రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి
ABN , First Publish Date - 2023-09-22T00:58:59+05:30 IST
మండలంలోని జాతీయ రహదారి పులపర్తి జంక్షన్ వద్ద గురువారం రాత్రి ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొనడంతో లారీ డ్రైవర్ మృతి చెందగా, క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.
- పులపర్తి వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొన్న మరో లారీ
- క్లీనర్‌కు స్వల్ప గాయాలు
ఎలమంచిలి, సెప్టెంబరు 21: మండలంలోని జాతీయ రహదారి పులపర్తి జంక్షన్ వద్ద గురువారం రాత్రి ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొనడంతో లారీ డ్రైవర్ మృతి చెందగా, క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. రూరల్ ఎస్‌ఐ సన్నిబాబు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదంలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ ఎస్‌కే బాషా(40) మృతి చెందినట్టు ఎస్‌ఐ తెలిపారు. అనకాపల్లి నుంచి తుని వైపు వెళుతున్న లారీ మరమ్మతుకు గురికావడంతో నిలిచిపోయిందని, అదే మార్గంలో వెళుతున్న మరో లారీ వెనుక నుంచి ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
చికిత్స పొందుతూ తాపీ మేస్త్రీ మృతి
సబ్బవరం, సెప్టెంబరు 21 : మండలంలోని ఇరువాడ రోడ్డులో హెచ్‌పీసీఎల్ పైపులైన్ వద్ద ఈ నెల 19 రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న తాపీ మేస్త్రీ బుధవారం ఆర్ధరాత్రి మృతి చెందాడు. దీనికి సంబంధించి వివరాలు ఇలా వున్నాయి. ఈ నెల 19న ఎదురెదురుగా బైక్‌లో డీకొన్న సంఘటనలో తాపీమేస్త్రీ జెట్టి భీమస్వామి(43) తీవ్రంగా గాయపడి కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం మృతి చెందినట్టు సీఐ రంగనాథం తెలిపారు. అతనికి భార్య సూరమ్మ, కుమార్తెలు లలిత, గాయత్రీ ఉన్నారు. ప్రమాదానికి కారకుడైన నెల్లి మాధవరావుపై కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. మృతదేహానికి కేజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు సీఐ తెలిపారు.
12 కిలోల గంజాయితో ఒకరి అరెస్టు
చీడికాడ, సెప్టెంబరు 21: మండలంలోని అప్పలరాజుపురం వద్ద ఒక వ్యక్తి నుంచి 12 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ పి.రామారావు చెప్పారు. ఏజెన్సీ నుంచి చీడికాడ మండలం మీదుగా గంజాయి తరలిస్తున్నట్టు అందిన సమాచారం మేరకు గురువారం ఉదయం అప్పలరాజుపురం వద్ద వాహనాల తనిఖీ చేపట్టామని తెలిపారు. కోనాం వైపు నుంచి వస్తున్న బైక్‌కు ఆపడానికి ప్రయత్నించగా పోలీసులను చూసి వెనక్కు మళ్లించారని చెప్పారు. దీంతో పోలీసులు వెంబడించి బైక్‌పై వెనుక కూర్చున్న కొర్రా దాసరీరావును, 12 కిలోల గంజాయితో పట్టుకున్నారని, బైక్ నడుపుతున్న వ్యక్తి పరారయ్యాడని వెల్లడించారు. కేసు నమోదుచేసి నిందితుడిని చోడవరం కోర్టుకి తరలించామని ఆయన తెలిపారు.
ఆర్‌బీకేలో టీవీ, రికార్డులు చోరీ
గొలుగొండ, సెప్టెంబరు 21: మండంలోని పప్పుశెట్టిపాలెం రైతు భరోసా కేంద్రంలో రికార్డులు, టీవీ చోరీకి గురైనట్టు అందిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ నారాయణరావు తెలిపారు. రెండు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు పప్పుశెట్టిపాలెం ఆర్‌బీకే తలుపుల గడియలు విరగ్గొట్టి టీవీ, రికార్డులను అపహరించుకుపోయినట్టు సచివాలయ కార్యదర్శి ఫిర్యాదు చేసినట్టు ఆయన చెప్పారు. గ్రామంలో కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిపారు.