ప్రహసనంగా భూ సర్వే

ABN , First Publish Date - 2023-04-07T00:50:31+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం కింద చేపడుతున్న సమగ్ర భూసర్వే ప్రహసనంగా మారింది. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులతో భూసర్వే ముందుకు సాగే పరిస్థితి కానరావడం లేదు.

ప్రహసనంగా భూ సర్వే
రావికమతం మండలం కొమిర గ్రామంలో సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేస్తున్న తహసీల్దార్‌, సర్వే సిబ్బంది (ఫైల్‌ ఫొటో)

పట్టాదారు పాస్‌పుస్తకంలో కన్నా ఎక్కువ భూమి ఉంటే ప్రభుత్వానిదిగా నమోదు

రైతుల నుంచి పెద్దఎత్తున అభ్యంతరాలు

పట్టించుకోని స్థానిక అధికారులు

రాష్ట్ర భూపరిపాలన విభాగానికి ఫిర్యాదు చేస్తున్న రైతులు

అభ్యంతరాలను మరోసారి పరిశీలించాకే నివేదికలు పంపాలని ఆదేశం

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం కింద చేపడుతున్న సమగ్ర భూసర్వే ప్రహసనంగా మారింది. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులతో భూసర్వే ముందుకు సాగే పరిస్థితి కానరావడం లేదు. భూముల రక్షణ కోసమే రీసర్వే జరుపుతున్నామని ప్రభుత్వం చెబుతుండగా, మరోవైపు తప్పుల తడకగా సర్వే నివేదికలు సిద్ధం చేయడాన్ని భూ యజమానులు ఆక్షేపిస్తున్నారు. అధికారులు ఇష్టానుసారంగా సర్వే చేస్తున్నారంటూ పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

జిల్లాల పునర్విభజనకు ముందు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ప్రయోగాత్మకంగా 12 గ్రామాల్లో సమగ్ర భూముల సర్వే నిర్వహించారు. అనకాపల్లి జిల్లా ఏర్పాటైన తరువాత సర్వే ప్రక్రియను పునఃప్రారంభించారు. జిల్లాలో మొత్తం 733 రెవెన్యూ గ్రామాల పరిధిలో అన్ని రకాల భూములను దశల వారీగా సర్వే చేయాలని నిర్ణయించారు. సమగ్ర సర్వే కోసం డ్రోన్లను వినియోగిస్తున్నారు. తొలిదశ కింద 393 గ్రామాల్లో సర్వే చేపట్టిన అధికారులు ఇంతవరకు 143 గ్రామాల్లో సర్వే పూర్తి చేసినట్టు నివేదికలు తయారు చేశారు.

నివేదికలపై రైతులు అభ్యంతరం

తొలిదశ నిర్వహించిన భూముల సర్వేలో అనేక తప్పులు దొర్లాయని రైతులు, భూయజమానులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పలువురు రైతులు రాష్ట్ర భూపరిపాలన విభాగానికి ఫిర్యాదులు చేశారు. దీనిపై స్పందించిన అధికారులు.. రైతుల అభ్యంతరాలను మరోసారి పరిశీలించి, ఆ తరువాతే నివేదికలు పంపాలని ఆదేశించినట్టు సమాచారం. ఎన్నో ఏళ్లుగా తమ ఆధీనంలో ఉన్న భూమి విస్తీర్ణాన్ని తగ్గించడం, వారసత్వంగా వచ్చిన భూముల విస్తీర్ణం తగ్గించి చూపడం, కొందరికి ఎక్కువ చూపడం వంటి తప్పిదాలు చోటు చేసుకున్నాయని తెలిసింది. ఉదాహరణకు ఒక వ్యక్తిపేరుతో 30 సెంట్లు భూమి ఉంటే సర్వే నివేదిక ఆధారంగా రెండు మూడు సెంట్లు ఎక్కువ లేదా తక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా వన్‌బీ, అడంగల్‌లో నమోదై ఉన్న భూమూలు విస్తీర్ణం, రీసర్వే నివేదికల్లో తక్కువగా చూపుతుండడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు.

