మన్యంలో ముసురు
ABN , First Publish Date - 2023-09-21T23:01:11+05:30 IST
మన్యంలో మూడు రోజులుగా ముసురు వాతావరణం కొనసాగుతున్నది. గురువారం ఏజెన్సీ వ్యాప్తంగా మబ్బుల వాతావరణం ఏర్పడి పాడేరులో తేలికపాటి జల్లులు పడగా, ఒడిశాను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.
అక్కడక్కడా జల్లులతో కూడిన వర్షం
పాడేరు, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): మన్యంలో మూడు రోజులుగా ముసురు వాతావరణం కొనసాగుతున్నది. గురువారం ఏజెన్సీ వ్యాప్తంగా మబ్బుల వాతావరణం ఏర్పడి పాడేరులో తేలికపాటి జల్లులు పడగా, ఒడిశాను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. తాజా వర్షానికి పాడేరులో రహదారులు చిత్తడిగా మారాయి. ఏజెన్సీ మారుమూల, ఒడిశా సరిహద్దున ఉన్న ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లో గురువారం మధ్యాహ్నం కాసేపు ఓ మోస్తరు వర్షం కురిసింది. మిగిలిన మండలాల్లో ఆకాశం మేఘావృతమైంది.
ముంచంగిపుట్టులో...
ముంచంగిపుట్టు: మండల పరిధిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు మార్లు వర్షం పడింది. తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా రహదారులు చిత్తడిగా మారాయి. దీంతో వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, మత్స్యగెడ్డ పాయలు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జోలాపుట్టు, డుడుమ జలాశయాల్లో వరద నీరు ఇన్‌ఫ్లో పెరిగింది. జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పాదనకు అవసరమైన నీటిని డుడుమ నుంచి సరఫరా చేస్తున్నారు.
పిడుగుపాటుకు దుక్కిటెద్దు మృతి
గూడెంకొత్తవీధి: మండలంలోని మొండిగెడ్డ పంచాయతీ తోటలగొంది గ్రామాల్లో పిడుగుపాటుకు ఓ దుక్కిటెద్దు మృతి చెందింది. గురువారం తోటలగొంది చెందిన పశువులను కాపరులు మేతకు గ్రామ శివారు అడవులకు తీసుకు వెళ్లారు. మధ్యాహ్నం ఒక్కసారిగా ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. పశువుల మందపై పిడుగు పడడంతో గబులంగి జోగిదొరకు చెందిన పశువు మృతి చెందింది.