తూర్పు వైసీపీ ఇన్‌చార్జిగా ఎంవీవీ

ABN , First Publish Date - 2023-08-26T01:15:21+05:30 IST

విశాఖపట్నం తూర్పు నియోజకవర్గానికి సమన్వయకర్తగా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను నియమిస్తున్నట్టు వైసీపీ అధిష్ఠానం శుక్రవారం ప్రకటించింది.

తూర్పు వైసీపీ ఇన్‌చార్జిగా ఎంవీవీ

వచ్చే ఎన్నికల్లో సీటు ఆయనకే?

విశాఖపట్నం, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం తూర్పు నియోజకవర్గానికి సమన్వయకర్తగా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను నియమిస్తున్నట్టు వైసీపీ అధిష్ఠానం శుక్రవారం ప్రకటించింది. ఇప్పటివరకు వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్‌ అక్కరమాని విజయనిర్మల సమన్వయకర్తగా ఉన్నారు. గత ఎన్నికల్లో తూర్పు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె...టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత ఆమెకు నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించారు. ఏడాదిన్నర కిందట వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్‌ పదవి ఇచ్చారు. ఇదిలావుండగా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ‘తూర్పు’ నుంచి పోటీకి దిగుతారని ప్రచారం జరగడంతో ఇటీవల ఆ నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన యాదవ సామాజికవర్గ నేతలు సమావేశమయ్యారు. ఎమ్మెల్సీగా పదవి పొందిన వంశీకృష్ణ శ్రీనివాస్‌, విశాఖ నగర మేయర్‌ హరికుమారి, 16వ వార్డు కార్పొరేటర్‌ మొల్లి అప్పారావు తదితరులు తూర్పు ఎమ్మెల్యే సీటును ఆశిస్తున్నారు. తూర్పు సీటు యాదవులకే ఇవ్వాలని పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించుకున్నారు. ఆ తరువాత పలు దఫాలు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. తాడేపల్లి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. వంశీకృష్ణకు ఎమ్మెల్సీ ఇచ్చామని, అలాగే ప్రస్తుతం సమన్వయకర్తగా వున్న అక్కరమానికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పినట్టు సమాచారం. పార్టీ సూచించిన వ్యక్తిని గెలిపించే బాధ్యత తీసుకోవాలని సూచించినట్టు తెలిసింది. ఇటీవల విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కూడా రెండు, మూడుసార్లు తాడేపల్లి వెళ్లి సీఎంను కలిశారు. రెండు రోజుల క్రితం కూడా వెళ్లి మాట్లాడారు. అప్పుడే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశారు. ఇప్పుడు అధికారికంగా ఆయనకు సమన్వయకర్త బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

Updated Date - 2023-08-26T01:15:21+05:30 IST