అనకాపల్లి మండల అభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2023-03-26T00:11:55+05:30 IST

అనకాపల్లి మండల అభివృద్ధికి శతశాతం కృషి చేస్తున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు.

అనకాపల్లి మండల అభివృద్ధికి కృషి
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

తుమ్మపాల, మార్చి 25 : అనకాపల్లి మండల అభివృద్ధికి శతశాతం కృషి చేస్తున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. శనివారం ఎంపీడీవో సమావేశమందిరంలో ఎంపీపీ గొర్లి సూరిబాబు అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తొలుత రూ.పది లక్షలతో ఆధునికీకరణ చేసిన ఎంపీడీవో కార్యాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మండల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. సమస్యలను ప్రజాప్రతినిధులు సమావేశం దృష్టికి తీసుకు వస్తే శతశాతం పరిష్కరిస్తామన్నారు. రూ.32 కోట్లతో కేబీ రోడ్డు పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. జిల్లాలో రూ.4.86 కోట్లతో ఇరిగేషన్‌ పనులు చేపడుతున్నామన్నారు. గ్రామాల్లో ఏప్రిల్‌ ఆరు నుంచి ఫ్యామిలీ ఫిజీషియన్‌ను శతశాతం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

సమస్యలు పరిష్కారం కావడం లేదు..

మండల సమావేశాలు జరుగుతున్నా గ్రామాల్లో పలు సమస్యలు ఎక్కడికక్కడ పడకేశాయని ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రధానంగా రైతు భరోసాపై అధికారుల పర్యవేక్షణ కరువైందని ఎంపీటీసీ సభ్యులు చదరం నాగేశ్వరరావు, విజయ్‌ వ్యవసాయాధికారిని ప్రశ్నించారు. కౌలు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అలాగే ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల తీరుపై దాదాపు సభ్యులంతా అసంతృప్తి వ్యక్తంచేశారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడిని పరిష్కరించడంలో అధికారులు విఫలమవుతున్నారని విమర్శించారు. జలజీవన్‌మిషన్‌ను అమలు చేయడంలో జాప్యం చేస్తున్నారని ఎంపీటీసీ సభ్యులు చదరం నాగేశ్వరరావు, విజయ్‌, సర్పంచ్‌ సప్పారపు లక్ష్మీప్రసన్న అధికారులపై మండిపడ్డారు. ఇన్‌చార్జి ఎంపీడీవో ధర్మారావు నిర్లక్ష్యపు సమాధానాలు, అలసత్వంపై నిలదీశారు. ఎంపీపీ గొర్లి సూరిబాబు మాట్లాడుతూ.. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ అనకాపల్లిని అభివృద్ధిపథంలో నడపాలని కోరారు. సమావేశం ఆరంభం నుంచి ముగింపు వరకు సూపరింటెండెంట్‌ సాయిసుధ కనుకుపాట్లు పడుతుండడంతో సభా అంతా నవ్వుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ విల్లూరి సూర్యకుమారి, అయితా ఆనందరాము పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T00:11:55+05:30 IST