1350 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుకు కదలిక

ABN , First Publish Date - 2023-02-07T00:30:56+05:30 IST

జిల్లాలోని జీకే వీధి మండలం సీలేరులో ఏపీ జెన్‌కో ప్రతిపాదిత పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు (పీఎస్‌పీ) నిర్మాణంపై కదలిక వచ్చింది.

1350 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుకు కదలిక
పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు నిర్మాణం కోసం బూసికొండ వద్ద నిర్వాసితులతో జెన్‌కో, రెవెన్యూ అధికారులు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సభ (ఫైల్‌ ఫొటో)

తాజాగా ఏపీ జెన్‌కో ఎండీ ప్రకటనతో ముందడుగు

మరోసారి ప్రజాభిప్రాయ సేకరణకు అధికారుల సన్నాహాలు

సీలేరు, ఫిబ్రవరి 6: జిల్లాలోని జీకే వీధి మండలం సీలేరులో ఏపీ జెన్‌కో ప్రతిపాదిత పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు (పీఎస్‌పీ) నిర్మాణంపై కదలిక వచ్చింది. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు అన్ని అనుమతులు సిద్ధమైనట్టు ఇటీవల ఏపీ జెన్‌కో ఎండీ బి.శ్రీధర్‌ అమరావతిలో ప్రకటించడంతో ముందడుగు పడినట్టయింది. సీలేరులో పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు నిర్మిస్తే సీలేరు కాంప్లెక్సు ఖాతాలో మరో 1350 మెగావాట్లు చేరతాయి.

రాష్ట్ర విద్యుత్‌ అవసరాలను తీర్చడంతో పాటు గ్రిడ్‌ సమతుల్యానికి దోహదపడేందుకు సీలేరు వద్ద పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు (ఎత్తిపోతల ప్రాజెక్టు) ఎంతో అనుకూలంగా ఉంటుం దని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టును ఏపీ జెన్‌కో తెరపైకి తెచ్చింది. సీలేరు జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి అనంతరం విడుదలైననీటిలో ఒక టీఎంసీ నీటిని పంప్‌ల ద్వారా వెనక్కి మళ్లించి ఆ నీటితోనే 1350 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తిని చేసేలా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. ఈ ప్రాజెక్టుకు సీలేరు సమీపంలోని పార్వతీనగర్‌ వద్ద అనుకూలమని నిపుణులైన ఇంజనీర్లు ఎంపిక చేశారు. సీలేరు జల విద్యుత్‌ కేంద్రం నుంచి విద్యుత్‌ ఉత్పత్తి అనంతరం విడుదలైన నీటిని వెనక్కి మళ్లించడానికి డొంకరాయి రిజర్వాయర్‌ దిగువన లేదా శాండికోరి, వలసగెడ్డ సమీపంలో ఒక రబ్బర్‌ డ్యాంను ఏర్పాటు చేస్తారు. అక్కడ నుంచి భూగర్భం (అండర్‌ గ్రౌండ్‌)లో అమర్చిన పైప్‌లైన్‌ ద్వారా మోటార్లతో పంప్‌ చేసి తద్వారా పార్వతీనగర్‌ వద్ద భూగర్భంలో విద్యుత్‌ కేంద్రం నిర్మించి ఒక్కొక్కటి 150 మెగావాట్ల సామర్థ్యం గల తొమ్మిది యూనిట్ల ద్వారా 1350 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తిని చేయాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. దీని కోసం గత ప్రభుత్వ హయాంలోనే సర్వే పనులు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు సర్వే పనులను వాప్కోస్‌ (వాటర్‌ అండ్‌ పవర్‌ కన్సల్టెన్సీ) సంస్థకు అప్పగించడంతో సర్వే నిర్వహించి గత ఏడాదే ప్లానింగ్‌ మ్యాప్‌లను తయారు చేశారు. ఇది అండర్‌ గ్రౌండ్‌ ప్రాజెక్టు కావడంతో భూమి లోపల రాక్‌ ఏయే ప్రదేశంలో ఎంత పటిష్ఠంగా ఉన్నాయో తెలుసుకోవడానికి శాండికోరి నుంచి పార్వతీనగర్‌ మీదుగా గుంటవాడ జలాశయం వరకు 66 ప్రదేశాల్లో 60 నుంచి 140 మీటర్ల లోతులో రాక్‌ నమూనాలను ఆ సంస్థ సేకరించింది. సర్వే అనంతరం రూపొందించిన మ్యాప్‌లను జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నిపుణుల బృందం కూడా 2020 అక్టోబరులో పరిశీలించి వెళ్లింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.10,500 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్‌ను రూపొందించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 214.5 హెక్టార్ల అటవీ భూమికి కూడా రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. ఈ ప్రాజెక్టు వల్ల బూసికొండ, శాండికోరి, పార్వతీనగర్‌, వలసగెడ్డ, వలసగెడ్డ కొత్తూరు గ్రామాలను తరలించాల్సి ఉండడంతో వారికి పునరావాసం, ఉపాధి కల్పన, నష్టపరిహారం తదితర అంశాలపై 2021 మే నెలలో బూసికొండ వద్ద నిర్వాసితులతో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని కూడా ఏపీ జెన్‌కో అధికారులు, రెవెన్యూ అధికారులు నిర్వహించారు. మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సి ఉన్న తరుణంలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌, ఐటీడీఏ అధికారులతో జెన్‌కో అధికారులు ఇటీవల సమావేశమై దీనిపై చర్చించారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు మార్గం సుగమమైనట్టు తెలుస్తోంది.

Updated Date - 2023-02-07T00:31:01+05:30 IST