గవర్నర్ కోటాలో రవిబాబుకు ఎమ్మెల్సీ
ABN , First Publish Date - 2023-02-21T00:10:08+05:30 IST
ప్రస్తుతం రాష్ట్ర ఎస్‌టీ కమిషన్ చైర్మన్‌గా ఉన్న డాక్టర్ కుంభా రవిబాబును గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ అధిష్ఠానం ప్రతిపాదించింది. గంటూరు జిల్లాకు చెందిన కుంభా రవిబాబు 1989 నుంచి 2004 వరకు ఆంరఽధా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేశారు.
ప్రస్తుతం ఎస్‌టీ కమిషన్ చైర్మన్ పదవిలో కొనసాగుతున్న కుంభా
గతంలో ఎస్.కోట ఎమ్మెల్యేగా చేసిన రవిబాబు
రెండు మార్లు స్వతంత్ర ఎమ్మెల్యేగా బరిలోకి దిగి అపజయం
ఇప్పటికి అనుహ్యంగా గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ చాన్స్
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
ప్రస్తుతం రాష్ట్ర ఎస్‌టీ కమిషన్ చైర్మన్‌గా ఉన్న డాక్టర్ కుంభా రవిబాబును గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ అధిష్ఠానం ప్రతిపాదించింది. గంటూరు జిల్లాకు చెందిన కుంభా రవిబాబు 1989 నుంచి 2004 వరకు ఆంరఽధా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేశారు. అలాగే ఆయనకు రాజకీయాలపై ఆసక్తి ఉండడంతో తొలుత తెలుగుదేశం పార్టీ క్యాడర్‌కు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించే వారు. తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి విజయనగ రం జిల్లా శృంగవరపుకోట ఎస్‌టీ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా 2004 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. దీంతో 2004 నుంచి 2009 వరకు ఎస్.కోట ఎమ్మెల్యేగా ఉన్న ఆయన, ఆ నియోజకవర్గంలో భాగమైన అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ మండలాలపై పట్టు సాధించారు. అదే క్రమంలో 2005 నుంచి 2007 వరకు విజయనగరం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అఽధ్యక్షుడిగా ఉన్నారు. అలాగే 2008లో అసెంబ్లీ ఎస్‌టీ కమిటీ చైర్మన్‌గా చేశారు.
రెండు సార్లు ఎమ్మెల్యేగా అపజయం
ప్రస్తుతం వైసీపీలో ఉంటూ రాష్ట్ర ఎస్‌టీ కమిషన్ చైర్మన్‌గా ఉన్న డాక్టర్ కుంభా రవిబాబు గతంలో అరకులోయ అసెంబ్లీ స్థానానికి రెండు సార్లు ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పొందారు. 2009లో అరకులోయలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి దిగారు. దీంతో అప్పటి కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న శెట్టి గంగాధరస్వామి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగడంతో రవిబాబు ఓటమి పాలయ్యారు. టీడీపీ అభ్యర్థి సివేరి సోమ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తరువాత కొన్నాళ్లుగా స్తబ్ధుగా ఉన్న ఆయన 2013లో టీడీపీ చేరారు. 2014 ఎన్నికల్లో అరకులోయ నుంచి టీడీపీ ఎమ్మెల్యే టికెట్‌ను ఆశించారు. కానీ అనుహ్యంగా సిటింగ్ ఎమ్మెల్యే సివేరి సోమకు టీడీపీ టికెట్ దక్కడంతో అసంతృప్తికి గురైన రవిబాబు టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలో దిగారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిడారి సర్వేశ్వరరావు విజయం సాధించగా, టీడీపీ అభ్యర్థి సివేరి సోమ, టీడీపీ రెబల్ అభ్యర్థి కుంభా రవిబాబు సైతం ఓటమి పాలయ్యారు. ఆ తరువాత ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరారు. 2019లో వైసీపీ అరకులోయ పార్లమెంట్ కన్వీనర్‌గా పార్టీ అధిష్ఠానం నియమించింది. అప్పటి నుంచి గిరిజన నేతగా వైసీపీలో ఆయన కీలకంగా వ్యవహరిస్తుండడంతో మొదటి విడతలోనే ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తారని ప్రచారం జరిగినప్పటికీ, ఫలితం దక్కలేదు. కానీ క్యాబినెట్ స్థాయిలో ఉండే రాష్ట్ర ఎస్‌టీ కమిషన్‌కు చైర్మన్‌గా రవిబాబును ప్రభుత్వం నియమించింది. దానిని వేదికగా చేసుకుని ఆయన గిరిజన ప్రాంతంలో పట్టు సాధిస్తూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అరకులోయ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తుండేవారు. ఈ క్రమంలో అనూహ్యంగా గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ అధిష్ఠానం రవిబాబు పేరును ప్రతిపాదించింది. గిరిజనుడైన రవిబాబును ఎమ్మెల్సీకి ఎంపిక చేయడంపై మన్యం వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతా..
‘ఆంధ్రజ్యోతి’తో కుంభా రవిబాబు
అరకులోయ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తనను గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానానికి ప్రతిపాదించినందుకు గిరిజనుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, ఆయన తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని డాక్టర్ కుంభా రవిబాబు తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో ఫోన్‌లో మాట్లాడుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. చట్ట సభల్లో గిరిజన ప్రాంత సమస్యలను ప్రభుత్వం దృష్టికి నేరుగా తీసుకువెళ్లి, వాటి శాశ్వత పరిష్కారానికి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటానన్నారు. ఇప్పటికే తనకు రాష్ట్ర ఎస్‌టీ కమిషన్ చైర్మన్‌గా సముచిత స్థానం కల్పించారని, ఇప్పుడు ఎమ్మెల్సీగా ప్రతిపాదించడం ఆనందంగా ఉందన్నారు.