ఆస్పత్రులకు మహర్దశ

ABN , First Publish Date - 2023-06-03T00:54:48+05:30 IST

గిరిజన ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అదనపు సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ‘బ్లాక్‌ పబ్లిక్‌ హెల్త్‌ యూనిట్‌’ పేరిట జిల్లాలో ఎంపిక చేసిన తొమ్మిది పీహెచ్‌సీల్లో రూ.4.5 కోట్ల వ్యయంతో అదనపు భవనాల నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అందుకు 15వ ఆర్థిక సంఘం నుంచి ఒక్కో ఆస్పత్రికి రూ.50 లక్షల చొప్పున మంజూరు చేసింది. ఈ నెలలోనే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభించేందుకు గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ శాఖాధికారులు చర్యలు చేపడుతున్నారు.

ఆస్పత్రులకు మహర్దశ
బ్లాక్‌ పబ్లిక్‌ హెల్త్‌ యూనిట్‌ నిర్మాణానికి ఎంపికైన జి.మాడుగుల, తాజంగి పీహెచ్‌సీలు

జిల్లాలో తొమ్మిది పీహెచ్‌సీలకు అదనపు సదుపాయాలు

కొవిడ్‌-19 నేపథ్యంలో ‘బ్లాక్‌ పబ్లిక్‌ హెల్త్‌ యూనిట్‌’ల నిర్మాణం

ఒక్కో ఆస్పత్రికి రూ.50 లక్షలు కేటాయింపు

15వ ఆర్థిక సంఘం నిధులు రూ.4.5 కోట్లు మంజూరు చేసిన కేంద్రం

(ఆంధ్రజ్యోతి- పాడేరు)

గిరిజన ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అదనపు సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ‘బ్లాక్‌ పబ్లిక్‌ హెల్త్‌ యూనిట్‌’ పేరిట జిల్లాలో ఎంపిక చేసిన తొమ్మిది పీహెచ్‌సీల్లో రూ.4.5 కోట్ల వ్యయంతో అదనపు భవనాల నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అందుకు 15వ ఆర్థిక సంఘం నుంచి ఒక్కో ఆస్పత్రికి రూ.50 లక్షల చొప్పున మంజూరు చేసింది. ఈ నెలలోనే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభించేందుకు గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ శాఖాధికారులు చర్యలు చేపడుతున్నారు.

కొవిడ్‌ ప్రభావంతో పీహెచ్‌సీలకు ప్రోత్సాహం

కొవిడ్‌-19 ప్రభావం నేపథ్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వసతి, ఇతర సదుపాయాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పీహెచ్‌సీల్లో పరిమిత వసతి వుండడం, కొవిడ్‌ బాధితులకు, సాధారణ రోగులకు ఒకే చోట వైద్య సేవలు అందించడం వల్ల మరిన్ని ఇబ్బందులు ఏర్పడతాయని, అందువల్ల పీహెచ్‌సీలకు అదనపు సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్రాల నుంచి కేంద్రం ప్రతిపాదనలు కోరింది. ఈ మేరక అన్ని పీహెచ్‌సీల్లో ఉన్న సదుపాయాలపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించింది. వీటిని పరిశీలించిన కేంద్రం ఈ ఏడాది తొమ్మిది పీహెచ్‌సీలను ఎంపిక చేసిన ఒక్కోదానికి రూ.50 లక్షల చొప్పున 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో పీహెచ్‌సీకి అనుబంధంగా ‘బ్లాక్‌ పబ్లిక్‌ హెల్త్‌ యూనిట్‌’ను నిర్మించాలని కేంద్రం సూచించింది.

తొమ్మిది పీహెచ్‌సీలు ఇవే...

బ్లాక్‌ పబ్లిక్‌ హెల్త్‌ యూనిట్‌ (బీపీహెచ్‌యూ)లను నిర్మించేందుకు జిల్లాలోని తొమ్మిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఎంపిక చేశారు. వాటిలో పాడేరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో జి.మాడుగుల, డుంబ్రిగుడ, చింతపల్లి మండలం తాజంగి, లోతుగెడ్డ, అనంతగిరి మండలం భీమవరం, రంపచోడవరం డివిజన్‌ పరిధిలో.... మారేడుమిల్లి, రాజవొమ్మంగి, గంగవరం, చింతూరు డివిజన్‌ పరిధిలో ఇడుగురాళ్లపల్లి పీహెచ్‌సీలు వున్నాయి.

బీపీహెచ్‌యూలను ఎలా నిర్మిస్తారంటే..

బ్లాక్‌ పబ్లిక్‌ హెల్త్‌ యూనిట్‌లను ఏలా నిర్మించాలనేది అధికారులు ప్రణాళికలను రూపొందించారు. రోగులు వేచి ఉండేందుకు ఒక హాల్‌, బాధితులకు పరీక్షలు నిర్వహించేందుకు పెద్ద ల్యాబ్‌, కార్యాలయం/కంప్యూటర్‌కు ఒక గది, స్టోర్‌ రూమ్‌, మహిళలు, పురుషులకు వేర్వేరుగా మరుగుదొడ్లను నిర్మిస్తారు. పీహెచ్‌సీకు వచ్చే రోగులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలన్నీ ఈ బ్లాక్‌ పబ్లిక్‌ హెల్త్‌ యూనిట్‌లోనే నిర్వహిస్తారని తెలిసింది.

Updated Date - 2023-06-03T00:54:48+05:30 IST