సభ్యులు ప్రశ్న .. సంబంధం లేనివారు స్పందన!

ABN , First Publish Date - 2023-06-03T00:41:45+05:30 IST

ప్రజా సమస్యలపై సభ్యుల ప్రశ్నలు.. సమాధానం చెప్పాల్సిన వారికంటే ముందే సంబంధం లేని వ్యక్తులు లోపలికి చొరబడి ఎదురుదాడి.. ప్రేక్షక పాత్ర పోషించిన అధికారులు.. సమర్థవంతంగా తిప్పికొట్టిన ప్రతిపక్ష వర్గం.. వెరసి మాకవరపాలెం మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం శుక్రవారం రసాభాసగా మారింది.

సభ్యులు ప్రశ్న .. సంబంధం లేనివారు స్పందన!
మాకవరపాలెం మండల సర్వసభ్య సమావేశంలో వాదోపవాదనలు

ప్రజా సమస్యలపై ప్రతిపక్ష సభ్యులు గళం

ఇతరులు చొరబడి ఎదురుదాడి

ప్రేక్షపాత్ర పోషించిన అధికారులు

వాకౌట్‌ చేసిన టీడీపీ వర్గీయులు

గంటన్నర తరువాత మళ్లీ యథావిధిగా ప్రారంభం

మాకవరపాలెం, జూన్‌ 2 : ప్రజా సమస్యలపై సభ్యుల ప్రశ్నలు.. సమాధానం చెప్పాల్సిన వారికంటే ముందే సంబంధం లేని వ్యక్తులు లోపలికి చొరబడి ఎదురుదాడి.. ప్రేక్షక పాత్ర పోషించిన అధికారులు.. సమర్థవంతంగా తిప్పికొట్టిన ప్రతిపక్ష వర్గం.. వెరసి మాకవరపాలెం మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం శుక్రవారం రసాభాసగా మారింది. ఎంపీపీ రుత్తల సత్యనారాయణ అధ్యక్షతన ఏర్పాటైన ఈ సమావేశంలో టీడీపీకి చెందిన బూరుగుపాలెం ఎంపీటీసీ రుత్తల యర్రాపాత్రుడు, రాచపల్లి ఎంపీ టీసీ ఆర్‌వై పాత్రుడు మాట్లాడుతూ అన్‌రాక్‌ కంపెనీ ఏర్పాటులో భాగంగా చేపట్టిన భూసేకరణలో రైతుల నుంచి జిరాయితీ భూములు తీసుకున్నారని, వాటిని ఆనుకున్న మిగిలిన భూములు నేటికీ ఆన్‌లైన్‌ కాకపోవడంతో ఆయా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారని పేర్కొన్నారు. అలాగే నిర్వాసితులకు రెండు సెంట్ల స్థలం ఇస్తామని చెప్పి ఏళ్లుగడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. దీనిపై తహసీల్దార్‌ ప్రసాదరావు మాట్లాడుతూ నిర్వాసితులకు రెండు సెంట్లు చొప్పున స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే నిర్వాసితులకు కేటాయించిన 118 ఎకరాల భూమిపై రాచపల్లికి చెం దిన రుత్తల జమిందార్‌, రుత్తల సత్యనారాయణతో పాటు అన్‌రాక్‌ కంపెనీ యాజమాన్యం కోర్టులో కేసులు వేసిందన్నారు. ఈ కేసులు తేలితేతప్ప సమస్య పరిష్కారం చేయలేమని స్పష్టం చేశారు. అనం తరం కొండలఅగ్రహారంలో కోనేరు ఉందని, దానిలో ఆక్రమణలు తొలిగించాలని బూరుగుపాలెం ఎంపీ టీసీ యర్రాపాత్రుడు కోరగా, కొండల అగ్రహారం సర్పంచ్‌ అచ్చియ్యమ్మ లేచి పక్క గ్రామంతో మీకు సంబంధం ఏమిటంటూ ప్రశ్నించారు. దీంతో సమావేశ మందిరం బయటున్న ఆ గ్రామ మాజీ సర్పంచ్‌ చిటికెల రమణ, వైసీపీ నాయకుడు పొలిరెడ్డి రమణ సమావేశం మందిరంలోకి దూసుకువచ్చి ఎదురుదాడి చేశారు. దీంతో టీడీపీ సభ్యులు వారితో వాగ్వాదానికి దిగారు. ఇరువర్గాల మధ్య సుమారు గంటన్నరపాటు తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. బయట వ్యక్తులు లోప లికి వచ్చి గోడవ చేస్తున్నా ఎంపీడీవో అరుణశ్రీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. సమావేశంలో బయట వ్యక్తులు వచ్చి గోడవకు దిగడం ఏమిటని టీడీపీ సభ్యులు వాకౌట్‌ చేసి సమావేశ మందిరం నుంచి బయటకు వెళ్లిపోయారు. అక్కడ కూడా వైసీపీ నాయకులు గోడవకు దిగారు. కొంత సేపటి తరువాత అక్కడి నుంచి వారు వెళ్లిపోవడంతో సమావేశం మళ్లీ కొనసాగింది. పలువురు అధికారులు శాఖా పరంగా చేపట్టిన, చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ సక్రమంగా లేదని సీడీపీవోకు ఎంపీడీవో తెలియజేశారు. అలాగే పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొందని కొందరు సభ్యులు వాపోయారు. ఎంపీడీవో అరుణశ్రీ, జడ్పీటీసీ సత్యవేణి, వైస్‌ ఎంపీపీలు రుత్తల లక్ష్మి, తుళ్లి రాజారావులతో పాటు వివిధ శాఖల అధికారులు ఆయా పంచాయతీల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:41:45+05:30 IST