లోతేరు- ఆలూరు రోడ్డుకు మోక్షమెన్నడో!
ABN , First Publish Date - 2023-06-05T01:09:51+05:30 IST
అరకులోయ మండలం లోతేరు నుంచి ఉమ్మడి విజయనగరం జిల్లా సరిహద్దులోని పాచిపెంట మండలం ఆలూరు వరకు పుష్కరకాలం క్రితం చేపట్టిన రహదారి అభివృద్ధి పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. సుమారు ఐదున్నర కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ పనులకు అటవీ అధికారులు అభ్యంతరం చెప్పడం, ఆర్‌అండ్‌బీ అధికారుల తీరుపై కాంట్రాక్టర్ కోర్టుకెక్కడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. తరువాత టీడీపీ హయాంలో అటవీ శాఖ నుంచి అభ్యంతరాలను క్లియర్ చేసుకోగా, గతంలో మంజూరైన నిధులు వెనక్కు మళ్లాయి. తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కొత్తగా అంచనాలను తయారు చేయడంగానీ, నిధులు మంజూరుకు ప్రయత్నాలుగానీ చేయలేదు. ప్రజాప్రతినిధులు సైతం పట్టించుకోవడంలేదు.
పుష్కరకాలం క్రితం రూ.5.3 కోట్ల నాబార్డు నిధులతో నిర్మాణానికి శ్రీకారం
మట్టి పనులు పూర్తిచేసిన తరువాత అటవీ శాఖ అభ్యంతరం
ఆర్‌అండ్‌బీ అధికారుల తీరుపై కోర్టుకెక్కిన కాంట్రాక్టర్
టీడీపీ హయాంలో అటవీ శాఖ నుంచి అనుమతులు
అప్పటికే నిధులు వెనక్కు మళ్లడంతో మొదటికొచ్చిన కథ
సవరించిన అంచనాలతో మళ్లీ ప్రతిపాదనలు
నిధులు మంజూరయ్యే సమయంలో మారిన ప్రభుత్వం
నాలుగేళ్ల నుంచి పట్టించుకోని వైసీపీ పాలకులు
కలగా మారిన అంతర్ జిల్లా రహదారి నిర్మాణం
అరకులోయ, జూన్ 4: అరకులోయ మండలం లోతేరు నుంచి ఉమ్మడి విజయనగరం జిల్లా సరిహద్దులోని పాచిపెంట మండలం ఆలూరు వరకు పుష్కరకాలం క్రితం చేపట్టిన రహదారి అభివృద్ధి పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. సుమారు ఐదున్నర కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ పనులకు అటవీ అధికారులు అభ్యంతరం చెప్పడం, ఆర్‌అండ్‌బీ అధికారుల తీరుపై కాంట్రాక్టర్ కోర్టుకెక్కడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. తరువాత టీడీపీ హయాంలో అటవీ శాఖ నుంచి అభ్యంతరాలను క్లియర్ చేసుకోగా, గతంలో మంజూరైన నిధులు వెనక్కు మళ్లాయి. తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కొత్తగా అంచనాలను తయారు చేయడంగానీ, నిధులు మంజూరుకు ప్రయత్నాలుగానీ చేయలేదు. ప్రజాప్రతినిధులు సైతం పట్టించుకోవడంలేదు.
రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్నప్పుడు అరకులోయ మండలం లోతేరు నుంచి విజయనగరం జిల్లా సరిహద్దులోని పాచిపెంట మండలం ఆలూరు గ్రామం (ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా) వరకు 18 కిలోమీటర్ల మేర తారు రోడ్డు నిర్మాణానికి నాబార్డు నుంచి రూ.5.3 కోట్లు మంజూరయ్యాయి. రోడ్డు నిర్మాణ పనులకు 2011 జూన్ 7వ తేదీన నాటి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు, అప్పటి కేంద్ర గిరిజన, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కిశోర్‌చంద్ర సూర్యనారాయణదేవ్ లోతేరులో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆర్‌అండ్‌బీ అధికారులు టెండర్లు పిలిచి తక్కువ కోట్ చేసిన కాంట్రాక్టర్‌కు పనులు అప్పగిచారు. లోతేరు నుంచి మొర్రిగుడ, ఇరగాయి బోందుగుడ మీదుగా గాతపాడు వరకు 15 కిలోమీటర్ల మేర మట్టి పనులు పూర్తి చేశారు. కల్వర్టులు నిర్మిస్తుండగా అటవీ శాఖ అధికారులు అభ్యంతరం చెప్పారు. అటవీ భూభాగంలో తమ అనుమతి లేకుండా రోడ్డు ఎలా నిర్మిస్తారంటూ పనులను నిలుపుదల చేయించారు. మరోవైపసు పనులు చేపట్టిన కాంట్రాక్టర్... ఆర్‌అండ్‌బీ అధికారులపై కోర్టులో కేసు వేశాడు. అటవీ శాఖ నుంచి అనుమతులు తీసుకోకుండా తనకు కాంట్రాక్టు అప్పగించారని, ఇప్పుడు పనులు ఆపేయాల్సి రావడంతో తనకు తీవ్రనష్టం వాటిల్లుతుందని పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ కేసు నడుస్తుండగానే రాష్ట్ర విభజన, సాధారణ ఎన్నికలు జరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆర్‌అండ్‌బీ అధికారులు లోతేరు-ఆలూరు రోడ్డు నిర్మాణం విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రోడ్డు నిర్మాణానికి అటవీ శాఖ నుంచి అనుమతులు తీసుకువచ్చారు. అయితే గతంలో మంజూరైన నాబార్డు నిధులు అప్పటికే వెనక్కు మళ్లాయి. నాటి అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, ఎస్టీ కమిషన్ సభ్యుడు సివేరి సోమ... అరకు-లోతేరు రహదారి పనుల పరిశీలనకు వచ్చిన ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. అటవీ శాఖ నుంచి అనుమతులు వచ్చాయని, రోడ్డు నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయించాలని కోరారు. ఇది జరిగిన కొద్ది రోజులకే కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలను మావోయిస్టుల కాల్చి చంపడంతో రోడ్డు నిర్మాణం గురించి పట్టించుకునేవారు లేకపోయారు. తరువాత ఆరేడు నెలలకు సాధారణ ఎన్నికలు జరిగి వైసీపీ అధికారంలోకి వచ్చింది. చెట్టి ఫాల్గుణ ఎమ్మెల్యేగా, జి.మాధవి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇది జరిగి నాలుగేళ్లు దాటింది. లోతేరు-ఆలూరు రోడ్డు నిర్మాణం కార్యరూపం దాల్చలేదు. ఆర్‌అండ్‌బీ అధికారులతో కనీసం ప్రతిపాదనలు కూడా తయారు చేయించలేదు. ఇప్పటికైన ఎంపీ, ఎమ్మెల్యేతోపాటు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రాజన్నదొర ( పాచిపెంట మండలం మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సాలూరు నియోజవర్గంలోనే వుంది) స్పందించి అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలను కలిపే లోతేరు- ఆలూరు తారు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాలని ఇరు జిల్లాల గిరిజన ప్రాంత ప్రజలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు.