వైద్యం నిల్... బిల్లులు ఫుల్!
ABN , Publish Date - Dec 23 , 2023 | 01:14 AM
జీవీఎంసీ పరిధిలో ఫస్ట్ రిఫరల్ యూనిట్ (ఆర్‌ఎఫ్‌యు)ల నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఫస్ట్ రిఫరల్ యూనిట్ (ఆర్‌ఎఫ్‌యు)ల నిర్వహణపై విమర్శలు
సరైన సేవలు అందకపోయినా ఏజెన్సీలకు యథాతథంగా బిల్లులు
ఒక్కొక్క దానికి నెలకు రూ.8.1 లక్షలు చెల్లింపు
గడువు ముగిసినా వాటినే కొనసాగించేందుకు జీవీఎంసీ పాలకుల యత్నం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీ పరిధిలో ఫస్ట్ రిఫరల్ యూనిట్ (ఆర్‌ఎఫ్‌యు)ల నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టెండర్ నిబంధనల ప్రకారం వాటిల్లో నిపుణులైన వైద్యులు, సిబ్బంది, లేబొరేటరీలు ఉండాలి. అయితే ఏజెన్సీలు తూతూమంత్రంగా సేవలందించి బిల్లులు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటి పై అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ అధికార పార్టీకి చెందిన కొందరు నేతల ఒత్తిళ్లకు తలొగ్గి వెనకాడుతున్నారు. పైగా టెండర్ గడువు ముగిసినప్పటికీ తిరిగి అదే ఏజెన్సీలను కొనసాగించేందుకు యత్నాలు చేస్తున్నారు.
ఆరిలోవ, శ్రీహరిపురంలో జీవీఎంసీకి ఎఫ్‌ఆర్‌యూలు ఉన్నాయి. గతంలో జీవీఎంసీకి 19 డిస్పెన్సరీలు ఉండేవి. వాటిని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధికి బదలాయించారు. దీంతో రెండు ఆర్‌ఎఫ్‌యూలు మాత్రం జీవీఎంసీ ఆధ్వర్యంలో ఉండిపోయాయి. వీటి నిర్వహణ బాధ్యతలను ఏటా ఏజెన్సీలకు అప్పగిస్తూ వస్తోంది. ఆయా ఆర్‌ఎఫ్‌యూల్లో అన్ని రకాల చికిత్సలకు సంబంధించిన వైద్య నిపుణులు, స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బందితోపాటు ఎక్స్‌రే, స్కానింగ్‌లు, రక్తపరీక్షలు వంటి సేవలు అందుబాటులో ఉంచాలి. దీనికోసం గత ఏడాది మార్చిలో టెండర్లు పిలవగా ఆరిలోవ ఆర్‌ఎఫ్‌యూను రెడ్‌క్రాస్ సొసైటీ, శ్రీహరిపురంలోని ఆర్‌ఎఫ్‌యూను విజయ (బెహరా) వెల్ఫేర్ సొసైటీ దక్కించుకున్నాయి. వాటికి నెలకు రూ.8.1 లక్షల చొప్పున జీవీఎంసీ చెల్లిస్తోంది. ఈ ఏడాది మార్చితో గడువు ముగిసింది. ప్రస్తుతం ఆరిలోవ ఆర్‌ఎఫ్‌యూలో ఒక వైద్యురాలు మాత్రమే వచ్చి కొంతసేపు ఉండి వెళ్లిపోతున్నారు. స్టాఫ్‌నర్సు కూడా ఒక్కరే ఉంటున్నారు. ఇదే పరిస్థితి శ్రీహరిపురం ఆర్‌ఎఫ్‌యూలో కూడా ఉందని సీపీఎం కార్పొరేటర్ బి.గంగారావు ఇటీవల జరిగిన కౌన్సిల్‌లో ఆరోపించారు. టెండర్ గడువు ముగిసిన వెంటనే తిరిగి నిర్వహణకు టెండర్లు పిలవాల్సి ఉన్నప్పటికీ జీవీఎంసీ అధికారులు అలా చేయకుండా పాత ఏజెన్సీలనే కొనసాగిస్తూ వస్తున్నారు. పూర్తిస్థాయిలో సేవలు అందించకపోయినప్పటికీ జీవీఎంసీ ప్రతి నెలా రూ.8.1 లక్షలు చెల్లిస్తోంది. పైగా కొత్తగా టెండర్లు పిలవాలనే నిబంధనను పక్కనపెట్టేసి, పాత ఏజెన్సీలకే తిరిగి వాటిని కట్టబెట్టేందుకు వీలుగా ఇటీవల కౌన్సిల్‌లో ప్రతిపాదన పెట్టారు. దీని వెనుక వైసీపీ నేతలు కొందరు ఉన్నారనే అనుమానంతో సీపీఎం, సీపీఐ కార్పొరేటర్లు అభ్యంతరం తెలిపారు. నిబంధనల ప్రకారం కొత్తగా టెండర్లు పిలవకుండా, పొడిగింపు ప్రతిపాదన వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. దీంతో వైసీపీ నేతలు ఆ అంశాన్ని రద్దు చేయకుండా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాలని మేయర్‌కు సూచించడం, ఆమె కూడా అలాగే చేయడం ఆరోపణలకు బలాన్ని చేకూర్చినట్టయింది.
ఆర్‌ఎఫ్‌యూలను కూడా డీఎంహెచ్‌ఓకే అప్పగించేయాలి
డిస్పెన్సరీల మాదిరిగానే ఆర్‌ఎఫ్‌యూలను కూడా డీఎంహెచ్‌ఓకు అప్పగించడం ఉత్తమమని విపక్ష కార్పొరేటర్లు సూచిస్తున్నారు. ఆర్‌ఎఫ్‌యూలకు ప్రస్తుతం రోగుల తాకిడి పెద్దగా ఉండడం లేదు. దీంతో వాటిని నిర్వహిస్తున్న ఏజెన్సీలు కూడా వైద్యులు, సిబ్బందిని తగ్గించేసుకున్నాయి. ఎక్స్‌రే అనే సదుపాయాన్నే ఎత్తేయడంతో టెక్నీషియన్లను కూడా ఉద్యోగాల నుంచి తప్పించేశారు. ఇలాంటి సమయంలో ఆర్‌ఎఫ్‌యూలను కూడా డీఎంహెచ్‌ఓకు అప్పగించేస్తే వాటిని పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులో తేవడంతోపాటు జీవీఎంసీకి ప్రతి నెలా రూ.16.2 లక్షలు ఆదా అవుతుందని పేర్కొంటున్నారు. దీనిపై జీవీఎంసీ కమిషనర్ దృష్టిసారించి తగిని నిర్ణయం తీసుకోవాలంటున్నారు.