చోడవరం, రావికమతం, వి.మాడుగుల, దేవరాపల్లి, కె.కోటపాడు మండలాల్లో భూముల విస్తీర్ణం హెచ్చు తగ్గులపై అనేక ఫిర్యాదులు అందాయి. సర్వే సందర్భంగా ఒక రైతుకు చెందిన పట్టాదారు పాస్‌పుస్తకంలో వున్న విస్తీర్ణం కన్నా అదనంగా భూమి వున్నట్టు గుర్తిస్తే.. దానిని సదరు రైతుకే అప్పగించాలి. కానీ దీనిని ప్రభుత్వ భూమిగా నమోదు చేస్తున్నారని భూ యజమానులు ఆరోపిస్తున్నారు. అనకాపల్లి, కశింకోట, అచ్యుతాపురం, రాంబిల్లి, ఎలమంచిలి, నక్కపల్లి, ఎస్‌.రాయవరం, పాయకరావుపేట మండలాల్లో ఇటువంటి తప్పిదాలు జరిగినట్టు సమాచారం. సర్వే నివేదికలో తప్పిదాలను అధికారుల దృష్టికి తీసుకువెళితే పట్టించుకోవడంలదేని, పైగా సరైన సమాధానం చెప్పడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల పట్టాదారు పాసుపుస్తకాల్లో నమోదైన భూముల వివరాలకు, క్షేత్రస్థాయిలో సర్వే అధికారులు నిర్ణయిస్తున్న భూముల సరిహద్దులకు భారీ వ్యత్యాసం కనిపిస్తున్నది. బుచ్చెయ్యపేట మండలంలోని 14 గ్రామాల్లో సర్వే నిర్వహించగా అధికారులు ఇచ్చిన నివేదికలపై భారీగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో మరోసారి సర్వే నిర్వహిస్తున్నారు. పాయకరావుపేట మండలంలో సర్వే పూర్తయిన గ్రామాల్లో రైతుల నుంచి 150 వరకు అభ్యంతరాలు అధికారులకు అందాయి. ఆయా భూముల్లో సాగులో వున్నవి, ఖాళీగా ఉన్నవి, ప్రభుత్వ పోరంబోకు భూముల మ్యాప్‌లు సేకరించారు. రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో అధికారులు తప్పులు సరిదిద్దే పనిలో నిమగ్నమయ్యారు. ఇదిలావుండగా తొలి దశ చేపట్టిన రీసర్వే పనులే ఇంకా పూర్తికాలేదు. రెండోదశలో 250 గ్రామాల్లో సర్వే చేయాలని అధికారులు నిర్ణయించడంపై విమర్శలు వస్తున్నాయి. భూసర్వే త్వరితగతిన పూర్తి చేయాలని ఉన్నతస్థాయి అధికారులు కిందిస్థాయిలో సర్వేయర్‌లపై తీవ్రఒత్తిడి చేస్తున్నారు. ఈ కారణంగానే సమగ్ర సర్వేలో తప్పిదాలు చోటుచేసుకుంటున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

అభ్యంతరాలపై దరఖాస్తు చేసుకోవచ్చు

-కె.శ్రీనివాసరావు, ఏడీ, సర్వే, ల్యాండ్‌ రికార్డ్స్‌ విభాగం

సమగ్ర భూసర్వేపై భూయజమానులకు ఎటువంటి అభ్యంతరాలున్నా దరఖాస్తు చేసుకోవచ్చు. పాత రికార్డుల్లో లోపాలు ఉంటాయి. వాటిని సరి చేస్తాం. క్షేత్రస్థాయిలో పరిశీలించిన తరువాత ఆ భూములు ఎవరికి చెందితే వారికి వర్తించేలా సర్వేలో మార్పులు చేస్తాం. జిరాయితీ భూముల సర్వే సందర్భంగా అదనంగా భూమి ఉన్నట్టు గుర్తిస్తే, ఆయా భూములను ప్రభుత్వానివిగా మార్పుచేసే అవకాశమే లేదు. భూ యజమాని లేదా కుటుంబ సభ్యుల నుంచి నిరభ్యంతర పత్రాలను స్వీకరించి ఆ భూమికి ఎవరికి చెందితే వారికే కేటాయిస్తాం. జిల్లాలో ఇప్పటికే సర్వే పూర్తయిన గ్రామాల్లో సర్వే రాళ్లను పాతుతున్నారు.

Updated Date - 2023-04-07T00:50:31+05:30 IST