Share News

ఇన్నాళ్లకు గుర్తొచ్చిందా... మెట్రో?

ABN , Publish Date - Dec 17 , 2023 | 01:19 AM

ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్‌ ప్రభుత్వం హడావుడి మొదలెట్టింది.

ఇన్నాళ్లకు గుర్తొచ్చిందా... మెట్రో?

ఎన్నికల ముందు తెరపైకి ప్రాజెక్టు

మంత్రివర్గ సమావేశంలో డీపీఆర్‌ ఆమోదం

రెండేళ్ల నుంచి కొర్రీలతోనే కాలక్షేపం

నాలుగున్నరేళ్ల తరువాత ఇప్పుడు హడావిడి

కేంద్రం ఆమోదిస్తేనే...నిధులు

ఈ మూడు నెలల్లో లేనట్టే!!

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్‌ ప్రభుత్వం హడావుడి మొదలెట్టింది. నాలుగున్నరేళ్లుగా పట్టించుకోని ప్రాజెక్టులకు ఇప్పుడు పచ్చజెండా ఊపుతోంది. ఈ ఏడాది మే నెలలో విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఆరు నెలలైంది. ఇప్పటికీ అక్కడ పనులు మొదలుకాలేదు. అదే సమయంలో భోగాపురంలో అంతార్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ ఆరు నెలల్లో అక్కడ ప్రహరీ పనులు మాత్రమే చేపట్టారు. ఇప్పుడు తాజాగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో విశాఖ మెట్రో రైలుకు సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక (డీపీఆర్‌)ను ఆమోదించారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టును గత టీడీపీ ప్రభుత్వమే ప్రతిపాదించింది. దక్షిణ కొరియా సంస్థ ఆర్థిక సాయం చేయడానికి ముందుకువచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్నీ ఆగిపోయాయి. విశాఖ పరిపాలనా రాజధాని అని పల్లవి అందుకున్న తరువాత రెండేళ్ల క్రితం విజయదశమి నాడు అమరావతిలో ఉన్న మెట్రో రైలు కార్పొరేషన్‌ కార్యాలయాన్ని ఇక్కడకు తీసుకువచ్చారు. మూడు నెలల్లో డీపీఆర్‌ కేంద్రానికి పంపుతామని నాటి పురపాలక శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా మెట్రో రైలుకు కేంద్రం సాయం చేస్తామని హామీ ఇచ్చింది. దీనిపై ఎంపీలు పార్లమెంటులో ప్రశ్నించిన ప్రతిసారి...వైసీపీ ప్రభుత్వం రివైజ్డ్‌ డీపీఆర్‌ పంపకపోవడం వల్లే తాము ఏమీ చేయలేకపోతున్నామని కేంద్రం స్పష్టం చేస్తూ వస్తోంది. ఇక్కడ చూస్తే మెట్రో రైలు కార్పొరేషన్‌ విశాఖ వచ్చిన వెంటనే డీపీఆర్‌ తయారు చేసి పంపితే...దానికి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు కొర్రీలు వేస్తూ వచ్చారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో విశాఖ ప్రజల్ని నమ్మించడానికి శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో డీపీఆర్‌ను ఆమోదించారు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 76.90 కి.మీ. పొడవున ట్రాక్‌ వేసి రైళ్లు నడపడానికి రూ.14,309 కోట్లు అవసరమని అంచనాలు రూపొందించారు. పీపీపీలో చేపట్టే ఈ ప్రాజెక్టుకు కేంద్రం 20 శాతం, రాష్ట్రం 20 శాతం నిధులు సమకూరిస్తే మిగిలిన 60శాతం ప్రైవేటు సంస్థ పెట్టాల్సి ఉంటుంది. రాష్ట్రం వాటాగా రూ.2,861.8 కోట్లు పెట్టాల్సి ఉంది. దీనిని రెండు దశల్లో చేపట్టాలని, మొదటి దశలో మూడు కారిడార్లలో 46.23 కి.మీ. ట్రాకును 42 స్టేషన్లతో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి రూ.9,699 కోట్లు అవసరం.

కేంద్రం ఆమోదించాల్సి ఉంది

రాష్ట్రం తయారుచేసి ఆమోదించిన డీపీఆర్‌ను కేంద్రానికి పంపాలి. అక్కడ దీనికి ఆమోదం లభించాలి. ఆ తరువాత బిడ్డర్లను ఆహ్వానించాలి. నిధుల సమీకరణ జరగాలి. ఆ తరువాత కేంద్రంతో పాటు రాష్ట్రం కూడా వారి వాటా నిధులు ఇస్తే అప్పుడు ఈ ప్రాజెక్టు పనులు మొదలవుతాయి. టెండర్‌ దక్కించుకున్న మూడేళ్లలోనే తొలి దశ పూర్తి చేయాలనే నిబంధన పెట్టారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇవేవీ జరిగే అవకాశం లేదు. ఫిబ్రవరిలోనే ఎన్నికల ప్రకటన వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈలోగా కేంద్రం డీపీఆర్‌ను పరిశీలించి ఆమోదిస్తుందనే నమ్మకం లేదు. కాబట్టి ఇదంతా పేపర్లపై ప్రాజెక్టుగానే నిలిచిపోతుంది. మళ్లీ కొత్త ప్రభుత్వం వచ్చాక కొత్త డీపీఆర్‌తోనే దీనికి మోక్షం లభిస్తుంది. అంతవరకు ఇది హామీగానే ఉంటుంది.

ప్రతిపాదించిన కారిడార్లు

- స్టీల్‌ప్లాంటు నుంచి కొమ్మాది వరకు 29 స్టేషన్లతో 34.4 కి.మీ.

- గురుద్వారా నుంచి పాత పోస్టాఫీసు వరకు 6 స్టేషన్లతో 5.07 కి.మీ.

- తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు 7 స్టేషన్లతో 6.75 కి.మీ.

- కొమ్మాది నుంచి భోగాపురం వరకు 12 స్టేషన్లతో 30.67 కి.మీ.

Updated Date - Dec 17 , 2023 | 01:19 AM