రెవెన్యూ పరిధిలో గల వాటర్‌ బాడీస్‌ ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారికి నోటీసులు జారీ చేశాం. జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశాల మేరకు సర్వే నిర్వహించి ఆక్రమణలు గుర్తించడం జరిగింది. అలాగే ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను కూడా తొలగిస్తాం.

-ఆనంద్‌కుమార్‌, తహసీల్దార్‌ , పెందుర్తి

Updated Date - 2023-02-07T01:28:07+05:30 IST