గురువులుకు ఎమ్మెల్సీ చాన్స్‌

ABN , First Publish Date - 2023-02-21T01:07:41+05:30 IST

రాష్ట్రంలో స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే కోటాతోపాటు గవర్నర్‌ కోటాలో ఖాళీ అవుతున్న మొత్తం 18 ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సోమవారం అభ్యర్థులను ప్రకటించింది.

గురువులుకు ఎమ్మెల్సీ చాన్స్‌

ప్రజారాజ్యంతో రాజకీయ ప్రస్థానం ప్రారంభం

2009లో పీఆర్‌పీ, 2014లో వైసీపీ తరపున దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ

2019లో దక్కని అవకాశం

2024లో టిక్కెట్‌పై గురువులు, సీతంరాజు సుధాకర్‌ ఆశలు

ఆ విషయం గ్రహించే పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా సుధాకర్‌ను పోటీకి దింపిన వైసీపీ అధిష్ఠానం

ఇప్పుడు శాసనసభ్యుల కోటాలో గురువులు ఎంపిక

వాసుపల్లికి లైన్‌ క్లియర్‌ చేసేందుకేనా?

విశాఖపట్నం, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్రంలో స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే కోటాతోపాటు గవర్నర్‌ కోటాలో ఖాళీ అవుతున్న మొత్తం 18 ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సోమవారం అభ్యర్థులను ప్రకటించింది. ఎమ్మెల్యే కోటాలో నగరానికి చెందిన వైసీపీ సీనియర్‌ నేత, రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలా గురువులుకు అవకాశం కల్పించింది.

కోలా గురువులు 2008లో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో దక్షిణ నియోజకవర్గం నుంచి పీఆర్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి, కాంగ్రెస్‌ అభ్యర్థి ద్రోణంరాజు శ్రీనివాస్‌ చేతిలో 341 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి దక్షిణ నియోజకర్గం అభ్యర్థిగా పోటీ చేసి, టీడీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్‌కుమార్‌ చేతిలో 18,316 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో టిక్కెట్‌ ఆశించారు. అధిష్ఠానం ద్రోణంరాజు శ్రీనివాస్‌కు అవకాశం ఇవ్వడంతో కోలా గురువులు తీవ్ర నైరాశ్యానికి గురయ్యారు. పార్టీ ఆవిర్భావం నుంచి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేయడమేకాకుండా, ఆర్థికంగా ఎంతో నష్టపోయానంటూ కోలా గురువులు తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తంచేస్తుండేవారు. మరోవైపు ద్రోణంరాజు శ్రీనివాస్‌ ఓటమి పాలు కాగా...వాసుపల్లి వరుసగా రెండోసారి గెలుపొందారు. టీడీపీ తరపున గెలిచిన ఆయన తర్వాత వైసీపీ పంచన చేరారు. వాసుపల్లిపై నియోజకవర్గ వైసీపీ నేతల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ కోసం కోలా గురువులుతో పాటు సీతంరాజు సుధాకర్‌ ప్రయత్నాలు మొదలెట్టారు. అయితే వైసీపీ అధిష్ఠానం ఆమధ్య కోలా గురువులుకు మత్స్యకార కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి, సీతంరాజు సుధాకర్‌కు బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి కట్టబెట్టింది. మత్స్యకార కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవితో ఎలాంటి ఉపయోగం, గుర్తింపు లేకపోవడంతో గురువులు గతంలో మాదిరిగా చురుగ్గా వ్యవహరించడం లేదు. ఇటువంటి తరుణంలో దక్షిణ నియోజకవర్గం నుంచి టిక్కెట్‌ ఆశిస్తున్న బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌ను పార్టీ అధిష్ఠానం ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీకి దింపింది. దక్షిణ నియోజకవర్గంలో పార్టీలో సమీకరణాలు మారుతుండడంతో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌పై గురువులు ఆశలు పెట్టుకున్నారు. వాసుపల్లిని కాదనుకుంటే మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన తన వైపు అధిష్ఠానం మొగ్గుచూపుతుందని భావించారు. ఇంతలో ఊహించని విధంగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా కోలా గురువులును పార్టీ అధిష్ఠానం ప్రతిపాదించింది. పార్టీ నిర్ణయంపై ఆయనతోపాటు అనుచరుల్లో సంతోషం వెల్లివిరిసింది. అయితే వర్గపోరు తీవ్రంగా వున్న దక్షిణ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని చక్కదిద్దే క్రమంలోనే అధిష్ఠానం సీతంరాజు సుధాకర్‌ను పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది, తాజాగా కోలా గురువులును ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిందని పార్టీ నేతలు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వాసుపల్లికి టిక్కెట్‌ కేటాయింపులో ఎవరూ అడ్డు రాకుండా చేయాలన్నదే అధిష్ఠానం లక్ష్యమని పేర్కొంటున్నారు. ప్రస్తుతానికి సిట్టింగ్‌ ఎమ్మెల్యే వాసుపల్లితో పాటు ద్రోణంరాజు శ్రీనివాస్‌ తనయుడు శ్రీవాత్సవ్‌ దక్షిణ నియోజకవర్గం టిక్కెట్‌ రేస్‌లో మిగిలి ఉన్నారు.

Updated Date - 2023-02-21T01:07:42+05:30 IST